ఆకర్షణీయంగా అంబేడ్కర్‌ విగ్రహం

CM YS Jagan Review On Set up the Ambedkar Statue In Swaraj Maidan - Sakshi

ఎక్కడి నుంచి చూసినా స్పష్టంగా కనిపించాలి

స్వరాజ్‌ మైదాన్‌లో 125 అడుగుల విగ్రహం ఏర్పాటుపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అక్కడ నిర్మించే ల్యాండ్‌ స్కేప్‌ (పార్కు) పూర్తి ఆహ్లాదకరంగా ఉండాలి

కన్వెన్షన్‌ సెంటర్, ఫుడ్‌ కోర్టు మాత్రమే కమర్షియల్‌గా ఉండాలి

సాక్షి, అమరావతి: బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం విజిబిలిటీ (స్పష్టంగా కనిపించడం) ముఖ్యమని, ఎక్కడి నుంచి చూసినా విగ్రహం స్పష్టంగా కనిపించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయవాడ స్వరాజ్‌ మైదాన్‌లో 125 అడుగుల బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు, పార్క్‌ అభివృద్ధి మాస్టర్‌ ప్లాన్‌పై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. 

► విగ్రహం చక్కగా ఉండటంతో పాటు అక్కడ నిర్మించే ల్యాండ్‌ స్కేప్‌ (పార్కు) పూర్తి ఆహ్లాదకరంగా ఉండాలి. విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తే గ్రాండ్‌ లుక్‌ వస్తుందన్న దానిపై దృష్టి పెట్టండి. గ్రౌండ్‌లో బెస్ట్‌ లొకేషన్‌ ఎక్కడో ఫైనలైజ్‌ చేయండి.
► అక్కడ ఒక కన్వెన్షన్‌ హాల్‌ కూడా ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కన్వెన్షన్‌ సెంటర్, ఫుడ్‌ కోర్టు మాత్రమే కమర్షియల్‌గా ఉండాలి. వీటిపై వచ్చే ఆదాయం పార్క్‌ నిర్వహణకు ఉపయోగపడుతుంది. 
► అక్కడ వీలైనంత వరకు కాంక్రీట్‌ నిర్మాణాలు తగ్గించాలి. మంచి వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలి. పనులు ప్రారంభించేలోగా ఆ స్థలంలో ఉన్న ఇరిగేషన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ తరలించాలి. ఎంజీ రోడ్‌ నుంచి పార్క్‌ కనెక్టివిటీ కూడా అందంగా తీర్చిదిద్దాలి. మొత్తం మీద అక్కడంతా ఆహ్లాదకర వాతావరణం కనిపించాలి. 
► ఈ సందర్భంగా వివిధ సంస్థల ప్రతినిధులు పలు నమూనాలు ప్రదర్శించారు. విగ్రహంతో పాటు, పార్కు నిర్మాణానికి సంబంధించి వారు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.  
► ఈ సమీక్షలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్, మునిసిపల్, ఇరిగేషన్, ఆర్థిక, సాంఘిక సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వెంటనే విగ్రహం తయారీకి ఆర్డర్‌ ఇవ్వాలి. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలి. నవంబర్‌ 1వ తేదీన పనులు మొదలు పెట్టి 13 నెలల్లోగా పూర్తయ్యేలా చూడాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top