సమన్వయంతో సమర్థ వినియోగం  | CS Sameer Sharma comments about Department of Industry | Sakshi
Sakshi News home page

సమన్వయంతో సమర్థ వినియోగం 

Nov 11 2021 3:31 AM | Updated on Nov 11 2021 3:31 AM

CS Sameer Sharma comments about Department of Industry - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు జీవితకాలం తోడు అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర పరిశ్రమలశాఖ వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని పరిశ్రమలకు సింగిల్‌విండో విధానంలో చేయూత అందించే విధంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’తో పాటు వివిధ విభాగాల వనరులను సమర్థంగా వినియోగించుకునే విధంగా నివేదిక రూపొందించే బాధ్యతను పరిశ్రమలశాఖ బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ)నకు అప్పగించింది. విస్తృత అధ్యయనం అనంతరం పరిశ్రమలశాఖ పరిధిలోకి వచ్చే ఏపీఐఐసీ, ఏపీ ఈడీబీ, ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్, ఏపీఎస్‌ఎఫ్‌సీ, ఏపీటీపీసీలతోపాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వంటి విభాగాలను సమన్వయం చేసుకుంటూ మానవ వనరులను ఎలా వినియోగించుకోవచ్చన్న దానిపై ప్రతి విభాగానికి స్పష్టమైన విధివిధానాలను సూచిస్తూ బీసీజీ నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందజేసింది.

ఈ నివేదికలోని అంశాల అమలుపై పరిశ్రమలశాఖ అధికారులు వివిధ శాఖల అధికారులతో చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణం, నిర్వహణ వంటి వాటిల్లో ఏపీఐఐసీ, ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ల మధ్య సమన్వయం కొరవడింది. కొన్ని సందర్భాల్లో ఒకేపనిని రెండు సంస్థలు చేపట్టడంతో మానవ వనరులు, సమయం వృధా అవుతున్నాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తూ బీసీజీ పలు సూచనలు చేసింది. పరిశ్రమలశాఖ ఏయే రంగాల్లో పటిష్టంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉందనే విషయాలను ఈ నివేదికలో వివరించింది. 

అన్నీ వైఎస్సార్‌ ఏపీ వన్‌ గొడుగు కిందకు 
అన్ని శాఖలను సమన్వయపర్చేలా వైఎస్సార్‌ ఏపీ వన్‌ పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని బీసీజీ సిఫారసు చేసింది. వైఎస్సార్‌ ఏపీ వన్‌కి ప్రత్యేకంగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ని, 20 నుంచి 25 మంది ఉద్యోగులను నియమించాలంది. ఏడాదికి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల బడ్జెట్‌ అవసరమవుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలను పునరుజ్జీవింప చేసేవిధంగా ఒక ప్రత్యేక సెల్‌తో పాటు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్, వైఎస్సార్‌ బడుగు వికాసం, పెర్ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సెల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ నివేదికను సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ.. రాష్ట్రంలోని పరిశ్రమలకు జీవితకాలం హ్యాండ్‌హోల్డింగ్‌ ఇవ్వడంతోపాటు కొత్తగా యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే వారికి సహాయకారిగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాలని పరిశ్రమలశాఖ అధికారులను బుధవారం ఆదేశించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement