Andhra CM YS Jagan Extends Help To Man Suffering From Kidney Problem - Sakshi
Sakshi News home page

ఓ తల్లి వేడుకోలు.. వెంటనే స్పందించిన సీఎం జగన్‌  

Published Fri, Dec 23 2022 4:12 AM

CM YS Jagan Support For student with kidney disease - Sakshi

జూపాడు బంగ్లా:  అన్నా.. ఆపదలో ఉన్నా! నా కుటుంబం ఆపదలో ఉంది.. నా కుమారుడి ఆరోగ్యం సరిగా లేదు.. ఆదుకోవాలని సీఎం జగన్‌ను వేడుకున్న ఓ మహిళకు గంటల వ్యవధిలోనే తక్షణ సాయం అందింది. గురువారం నంద్యాల జిల్లా పారుమంచాల గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్‌ ఓ విద్యార్థి దీనస్థితి గురించి తెలుసుకుని చలించిపోయారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్‌ చదువుతున్న తన కుమారుడు యోగి (15) రెండు కిడ్నీలు పాడవటంతో ఆరోగ్యం క్షీణిస్తోందని చాకలి జయమ్మ అనే మహిళ సీఎం జగన్‌ ఎదుట కన్నీటిపర్యంతమైంది.

జయమ్మకు రూ.లక్ష చెక్కును అందజేస్తున్న తహసీల్దార్‌ పుల్లయ్యయాదవ్‌  

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నామని, కిడ్నీ ఆపరేషన్‌ చేస్తే తన కుమారుడు బతుకుతాడని వైద్యులు చెప్పారని, అందుకు రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని వాపోయింది. దీంతో స్పందించిన సీఎం జగన్‌ ఆపరేషన్‌కు ఆర్థిక సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శ్యామూన్‌ను ఆదేశించారు. ఈ మేరకు తక్షణ సాయంగా కలెక్టర్‌ రూ.లక్ష చెక్కును మంజూరు చేశారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో నందికొట్కూరు తహసీల్దార్‌ పుల్లయ్యయాదవ్‌ కిడ్నీ బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు.  

Advertisement
Advertisement