ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై తొలగిన సందిగ్ధత | Confusion over anticipatory bail petitions in SC and ST cases cleared | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై తొలగిన సందిగ్ధత

Sep 24 2025 5:36 AM | Updated on Sep 24 2025 5:42 AM

Confusion over anticipatory bail petitions in SC and ST cases cleared

విచారణార్హతపై సందేహాలను నివృత్తి చేసిన హైకోర్టు ధర్మాసనం 

ప్రాథమిక ఆధారాలు లేకుంటే హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవచ్చు 

ముందస్తు బెయిల్‌ కోసం ప్రత్యేక కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు 

ప్రాథమిక ఆధారాలుంటే మాత్రమే ముందస్తు బెయిల్‌పై నిషేధం వర్తిస్తుంది 

మాజీ మంత్రులు కాకాణి, రజిని తదితరుల పిటిషన్లపై ధర్మాసనం కీలక తీర్పు 

ఈ పిటిషన్లను తగిన బెంచ్‌ ముందు ఉంచేందుకు వీలుగా తీర్పును సీజే ముందుంచండి.. రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశం 

పలువురు వైఎస్సార్‌సీపీ నేతలపై ఎడాపెడా అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 

సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిందితులు దాఖలు చేసే ముందస్తు బెయిల్‌ పిటి­ష­న్ల విచారణార్హత విషయంలో సందిగ్ధతకు హైకోర్టు తెరదించింది. ముందస్తు బెయిల్‌పై సింగిల్‌ జడ్జి వ్య­క్తం చేసిన సందేహాలను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం నివృత్తి చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు నిందితులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 438 కింద హైకోర్టులో మాత్రమే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని తేల్చి చె­ప్పింది. 

ఎస్సీ, ఎస్టీ  ప్రత్యేక కోర్టుల్లో దాఖలు చేసుకోవాల్సి­న అవసరం లేదని పేర్కొంది. హైకోర్టులో దాఖలు చేసే పిటిషన్లకు విచారణార్హత ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణల­కు ప్రాథమిక ఆధారాలు ఉంటే మాత్రం హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలుపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని సెక్షన్లు 18, 18 ఏ కింద ఉన్న నిషేధం వర్తిస్తుందని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిల్‌ విషయంలో హైకోర్టు సీఆర్‌పీసీ సెక్షన్‌ 438 కింద తనకున్న ఒరిజినల్‌ న్యాయ పరిధిని, అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసి­టీ చట్టంలోని సెక్షన్‌ 14 ఏ అప్పిలేట్‌ న్యా­య పరి­ధిని కలిగి ఉంటుందని పేర్కొంది. 

ఎ­స్సీ, ఎస్టీ అట్రా­సిటీ కేసుల్లో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్ల విచారణ విషయంలో హైకోర్టుకు కేవలం అప్పిలేట్‌ న్యాయ పరిధి మాత్రమే ఉం­టుందన్న అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీ­పీ) మర్రి వెంకటరమణ వాదనను తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్‌ వడ్డిబోయన సుజాత ధర్మాసనం ఇ­టీ­వల కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో పా­టు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయి­ల్‌ కోసం దాఖలైన వ్యాజ్యాలను తగిన బెంచ్‌ ముందు ఉంచేందుకు వీలుగా వాటిని ప్రధాన న్యాయ­మూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. 

వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు
అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ దాఖలు చేసిన తరువాత ఆయనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. 

అదే రీతిలో చిలకలూరిపేట టీడీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి పిల్లి కోటి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత విడదల రజినిపై చిలకలూరిపేట పోలీసులు అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ఆమె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పలువురు ఇతర నిందితులు కూడా ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు.   

ధర్మాసనానికి నివేదించిన సింగిల్‌ జడ్జి
ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఆ ముందస్తు బెయిల్‌ పిటిషన్ల విచారణార్హతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిందితులు నేరుగా హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయవచ్చా? లేక హైకోర్టు కన్నా ముందు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టునే ఆశ్రయించా­లా? అనే విషయాన్ని తేల్చేందుకు ఈ వ్యాజ్యాలను ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించా­లని ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్‌ 21న ఉత్తర్వులు జారీ చేశారు. 

దీంతో ఈ వ్యవహారాన్ని తేల్చే బాధ్యతను న్యాయమూర్తులు జస్టిస్‌ సురేష్ రెడ్డి, జస్టిస్‌ సుజాతల ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి అప్పగించారు. దీనిపై జస్టిస్‌ సురేష్ రెడ్డి ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. ఈ ఏడాది జూలై 24న తీర్పు రిజర్వ్‌ చేసిన ధర్మాసనం గత వారం తన నిర్ణయాన్ని వెలువరించింది. తాజాగా తీర్పు కాపీ అందుబాటులోకి వచ్చింది.   

ప్రాథమిక ఆధారాలను తేల్చనున్న సింగిల్‌ జడ్జి
ఈ తీర్పు నేపథ్యంలో మాజీ మంత్రులు విడదల రజిని, కాకాణి గోవర్ధన్‌రెడ్డి తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై సింగిల్‌ జడ్జి విచారణ చేపట్టనున్నారు. వారిపై నమోదు చేసిన కేసుల్లో ఆరోపణ­లకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయో.. లేదో.. సింగి­ల్‌ జడ్జి తేలుస్తారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నా­యని తేలిస్తే, నిందితులు ముందస్తు బెయిల్‌ కోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ప్రాథమిక ఆధారాలు లేవని తేలిస్తే నిందితులకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయవచ్చు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement