తప్పుడు పత్రాలతో కొలువు కొట్టేసినా పట్టించుకోరా..?
అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
డీఎస్సీ అభ్యర్థి నరసయ్య ఆవేదన
విజయనగరం అర్బన్: నిబంధనల ప్రకారం డీఎస్సీ–2025లో దరఖాస్తు చేసుకుని మెరిట్‌లో నిలిచిన అభ్యర్థులను నట్టేట ముంచేశారని, అదే తప్పుడు సమాచారంతో వ్యవస్థను మోసం చేసేవారికి రెడ్‌కార్పెట్ పరిచి ఉద్యోగం ఇచ్చారంటూ విజయనగరం జిల్లాకు చెందిన డీఎస్సీ అభ్యర్థి నరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ పీఈటీ పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలతో పోస్టుకు దూరమయ్యాయని వాపోయారు.
ఆయన ఏమన్నారంటే... ‘‘విజయనగరం జిల్లాలో స్పోర్ట్స్ కోటా కింద కేవలం ఒకే ఒక్క పీఈటీ పోస్టు ఉంది. ఈ పోస్టు కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ రేసులో ముందు వరుసలో ఓ యువతి, నేను ఉన్నాం. వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన ట్రాక్ రికార్డు ఉండడంతో ఆ యువతికి పోస్టు దక్కింది. అయితే, ఇక్కడ ఒక పెద్ద అక్రమమే చోటుచేసుకుంది.
ఆమెది పాఠశాల రికార్డు ప్రకారం పుట్టిన తేదీ 1992 సెప్టెంబర్ 20. పోటీలకు సరిపోయేందుకు సృష్టించిన తప్పుడు పుట్టిన రోజు 1992 మార్చి 10. పాఠశాల విద్య రికార్డుల్లో ఉన్న అసలు పుట్టిన రోజు ప్రకారం చూస్తే... ఆమె పాల్గొన్న సదరు జాతీయ, అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఆమెకు అసలు వయస్సే సరిపోదు (అర్హత లేదు). ఆ పోటీల్లో పాల్గొనేందుకు వీలుగా వయసును మార్చుతూ పుట్టిన తేదీ ధ్రువపత్రాన్ని సృష్టించారు. ఆ తప్పుడు పత్రంతోనే రిజ్రస్టేషన్ చేయించుకుని పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు.
ఇప్పుడు అవే పతకాలను చూపి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డీఎస్సీలో పీఈటీ కొలువును దక్కించుకున్నారు. ఆమె ఒరిజినల్ సర్టిఫికెట్లలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్... స్పోర్ట్స్ సర్టిఫికెట్లలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్‌పై స్పష్టమైన ఆధారాలతో సహా డీఎస్సీ నిర్వహణ ఉన్నతాధికారులకు, స్పోర్ట్స్ అథారిటీ వారికి ఫిర్యాదు చేశాను. కానీ లాభం లేకుండా పోయింది. దానిపై ఎలాంటి విచారణ చేయలేదు.
వేర్వేరు పుట్టిన రోజులతో ఎలా చలామణి అవుతుందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కనీసం ఆ పత్రాన్ని పరిశీలించే ప్రయత్నం కూడా ఏ స్థాయిలోనూ చేయలేదు. ఆమె తప్పుడు పత్రాలతో పతకాలు కొట్టి, ఆ అర్హతతోనే డీఎస్సీ పోస్టుకు ఎంపికైంది. దీంతో తర్వాత స్థానంలో ఉన్న నాకు పోస్టు దూరమైంది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పేందుకు నాకు జరిగిన నష్టమే నిదర్శనం’’ అని నరసయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్సీ అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం
» వైఎస్సార్‌సీపీ డీఎస్సీ పోరాట కమిటీ వెల్లడి
» డీఎస్సీ– 2025లో ప్రతి అక్రమంపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలి
» కృష్ణా జిల్లా టాపర్ నవీన్ ఉద్యోగం పొందకపోవడం వెనుక కారణాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
» డీఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎందుకు స్పందించడం లేదు?
» ప్రభుత్వానికి అనుకూలంగా ఉపాధ్యాయులతో రాజకీయ సమావేశాలు నిర్వహించి విమర్శలు చేయించడం తగదు
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని వైఎస్సార్‌సీపీ డీఎస్సీ పోరాట కమిటి నిర్ణయించింది. అక్రమాలపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేయాలని నిర్ణయించింది. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన డీఎస్సీ పోరాట కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత, పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ–2025 పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, అభ్యర్థుల అభ్యంతరాల పరిష్కారంలో చోటుచేసుకున్న అనేక అవకతవకలపై విస్తృతంగా చర్చించారు. డీఎస్సీలో అక్రమాల కారణంగా నష్టపోయిన అభ్యర్థుల తరపున న్యాయ పోరాటం కొనసాగించాలని, ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తి, దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయాలని నిర్ణయించారు. బాధిత అభ్యర్థులతో త్వరలోనే మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కూడా నిర్ణయించారు. డీఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎందుకు స్పందించడం లేదని కమిటీ సభ్యులు ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి మించిన స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వారు ఆరోపించారు. ఎస్‌సీఈఆర్టీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నవీన్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి కృష్ణా జిల్లా టాపర్‌గా నిలవడం, అయినా డీఎస్సీలో ఉద్యోగం పొందకపోవడం వెనుక కారణాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ఫలితాలపై 30 వేలకుపైగా గ్రీవెన్సులు వచ్చినప్పటికీ, అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.
అక్రమాలపై ప్రశ్నిస్తున్న బాధిత అభ్యర్థులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కొందరు ఉన్నతాధికారులు వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఇప్పటికే పదుల సంఖ్యలో కోర్టులో రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉపాధ్యాయులతో రాజకీయ సమావేశాలు నిర్వహించి, డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తున్న వారిపై విమర్శలు చేయించడం కూడా ప్రజాస్వామ్య విరుద్ధ చర్యేనని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. డీఎస్సీ– 2025లో వెలుగులోకి వచ్చిన ప్రతి అక్రమంపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డీఎస్సీ పోరాట కమిటీ డిమాండ్ చేసింది.
నా ఉద్యోగం వేరే వాళ్లకు ఎలా కేటాయించారు ?
» మార్కాపురం జిల్లా పాతచెరువు తండాకు చెందిన క్రాంతి
» ఎస్టీ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్‌లో
» అర్హత ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు
» న్యాయం చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు వినతి
యర్రగొండపాలెం: చంద్రబాబు ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూస్తూనే ఉంది. మెగా డీఎస్సీ–2025లో ఉమెన్స్ కోటాలో అర్హత ఉన్నప్పటికీ ఓ ఎస్టీ మహిళకు పోస్టు దక్కలేదు. ఎస్టీ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్‌లో తనకు దక్కాల్సిన పోస్టు ఇతరులకు ఏ విధంగా కేటాయించారని మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలంలోని పాతచెరువు తండాకు చెందిన మూడ క్రాంతి ప్రశ్నిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు మెయిల్ ద్వారా శనివారం వినతి పత్రం పంపింది.
అందులో.. ‘‘నేను డీఎస్సీ–25లో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమేటిక్స్) పోస్టుకు ప్రకాశం జిల్లాలో ఎస్టీ (ఉమెన్) కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్నాను. ఏపీ మెగా డీఎస్సీ ప్రకారం మహిళల రిజర్వేషన్ హారిజాంటల్ రిజర్వేషన్ రూపంలో అమలు చేయాల్సి ఉంది. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమేటిక్స్)గా ఎస్టీ కేటగిరిలో 5 పోస్టులు కేటాయించినా ఎస్టీ ఉమెన్ అభ్యర్థులకు తగిన విధంగా హారిజాంటల్ రిజర్వేషన్ అమలైందా? అనే అంశంపై సందేహం ఉంది. నేను ఎస్టీ ఉమెన్ కేటగిరీలో మెరిట్ జాబితాలో 2వ ర్యాంక్ సాధించినా నాకు ఉద్యోగం రాలేదు’’ అని పేర్కొంది.
రోస్టర్, హారిజాంటల్ రిజర్వేషన్ అమలులో సరైన విధానం అనుసరించారో లేదో పరిశీలించాలని, ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమేటిక్) పోస్టులకు పూర్తి రోస్టర్ వివరాలు వెల్లడించాలని, ఎస్టీ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ అమలును పరిశీలించి ఆ రోస్టర్ పాయింట్‌ల ప్రకారం తనకు న్యాయం చేయాలని క్రాంతి కోరింది. ప్రతి 100 రోస్టర్ సైకిల్‌లో ఎస్టీలకు మొత్తం 6 రోస్టర్ పాయింట్లు ఉంటాయని, వాటిలో 2 పాయింట్లు ఎస్టీ ఉమెన్‌గా గుర్తించబడ్డాయని క్రాంతి తెలిపారు. జిల్లాలో ఉన్న 92 పోస్టుల్లో 8, 58వ రోస్టర్ పాయింట్ ఎస్టీ ఉమెన్‌కు దక్కాల్సి ఉండగా 58వ పాయింట్(తనకు దక్కాల్సిన పోస్టు) ఓపెన్ కేటగిరీలో చేర్చి ఎస్టీ అభ్యరి్థకి పోస్టు ఇచ్చారని ఆమె తెలిపింది.


