ఇప్పటి వరకు 10 వేల మెట్రిక్ టన్నుల పత్తిని మాత్రమే సేకరించిన సీసీఐ
ఎల్–1, ఎల్–2 నిబంధనలతో సగమే తెరుచుకున్న జిన్నింగ్ మిల్లులు
మొత్తం మిల్లులు తెరవకపోతే 6వ తేదీ నుంచి కొనుగోళ్లు నిలిపివేస్తామని జిన్నింగ్ మిల్లర్ల అల్టిమేటం
ఈ సీజన్‌లో పత్తి కొనుగోలు లక్ష్యం 29 లక్షల మెట్రిక్ టన్నులు
సాక్షి, హైదరాబాద్: సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా) రకరకాల నిబంధనల నేపథ్యంలో రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసి గత నెల 21 నుంచే కొనుగోళ్లు ప్రారంభిస్తున్న ట్టు సీసీఐ ప్రకటించినా, ఇప్పటి వరకు కేవలం 10,434 మెట్రిక్ టన్నుల పత్తిని మాత్రమే సేకరించింది.
ఈ సీజన్‌లో రాష్ట్రంలో సుమారు 46 లక్షల ఎకరాల్లో సుమారు 25 లక్షల మంది రైతులు పత్తి సాగు చేయగా, 29 లక్షల మెట్రిక్ టన్ను ల పత్తి ఉత్పత్తి అవుతుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. సీసీఐ తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్‌లో ఇప్పటి వరకు 22,587 మంది రైతులు స్లాట్ బుక్ చేసుకున్నారు.
తెరుచుకున్న జిన్నింగ్ మిల్లులు 172 మాత్రమే
320 జిన్నింగ్ మిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోళ్లకు నోటిఫై చేసింది. అయితే జిన్నింగ్ మిల్లుల సామర్థ్యం, పత్తి నుంచి దూదిని, గింజలను వేరు చేసి ఇచ్చినందుకు సీసీఐ చెల్లించే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని మిల్లులను ఎల్–1, ఎల్–2 తరహాలో ఎల్–12 వరకు విభజించారు. ఇందులో ఎల్–1 కేటగిరీలో గుర్తించిన మిల్లుల్లో తొలుత పత్తి సేకరించిన తర్వాతే ఎల్–2, ఆ తర్వాత ఎల్–3 మిల్లులకు పత్తిని పంపించేలా సీసీఐ నిబంధనలు విధించింది.
ముడి పత్తిని మిల్లుకు తీసుకొచ్చిన తర్వాత జిన్నింగ్ చేసి బేల్స్‌గా, విత్తనాలుగా వేరు చేస్తారు. ఒక బేల్ పత్తి (దూది) కోసం సుమారు 485 కిలోల పత్తికాయలను జిన్నింగ్ చేయాల్సి ఉంటుంది. 485 కిలోల పత్తికాయలను జిన్నింగ్ చేసినందుకు మిల్లులకు సీసీఐ రూ.1,440 చెల్లిస్తుంది. కాగా ప్రస్తుతం 172 మిల్లులు మాత్రమే తెరుచుకోగా, కేవలం ఎల్–1 కింద 117 మిల్లుల్లో మాత్రమే కొనుగోళ్లు సాగే పరిస్థితి ఏర్పడింది.
రైతులు గతంలో తమకు దగ్గరలో ఉన్న జిన్నింగ్ మిల్లుకు వెళ్లి పత్తిని విక్రయించుకునే పరిస్థితి ఉండగా, ఈసారి ఆ పరిస్థితి లేదు. కపాస్ కిసాన్ యాప్‌లో సీసీఐ ఆయా జిల్లాల్లోని ఎల్–1 కేటగిరీలో ఉన్న మిల్లుల జాబితాను మాత్రమే పొందుపరచడంతో రైతులు దూరమైనా, అక్కడికే పత్తిని తరలించాల్సి వస్తోంది. ఒకటి, రెండు ఎకరాల చిన్న చిన్న కమతాలు ఉండే రైతులు రవాణా ఖర్చులు భరించి దూరానికి వెళ్లి పత్తి విక్రయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆంక్షలపై మిల్లర్ల అల్టిమేటం
కపాస్ కిసాన్ యాప్‌లో రైతుల రిజి్రస్టేషన్ తప్పనిసరి చేసిన సీసీఐ... 8 నుంచి 12 శాతం లోపు తేమ ఉంటేనే పత్తికి మద్దతు ధర రూ. 8,110 ఇచ్చేలా నిబంధనలు విధించింది. ఒక రైతు ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే మద్దతు ధరకు అమ్మేలా నిబంధనలు మార్చారు.
ఎల్–1, ఎల్–2 ఇలా మిల్లులకు పత్తి పంపేలా నిబంధనలు మార్చడాన్ని మిల్లర్లు ఒప్పుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో నిబంధనలను సడలించి, మొత్తం మిల్లుల్లో పత్తి జిన్నింగ్ అయ్యేలా చర్యలు తీసుకోకపోతే ఈనెల 6వ తేదీ నుంచి పత్తి సేకరణ నిలిపివేస్తామని జిన్నింగ్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అల్టిమేటం ఇచ్చారు.


