
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం సివిల్ జడ్జి కోర్టు సమన్లు జారీ చేసింది. తన పరువుకు భంగం కలిగించేలా అసత్యాలతో కూడిన వార్తను ప్రచురించిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని గతంలో హిందూపురం టూటౌన్ సీఐగా పనిచేసిన సీఐ రియాజ్ అహ్మద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
వ్యక్తిగత అంశాలను ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించి తన పరువుకు నష్టం కలిగించారంటూ సదరు సీఐ 2024లో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు శుక్రవారం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు స్థానిక విలేకరులకూ నోటీసులు పంపింది. ఆగస్టు 18న కోర్టుకు హాజరు కావాలని అందులో పేర్కొంది.
కాగా.. తనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలున్నాయని, ఎన్నికల సమయంలో సహకరించేందుకే తనను హిందూపురం పంపించారని అబద్ధపు ప్రచారం చేసినట్టు సీఐ రియాజ్ అహ్మద్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా తాను 2024 జూన్ 6న సస్పెండ్ కాగా, 3వ తేదీనే సస్పెండ్ అయినట్టు కథనాలు ప్రసారం చేశారని, దురుద్దేశ పూర్వకంగానే ఇలా ప్రసారం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
