పత్తి కొనుగోళ్లు ప్రారంభం..!

Cotton Purchases Begin In AP - Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా 16.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగు 

26 లక్షల బేళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా 

రాష్ట్రంలో 41 జిన్నింగ్‌ మిల్లులు, 12 మార్కెట్‌ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు  

రైతుల నుంచి మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేస్తాం: సీసీఐ బ్రాంచి మేనేజర్‌ 

సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా కేంద్రాల్లో వీఏఏ (విలేజీ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌) వద్ద రైతులు తమ పేర్లు నమోదు చేసుకొన్న వెంటనే స్లాట్‌ నంబర్‌ కేటాయిస్తున్నారు. వారికి కేటాయించిన సమయంలో సమీపంలోని మార్కెట్‌ యార్డులు, జిన్నింగ్‌ మిల్లులకు పత్తి తీసుకెళుతున్నారు. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, కర్నూలు, పశి్చమ గోదావరి జిల్లాల్లోని 23 జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే పత్తి కొనుగోళ్లు ఊపందుకొంటున్నాయని అధికారులు తెలిపారు.  

జిల్లాల వారీగా పంట దిగుబడుల అంచనా... 
పత్తి దిగుబడులపై జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ–క్రాప్‌లో పంట నమోదు తప్పనిసరి. పంట దిగుబడులు ఎకరాకు ప్రకాశం జిల్లాలో 6.83 క్వింటాళ్లు, కర్నూలు– 10.32,  గుంటూరు– 12, కృష్ణా–12.7, పశి్చమగోదావరి–10.29, విజయనగరం–5.95, శ్రీకాకుళం–6, తూర్పుగోదావరి జిల్లాలో 4.91 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. సీసీఐ తెలంగాణలో ఎకరాకు 15 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తుండగా, రాష్ట్రంలో ఎకరాకు సరాసరిన 9 క్వింటాళ్ల మాత్రమే కొనుగోలు చేస్తోందని, విడతల వారీగా కొనుగోలు చేయడం వల్ల కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి తెలంగాణలో విక్రయిస్తున్నట్లు  ఆరోపించారు. 

ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు 
రాష్ట్రంలో రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం పత్తి కొనుగోలు చేస్తున్నాం. తేమ శాతం 12 లోపు ఉండేలా రైతులు చూసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పత్తి కొనుగోళ్లను వేగవంతం చేశాం. 
– జి.సాయి ఆదిత్య, సీసీఐ బ్రాంచి మేనేజర్, గుంటూరు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top