పేద బిడ్డలకు పెద్ద చదువులు

CM YS Jagan Mohan Reddy Comments On Jaganna Amma Vodi Scheme - Sakshi

ఇది విద్యా విప్లవం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

 పిల్లలను చదివించుకునేందుకు 45 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి

అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : గత ప్రభుత్వ హయాంలో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ బడులన్నింటిని నిర్వీర్యం చేశారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం నెల్లూరులోని శ్రీవేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం రెండో ఏడాది నగదు జమ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. ‘గత సర్కారు హయాంలో జూన్‌లో బడులు తెరిస్తే అక్టోబర్‌లో పుస్తకాలు ఇచ్చే దుస్థితి. మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ లేకపోగా బిల్లులు, ఆయాల జీతాలు 8 నెలలు పెండింగ్‌లో పెట్టేవారు. ఇంగ్లిష్‌ మీడియం కేవలం ప్రైవేట్‌ బడుల్లోనే ఉండేది. అక్కడ ఫీజులు ఎక్కువ కావడంతో చదివించాలంటే స్థోమత లేని పరిస్థితి. ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం మాత్రమే ఉండేది. బాత్‌రూమ్‌లు దారుణంగా ఉండేవి. వీటన్నింటితో ప్రభుత్వ బడులు శిథిలావస్థకు చేరుకున్న దుస్థితి. మరోవైపు ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజులు విపరీతంగా పెంచేందుకు అనుమతులిచ్చి పేద పిల్లలను చదువుకు దూరమయ్యే పరిస్థితి కల్పించారు.

ఈ రోజు ఆ పరిస్థితిని మార్చే పనిచేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్ర వర్ణాల్లో పేద కుటుంబాలకు చెందిన ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం కాకుండా వారి మేనమామ పరిపాలన చేస్తున్నాడని సగర్వంగా చెబుతున్నా’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. నాడు–నేడు ద్వారా మొత్తం బడుల రూపురేఖలు మార్చేస్తున్నామని దాదాపు 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో తొలిదశలో 15,715 బడుల రూపు రేఖలు మార్చే పనులు ఇప్పటికే మొదలై చకాచకా జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి అక్కా, చెల్లి తనను నమ్మారని, తమ బిడ్డలను వారి మేనమామ చూసుకుంటాడనే నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నారని, అందుకే గతంలో 38 లక్షలు ఉన్న విద్యార్థుల సంఖ్య ఈ రోజు 42 లక్షలకు చేరిందన్నారు. .

రాష్ట్ర మహిళలు గర్వించేలా...
జగనన్న అమ్మఒడి దాదాపు 45 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఈరోజు అందుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 30.75 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రెండు వారాలుగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. విద్యా దీవెన కింద 18.52 లక్షల మందికి రూ.4,101 కోట్లు, వసతి దీవెన కింద 15.56 లక్షల మందికి రూ.1,221 కోట్లు, ఆసరా తొలి విడత కింద 87.74 లక్షల మందికి, రూ.6,792 కోట్లు, చేయూత కింద 24.55 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,604 కోట్లు, పొదుపు సంఘాలకు 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద రూ.1,400 కోట్లు, కాపు నేస్తం కింద 3.28 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.491 కోట్లు ఇచ్చాం.

ఇలా ఏ కార్యక్రమం చూసినా వివక్ష, అవినీతికి తావులేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఇంటి స్థలమైనా, ఇంటి నిర్మాణమైనా అక్క చెల్లెమ్మల పేరుతోనే చేపడుతున్నాం. మహిళలు సామాజికంగా, రాజకీయంగా ఎదిగేలా అన్ని నామినేట్‌ పనులు, పదవుల్లో 50 శాతం వారికే ఇస్తున్నాం. ఇందు కోసం చట్టాలు చేశాం. భారతీయ మహిళా చరిత్రను ఆంధ్రప్రదేశ్‌లో తిరగరాస్తున్నామని గట్టిగా చెబుతున్నా. 

19 నెలల్లో విద్యారంగంపై రూ.24 వేల కోట్లు ఖర్చు 
19 నెలల ప్రభుత్వ పాలనలో పిల్లల చదువుల కోసం అక్షరాల రూ.24 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మనది. ఒక్క జగనన్న అమ్మఒడి పథకం ద్వారానే రూ.13 వేల కోట్లు, విద్యా దీవెన ద్వారా 18.51 లక్షల మంది పిల్లలకు రూ.4,101 కోట్లు, జగనన్న వసతి దీవెన ద్వారా రూ.1,221 కోట్లు, సంపూర్ణ పోషణ కింద రూ.1,863 కోట్లు, జగనన్న విద్యా కానుక కింద దాదాపు రూ.648 కోట్లు, జగనన్న గోరుముద్ద ద్వారా రూ.1,456 కోట్లు ఖర్చు చేస్తున్నా. పాఠశాలల్లో నాడు-నేడు కింద మొదటి దశలో రూ.2,600 కోట్లు ఖర్చు చేసి మొత్తంగా రూ.24,600 కోట్లు ఖర్చు చేశాం. పేదింటి పిల్లలంతా చదువుల బడికి వెళ్లి గొప్ప చదువులు చదవాలని అమ్మఒడికి శ్రీకారం చుట్టాం.

పేద పిల్లలందరూ చదువుకోవాలి, వాళ్ల తలరాతలు మారాలి. చదువుల రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకురావాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఈ 19 నెలల పరిపాలన సాగిందని సగర్వంగా చెబుతున్నా. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ఏడాది రెండో విడత ఇస్తున్నాం. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయంగా అందిస్తున్నాం. ప్రతి పిల్లవాడిలో ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా కాన్వెంట్‌ బడులకు వెళ్తున్నప్పుడు ఉండే ఆత్మ స్థైరం మాదిరిగా విద్యాకానుక ఇచ్చాం. 

పౌష్టికాహారం.. ఇంగ్లీషు మీడియం..
ప్రతి పిల్లవాడికి ఆరో సంవత్సరం వచ్చే సరికి 85 శాతం  బ్రెయిన్‌ డెవలప్‌మెంట్‌ ఉంటుంది. అలాంటి సమయంలోనే గట్టి పునాదులు పడతాయని, అందుకే మంచి పౌష్టికాహారంతో పాటు ఇంగ్లిష్‌ మీడియంలో పునాదులు కూడా పడాలని ఖర్చుకు  వెనుకాడకుండా అమలు చేస్తున్నాం. విద్యాకానుక ద్వారా ఇచ్చే స్కూల్‌ కిట్ల నాణ్యతను నేను స్వయంగా బూట్లు పట్టుకుని పరిశీలించా. ఈసారి మరింత నాణ్యతతో ఉండాలని అధికారులకు చెప్పా. నాడు-నేడుతో స్కూళ్లను సమూలంగా మారుస్తున్నాం. మధ్యాహ్న భోజనం మెనూ మార్చి రోజుకో వెరైటీతో జగనన్న గోరుముద్ద పథకాన్ని తెచ్చాం. కంటి వెలుగు పథకం ద్వారా పరీక్షలు చేయిస్తున్నాం.

ఇంటర్‌ తర్వాత పిల్లల చదువులు ఆగి పోకూడదని పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు విద్యాదీవెన, హాస్టల్‌ ఖర్చుల కోసం వసతి దీవెన ద్వారా ఏటా ప్రతి పిల్ల వాడికి రూ.20 వేలు ఇస్తున్నాం. కరిక్యుకులమ్‌లో మార్పులు చేసి చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు వచ్చేలా అప్రెంటీస్‌షిప్‌ను అమలు చేస్తున్నాం. 8వ తరగతి నుంచే కంప్యూటర్‌ లిటరసీ కోర్సు కూడా ప్రవేశ పెడుతున్నాం. డబ్బున్న వారి పిల్లలతో పోటీ పడి చదువుకునే పరిస్థితి కల్పిస్తున్నాం. 

చీకటి పనులు చేసేవారు..
చీకటి పనులు చేసేవారు, వెన్నుపోట్లు తెలిసిన వారు, దొంగ దెబ్బతీసే వారు,  వ్యవస్థలో కోవర్టులు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు... మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఎలా దెబ్బతీయాలా అని ఆరాట పడుతున్న రాజకీయ శక్తులను గమనించమని ప్రజలను కోరుతున్నా. ఇలాంటి రాజకీయ శక్తులతో మనం ఇవాళ పోరాటం చేస్తున్నాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top