breaking news
Primary
-
ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై తొలగిన సందిగ్ధత
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిందితులు దాఖలు చేసే ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణార్హత విషయంలో సందిగ్ధతకు హైకోర్టు తెరదించింది. ముందస్తు బెయిల్‌పై సింగిల్ జడ్జి వ్యక్తం చేసిన సందేహాలను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం నివృత్తి చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు నిందితులు సీఆర్పీసీ సెక్షన్ 438 కింద హైకోర్టులో మాత్రమే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుల్లో దాఖలు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. హైకోర్టులో దాఖలు చేసే పిటిషన్లకు విచారణార్హత ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ ఎఫ్ఐఆర్లోని ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉంటే మాత్రం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలుపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని సెక్షన్లు 18, 18 ఏ కింద ఉన్న నిషేధం వర్తిస్తుందని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు సీఆర్పీసీ సెక్షన్ 438 కింద తనకున్న ఒరిజినల్ న్యాయ పరిధిని, అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 14 ఏ అప్పిలేట్ న్యాయ పరిధిని కలిగి ఉంటుందని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ విషయంలో హైకోర్టుకు కేవలం అప్పిలేట్ న్యాయ పరిధి మాత్రమే ఉంటుందన్న అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) మర్రి వెంకటరమణ వాదనను తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ వడ్డిబోయన సుజాత ధర్మాసనం ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం దాఖలైన వ్యాజ్యాలను తగిన బెంచ్ ముందు ఉంచేందుకు వీలుగా వాటిని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులుఅక్రమ మైనింగ్ వ్యవహారంలో నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన తరువాత ఆయనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. అదే రీతిలో చిలకలూరిపేట టీడీపీ సోషల్ మీడియా ఇన్చార్జి పిల్లి కోటి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత విడదల రజినిపై చిలకలూరిపేట పోలీసులు అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పలువురు ఇతర నిందితులు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ధర్మాసనానికి నివేదించిన సింగిల్ జడ్జిఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణార్హతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిందితులు నేరుగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయవచ్చా? లేక హైకోర్టు కన్నా ముందు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టునే ఆశ్రయించాలా? అనే విషయాన్ని తేల్చేందుకు ఈ వ్యాజ్యాలను ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించాలని ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్ 21న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారాన్ని తేల్చే బాధ్యతను న్యాయమూర్తులు జస్టిస్ సురేష్ రెడ్డి, జస్టిస్ సుజాతల ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి అప్పగించారు. దీనిపై జస్టిస్ సురేష్ రెడ్డి ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. ఈ ఏడాది జూలై 24న తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం గత వారం తన నిర్ణయాన్ని వెలువరించింది. తాజాగా తీర్పు కాపీ అందుబాటులోకి వచ్చింది. ప్రాథమిక ఆధారాలను తేల్చనున్న సింగిల్ జడ్జిఈ తీర్పు నేపథ్యంలో మాజీ మంత్రులు విడదల రజిని, కాకాణి గోవర్ధన్‌రెడ్డి తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై సింగిల్ జడ్జి విచారణ చేపట్టనున్నారు. వారిపై నమోదు చేసిన కేసుల్లో ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయో.. లేదో.. సింగిల్ జడ్జి తేలుస్తారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తేలిస్తే, నిందితులు ముందస్తు బెయిల్ కోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ప్రాథమిక ఆధారాలు లేవని తేలిస్తే నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చు. -
3 నుంచి ఎఫ్ఏ 2 పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు. ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు పంపిస్తారు. పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు ప్రశ్నాపత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మ«ద్యాహ్నం పరీక్షలు ఉంటాయి. ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్ధులకు అందిస్తారు. అలాగే ఆన్లైన్ పోర్టల్లోనూ మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలని సూచించింది. కాగా, ఈ నెల 14 నుంచి 24 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. -
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఎంపికకు ప్రతిపాదనలు
విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఎంపిక –2016 కోసం ప్రతిపాదనలు సంబంధిత మండల విద్యాశాఖాధికారులు, ఉప విద్యాశాఖాధికారుల ద్వారా పంపాలని డీఈఓ పి.రాజీవ్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. డాక్ట ర్ సర్వేపెల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఈ అవార్డుల ఎంపిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ దరఖాస్తులను ఈ నెల 15వ తేదీలోగా సమర్పించాలని పేర్కొన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు 10సంవత్సరాలు పూర్తి సర్వీస్ కలిగి ఉండాలని, బడిబాటలో విద్యార్థులను ఎన్రోల్మెంట్ చేసి ఉండాలని, అలాగే హరితహారంలో భాగస్వాములై ఉండాలని తెలిపారు. అలాగే క్రిమినల్ కేసులు ఉండరాదని, ఇప్పటికే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన వారు తిరిగి ప్రతిపాదనలు చేయెుద్దని డీఈఓ సూచించారు. -
సర్దుబాట్లపై స్పష్టతేదీ?
ప్రహసనంగా మారిన టీచర్ల సర్దుబాటు వివరాలు కోరుతున్న విద్యాశాఖ కమిషనర్ బదిలీలు ఉండవంటున్న ఎమ్మెల్సీలు ఉంటే టెన్త్ ఫలితాలపై ప్రభావం మచిలీపట్నం : ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు వ్యవహారం గందరగోళంగా మారింది. పదో తరగతి ప్రీ పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్న వేళ ఉపాధ్యాయుల బదిలీలు ఎంతమేరకు సమంజసమనే వాదన వినిపిస్తోంది. సర్దుబాటు బదిలీల అంశంపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో ఎమ్మెల్సీలు ఎ.ఎస్.రామకృష్ణ, బచ్చల పుల్లయ్య, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు మాట్లాడినప్పుడు బదిలీలు ఇప్పట్లో ఉండవని సూచనప్రాయంగా చెప్పారు. ఆచరణలో మాత్రం వేరే విధంగా ఉండడం వివాదాస్పదమవుతోంది. ఉపాధ్యాయుల సర్దుబాటు బదిలీల్లో వెసులుబాటు ఇస్తామని విద్యాశాఖ కార్యదర్శి చెబుతుండగా, మరో వైపు జాబితా సిద్ధం చేయాలంటూ విద్యాశాఖ కమిషనరేట్ నుంచి డీఈవో కార్యాలయానికి ఆదేశాలు వస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో సర్దుబాటు బదిలీలు జరుగుతాయా లేక వాయిదా పడతాయా అనే అంశంపై స్పష్టత లేకుండాపోయింది. మండలాల నుంచి వివరాల్లేవు సర్దుబాటు బదిలీలకు సంబంధించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి డీఈవో కార్యాలయానికి మిగులుగా ఉన్న ఉపాధ్యాయుల వివరాలు పంపాల్సి ఉంది. ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ మిగులు ఉన్నారో ఎంఈవోలు, డీవైఈవోల వద్ద వివరాలు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్సీలు ఇటీవల చేసిన ప్రకటనతో వాటిని డీఈవో కార్యాలయానికి పంపడం లేదు. అదేమని ప్రశ్నిస్తే.. ‘జరగని బదిలీలకు అంత తొందరెందుకు’ అంటూ సమాధానం ఎదురవుతోందని డీఈవో కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. శుక్రవారం కూడా డీఈవో కార్యాలయానికి సర్దుబాటు బదిలీల వివరాలు ఇవ్వాలని కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులొచ్చాయి. మండలాల నుంచి వివరాలు రాకపోవడంతో కమిషనర్ కార్యాలయానికి ఏం పంపాలో తెలియక డీఈవో కార్యాలయ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. స్పష్టత లేని విధివిధానాలు ఉపాధ్యాయుల సర్దుబాటు బదిలీలకు సంబంధించి నివేదికలు విద్యాశాఖ ఉన్నతాధికారులు కోరుతున్నా స్పష్టమైన విధివిధానాలు ఇంతవరకు ప్రకటించలేదు. బదిలీల వివరాలు ఆన్లైన్లో ఉంచాలని చెప్పడమే తప్ప మార్గదర్శకాలు ఇంతవరకు ఇవ్వలేదని డీఈవో కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. సర్దుబాటు బదిలీలు కూడా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరగాల్సిఉంది. అలా జరగాలంటే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా, ఉద్యోగంలో చేరిన తేదీ, సీనియర్, జూనియర్ టీచర్ల వివరాలు సేకరించాల్సి ఉంది. జిల్లాలో 350 మందికి పైగా ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నట్లు డీఈవో కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో అప్‌గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల అవసరం ఉందని, ఈ తరహా పాఠశాలలు 12కు మించి ఉండవని సిబ్బంది అంటున్నారు. మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇప్పటికే సిలబస్ పూర్తయింది. ఈ తరుణంలో వేరే ప్రాంతానికి బదిలీ చేస్తే విద్యార్థులు ఇబ్బందిపడతారన్నది ఉపాధ్యాయుల వాదన.