పెట్టుబడులను ఆకర్షించేలా..

Connection of industrial parks with national highways - Sakshi

జాతీయ రహదారులతో పారిశ్రామికపార్కుల అనుసంధానం

1,318 కి.మీ. రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన పారిశ్రామిక పార్కుల్లోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జాతీయ రహదారులతో పారిశ్రామిక పార్కులను అనుసంధానం చేయబోతోంది. జాతీయ రహదారులతో అనుసంధానం వల్ల పారిశ్రామిక పార్కులు విజయవంతమయ్యే అవకాశాలు పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. చైనాలోని టాంజిన్‌ ఎకనామిక్‌ టెక్నలాజికల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా, సింగపూర్‌ సుజోహు పారిశ్రామిక పార్క్, తైవాన్‌ హిసించు సైన్స్‌ పార్క్‌ల విజయంలో రహదారుల అనుసంధానం కీలకపాత్ర పోషించినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. చైనాలో టాంజిన్‌ పార్కును 10 ప్రధాన రహదారులతో అనుసంధానం చేయగా, సింగపూర్‌లో 5 ఎక్స్‌ప్రెస్‌ హైవేలు, తైవాన్‌లో 2 ప్రత్యేక హైవేలతో పారిశ్రామిక పార్కులను అనుసంధానం చేశారు. ఇదే విధానాన్ని ఏపీలో కూడా అమలుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఏపీ మీదుగా వెళ్తున్న విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, బెంగళూరు–హైదరాబాద్‌ కారిడార్లలో చేపట్టిన పారిశ్రామిక పార్కులను అనుసంధానం చేసేందుకు ఆరు రహదారులను ప్రభుత్వం అభివృద్ధి చేయబోతోంది. పారిశ్రామిక పార్కుల నుంచి వేగంగా హైవేల మీదకు చేరుకునేలా 1,318 కి.మీ. రహదారులను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి, శ్రీకాళహస్తి–ఏర్పేడు పారిశ్రామిక పార్కులకు ప్రయోజనం చేకూరే విధంగా కడప–తడ మధ్య 208 కి.మీ రహదారిని అభివృద్ధి చేయనున్నారు. విశాఖ నోడ్‌కు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్‌హెచ్‌16ను ఎన్‌హెచ్‌ 30తో అనుసంధానం చేస్తారు. ఇందుకు విశాఖ–చింటూరు మధ్య 238 కి.మీ మేర రహదారిని అభివృద్ధి చేస్తారు. మచిలీపట్నం నోడ్‌కు ప్రయోజనం చేకూరేలా ఎన్‌హెచ్‌ 16ను ఎన్‌హెచ్‌ 44తో అనుసంధానం చేస్తారు. ఇందుకు బాపట్ల–గుంటూరు (49 కి.మీ), గుంటూరు–కర్నూలు(281కి.మీ), గుంటూరు–అనంతపురం(370 కి.మీ) రహదారులను ప్రతిపాదించారు. కాకినాడ్‌ నోడ్‌కు ప్రయోజనం చేకూర్చేలా ఎన్‌హెచ్‌ 16ను ఎన్‌హెచ్‌ 65తో అనుసంధానం చేస్తారు. ఇందుకు దేవరపల్లి–సూర్యాపేట మధ్య 172 కి.మీ రహదారిని అభివృద్ధి చేయనున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top