
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు
పూర్తి వివరాలను సమర్పించాలని కేంద్రానికి సూచన
విచారణ జూన్‌కు వాయిదా
సాక్షి, అమరావతి: జెడ్ ప్లస్ భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ విషయంలో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్, సీఆర్‌పీఎఫ్ డీజీ, ఎన్‌ఎస్‌జీ డీజీ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది. జెడ్ ప్లస్ భద్రతకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించే విషయంలో తగిన చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ వైఎస్ జగన్ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర భద్రతా సంస్థలైన సీఆర్‌పీఎఫ్ లేదా ఎన్‌ఎస్‌జీలతో తగిన భద్రత కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధం అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి వాదనలు విన్నారు.
వైఎస్ జగన్ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ, నిర్దిష్ట ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా వైఎస్ జగన్‌కు ఉన్న ప్రాణహానిని తాజాగా, స్వతంత్రంగా మదింపు చేసి జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. జగన్‌కు ఉన్న ప్రాణహానిని, ఆయనపై గతంలో జరిగిన హత్యాయత్నాన్ని పరిగణనలోకి తీసుకుని జెడ్ ప్లస్ భద్రత కల్పించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఎలాంటి నోటీసు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైఎస్ జగన్ భద్రతను భారీగా కుదించేశారని, ఇటీవల పలు సందర్భాల్లోనూ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని చెప్పారు. పర్యటనలు, పరామర్శలకు వెళ్లినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నారు. జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించాలని పలుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని నాగిరెడ్డి వివరించారు.
భద్రత విషయంలో వైఎస్ జగన్ గతంలో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పుడు మళ్లీ పిటిషన్ వేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్‌జీ) పసల పొన్నారావు స్పందిస్తూ పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని చెప్పారు.