vanijya utsav 2021: ఎగుమతుల్లో ఎగువన

CM YS Jagan Invitation Entrepreneurs Vanijya Mahotsav Event - Sakshi

‘వాణిజ్య ఉత్సవ్‌’ ప్రారంభ సదస్సులో పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్‌ ఆహ్వానం

రెండేళ్లలో దేశ ఎగుమతుల్లో 9 నుంచి 4వ స్థానానికి ఎగబాకిన ఏపీ

కోవిడ్‌తో దేశవ్యాప్తంగా ఎగుమతులు క్షీణించినా రాష్ట్రంలో 19.4% వృద్ధి

ఎగుమతుల్లో 5.8%గా ఉన్న వాటాను 10 శాతానికి చేర్చాలన్నది లక్ష్యం

ఎగుమతుల ప్రోత్సాçహానికి మూడు పోర్టులు, 8 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం

పారిశ్రామికంగా రాష్ట్రం ఎదుగుదలకు జీడీపీ గణాంకాలే నిదర్శనం

కరోనాతో దేశ జీడీపీ 7.3% క్షీణిస్తే రాష్ట్రంలో 2.58% మాత్రమే తగ్గింది

రెండేళ్లలో 16,311 ఎంఎస్‌ఎంఈల ద్వారా 1.13 లక్షల మందికి ఉపాధి

10 మెగా ప్రాజెక్టులతో రూ.26,391 కోట్ల పెట్టుబడులు.. 55,024 మందికి ఉపాధి 

మూడు పారిశ్రామిక కారిడార్లలో ప్రపంచస్థాయి మౌలిక వసతులు 

వైఎస్సార్‌ జిల్లాలో మెగా ఇండస్ట్రియల్‌ హబ్, వైఎస్సార్‌ ఈఎంసీ 

రూ.13,500 కోట్లతో వైఎస్సార్‌ జిల్లాలో 3 మిలియన్‌ టన్నుల ఉక్కు కర్మాగారం 

ఎగుమతుల కార్యాచరణ, ఎక్స్‌పోర్ట్‌ ట్రేడ్‌ పోర్టల్, వైఎస్సార్‌ ఏపీ వన్‌ ప్రారంభించిన సీఎం 

ఈ కష్టకాలంలో పారిశ్రామికవేత్తలు చూపి స్తున్న అంకితభావానికి, ఎగుమతి దారులు, వాణిజ్య మండళ్లు, శ్రమిస్తున్న కార్మికులందరికీ అభినందనలు. పారిశ్రామికవేత్తల్లో ఈ వాణిజ్య ఉత్సవ్‌ మరింత నమ్మకాన్ని కల్పిస్తుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా రాష్ట్రంతోపాటు అభివృద్ధి చెందేలా మరింత మందిని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందుబాటులో ఉంటాం. సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. మేం చేయాల్సినవి ఏమైనా ఉంటే సూచనలు చేయండి. కచ్చితంగా నెరవేరుస్తాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఎగుమతులు క్షీణించినప్పటికీ రాష్ట్ర ఎగుమతుల్లో మాత్రం వృద్ధి నమోదైందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సరైన మౌలిక వసతులు, చక్కటి విధానాలు అమలు చేస్తే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోగలమనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఎగుమతుల్లో నమోదవుతున్న వృద్ధి, జీడీపీ గణాంకాలే నిదర్శనమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎగుమతులు 330 బిలియన్‌ డాలర్ల నుంచి 290 బిలియన్‌ డాలర్లకు పడిపోగా అదే సమయంలో రాష్ట్ర ఎగుమతులు 14.1 బిలియన్‌ డాలర్ల నుంచి 16.8 బిలియన్‌ డాలర్లకు పెరిగాయని వివరించారు. 2020–21లో దేశ జీడీపీ 7.3 శాతం క్షీణించగా రాష్ట్ర జీఎస్‌డీపీ క్షీణత 2.58 శాతానికే పరిమితమైందన్నారు.

ప్రస్తుతం దేశ ఎగుమతుల్లో 5.8 శాతంగా ఉన్న రాష్ట్ర వాటాను 2030 నాటికి పది శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుని సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా రెండు రోజుల ట్రేడ్‌ కార్నివాల్‌ ‘వాణిజ్య ఉత్సవ్‌’ను మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించి మాట్లాడారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్రంతో పాటు మీరు కూడా (పారిశ్రామికవేత్తలు) అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికను విడుదల చేయడంతో పాటు ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్‌పోర్ట్‌ ట్రేడ్‌ పోర్టల్, వైఎస్సార్‌ ఏపీ వన్‌ బిజినెస్‌ అడ్వైజరీ సర్వీసులను బటన్‌ నొక్కి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రసంగం వివరాలివీ..
వాణిజ్య ఉత్సవ్‌–2021ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

వారం రోజులు మీతోనే...
ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వచ్చిన వివిధ దేశాల దౌత్యాధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎగుమతి దారులు, ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిళ్ల సభ్యులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రివర్గ సహచరులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇతర భాగస్వాములందరికీ స్వాగతం. విజయవాడలో రెండు రోజులపాటు వాణిజ్య ఉత్సవ్‌ అనంతరం నాలుగు రోజులపాటు జిల్లాల్లో కూడా జరుగుతాయి. వారం రోజులపాటు వాణిజ్య వర్గాలు, ప్రభుత్వం కలసి మెలసి పనిచేస్తాయి.

సంక్లిష్ట సమయం..
గత రెండేళ్లలో పెను సవాళ్లను ఎదుర్కొన్నాం. తొలి ఏడాది మాంద్యం కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటే రెండో సంవత్సరం కోవిడ్‌ విపత్తును చూశాం. దీనివల్ల దేశవ్యాప్తంగా రెవెన్యూ వసూళ్లు 3.38 శాతం పడిపోయాయి. 2018–19లో దేశం మొత్తం రెవిన్యూ వసూళ్లు రూ.20,80,465 కోట్లు ఉంటే 2019–2020లో రూ.20,10,059 కోట్లకు పడిపోయాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 4 శాతానికి పడిపోయింది. 2020–21లో మరింత క్షీణించి 7.3 శాతానికి పడిపోయింది. దేశ ఎగుమతులు 330 బిలియన్‌ డాలర్ల నుంచి 290 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. ఎగుమతుల రంగానికి ఇది అత్యంత సంక్లిష్ట సమయం. 

9 నుంచి 4కి ఎగబాకిన ర్యాంకు 
ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రం ఎగుమతులు 19.4 శాతం వృద్ధి చెందాయి. రాష్ట్ర ఎగుమతులు 14.1 బిలియన్‌ డాలర్ల నుంచి 16.8 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఇందులో సముద్రపు ఉత్పత్తులు 15 శాతం ఉండగా షిప్స్, బోట్ల నిర్మాణ రంగం 8.5 శాతం, ఫార్మా రంగం 7.3 శాతం, ఐరన్, స్టీల్‌ ఉత్పత్తులు 7.3 శాతం, నాన్‌ బాస్మతి రైస్‌ 4.8 శాతంతో ఎగుమతులకు దోహదపడ్డాయి. 2018–19లో ఎగుమతుల్లో రాష్ట్రం 9వ స్థానంలో ఉండగా 2019–20లో 7వ స్థానానికి చేరుకుంది. 2020–21లో నాలుగో స్థానానికి చేరుకున్నాం. రాష్ట్ర జీఎస్‌డీపీ కోవిడ్‌ సంవత్సరం 2020–21లో 2.58 శాతం క్షీణిస్తే దేశ జీడీపీ 7.3 శాతం క్షీణించింది. ఈ వివరాలు ఎందుకు చెబుతున్నామంటే.. సరైన మౌలిక వసతుల కల్పన, చక్కటి విధానాల ద్వారా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలమని మా గట్టి నమ్మకం. పారిశ్రామిక ప్రగతి, ఎగుమతుల వృద్ధికి ఈ రెండూ చాలా కీలకం. 

రెండేళ్లలో చాలా దూరం ప్రయాణం
గత రెండేళ్లలో మేం చాలా దూరం ప్రయాణం చేశాం. రూ.5,204 కోట్లతో రాష్ట్రంలో 16,311 ఎంఎస్‌ఎంఈలు నెలకొల్పడం ద్వారా 1,13,777 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇది కాకుండా గత రెండేళ్లలో 68 అతి భారీ, భారీ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. రూ.30,175 కోట్ల పెట్టుబడులు ఈ పరిశ్రమల ద్వారా వచ్చాయి. 46,119 మందికి ఉపాధి లభించింది. మరో రూ.36,384 కోట్ల పెట్టుబడితో 62 భారీ, అతి భారీ పరిశ్రమలు నిర్మాణాన్ని పూర్తి చేసుకోబోతున్నాయి. 76,960 మందికి ఉద్యోగాలను కల్పించే సామర్థ్యం వీటికి ఉంది. గత ఏడాది కాలంలోనే రూ.26,391 కోట్లతో ఏర్పాటు కానున్న 10 మెగా ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాం. వీటివల్ల 55,024 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 

గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ – గెయిల్‌ 
స్థిరమైన పారిశ్రామిక ప్రగతి కోసం అవసరాలకు సరిపడా ఇంధన వనరులు అందుబాటులో ఉండడం చాలా కీలకం. సరిపడా గ్యాస్‌ లభ్యం కావాలి. పరిశ్రమలు, గృహ అవసరాల కోసం గ్యాస్‌ అందుబాటులో ఉంచడానికి గెయిల్‌ భాగస్వామ్యంతో గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. అతి తక్కువ ఖర్చుతో ఇంధన వనరులను అందుబాటులోకి తేవడం దీని ఉద్దేశం. 

26 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు
నైపుణ్య లేమిని తీర్చడానికి ప్రపంచస్థాయిలో ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక్కోటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 26 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు తిరుపతి, విశాఖల్లో స్కిల్‌ వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక యూనివర్సిటీ పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టిపెడితే మరో వర్సిటీ ఐటీ రంగంలో నైపుణ్యాలను పెంపొందించటంపై దృష్టి సారిస్తుంది. ఇవి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచి ఉద్యోగాల కల్పన దిశగా నడిపిస్తాయి. 

కొత్త పోర్టుల నిర్మాణం...
రాష్ట్రానికి 974 కి.మీ. సువిశాల తీర ప్రాంతం ఉంది. ఎగుమతులు వృద్ధి చెందడానికి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు పోర్టులను నిర్మిస్తోంది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు, ప్రకాశం జిల్లా రామాయపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టులను నిర్మిస్తోంది. పొరుగు రాష్ట్రాలకు కూడా ఈ పోర్టులు సమీపంలో ఉన్నాయి. మచిలీపట్నం పోర్టు తెలంగాణకు, రామాయపట్నం తమిళనాడుకు, భావనపాడు ఉత్తరాది రాష్ట్రాలకు సమీపంలో ఉన్నాయి. విదేశీ వాణిజ్యాన్ని పెంచడంలో ఈ పోర్టులు కీలక పాత్ర పోషిస్తాయి. పారిశ్రామికీకరణ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది.  ప్రస్తుతం రాష్ట్రంలో పోర్టుల వార్షిక నిర్వహణ సామర్థ్యం 254 మిలియన్‌ టన్నులు కాగా మూడు కొత్త పోర్టుల వల్ల తొలిదశలో మరో 65 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం వృద్ధి చెందుతుంది.

8 కొత్త ఫిషింగ్‌ హార్బర్లు
వీటితోపాటు మరో 8 ఫిషింగ్‌ హార్బర్లను కూడా నిర్మిస్తున్నాం. ఏపీకి ఇంత పెద్ద సముద్ర తీర ప్రాంతం ఉన్నా హార్బర్లు లేకపోవడంల్ల మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండు విడతల్లో 8 ఫిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తున్నాం. ఇందుకోసం రూ.3,827 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీనివల్ల 76,230 మంది మత్స్యకారులు లబ్ధి పొందడమే కాకుండా మరో 35 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఐస్‌ ప్లాంట్లు, కోల్డ్‌ స్టోరేజీలు, చేపలు, రొయ్యల ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ సదుపాయాలు అందుబాటులోకి రావడం ద్వారా ఎగుమతులు పెరుగుతాయి.

25 సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల రైతులకు మంచి ధరలు దక్కడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించడం వల్ల ఎగుమతులు పెరుగుతాయి. ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జె.సుబ్రహ్మణ్యం,  ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పలువురు వాణిజ్యవేత్తలు పాల్గొన్నారు.

మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్లున్న ఏకైక రాష్ట్రం
దేశంలో మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్లు కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. విశాఖ – చెన్నై, చెన్నై – బెంగళూరు, హైదరాబాద్‌– బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్లు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తిస్తాయి. ఈ కారిడార్లు ఆర్థిక వృద్ధి రేటును పెంచడమే కాదు పారిశ్రామికీకరణను పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్తాయి. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ను అభివృద్ధి చేస్తోంది. 3,155 ఎకరాల్లో మల్టీ ఇండస్ట్రియల్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నాం.

నాణ్యమైన విద్యుత్తు, నీరు, ఎస్‌టీపీలు లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. రూ.20 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే దిశగా అడుగులేస్తున్నాం. దాదాపు లక్ష మందికిపైగా ఉపాధి కల్పించే సమర్థత ఈ పార్కుకు ఉంది. ఇదే ఇండస్ట్రియల్‌ పార్కులో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. 800 ఎకరాల్లో రూ.730 కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మిస్తున్నాం. దీనిద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. 25 వేల మందికి ఉద్యోగాల కల్పన సామర్థ్యం ఈఎంసీకి ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్టీల్‌ ఉత్పత్తులకు గిరాకీ పెరిగిన దృష్ట్యా 3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో రూ.13,500 కోట్లతో కడప జిల్లాలో స్టీల్‌ ఫ్యాక్టరీని నెలకొల్పుతున్నాం.

ఆకట్టుకున్న ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌
విజయవాడలో రెండురోజుల వాణిజ్య ఉత్సవ్‌లో రాష్ట్ర పరిశ్రమలశాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ సందర్శకులతో పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అమితంగా ఆకర్షించింది. రాష్ట్రంలో ఎగుమతి అవకాశాలను తెలిపే విధంగా మొత్తం 29 స్టాల్స్‌తో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న 15 ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్స్‌ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. ఏపీ ఎక్స్‌పీరియన్స్‌ ఎరినా పేరుతో రాష్ట్రంలో మౌలిక వసతులు, వైఎస్సార్‌ వన్‌ ద్వారా అందించే బిజినెస్‌ అడ్వైజరీ సేవలు, రాష్ట్రంలో ఎగుమతులకు అవకాశం ఉన్న ఉత్పత్తులు, ఎగుమతులకు ప్రభుత్వం సహకారం తెలిపే విధంగా మూడు తెరలు ఏర్పాటు చేసి వీడియోలు చూసేలా టచ్‌ స్క్రీన్‌ కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 15 నిమిషాలపాటు ఆసక్తిగా ఎరినా, ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ను సందర్శించారు. మానవ శిరోజాలను ఎగుమతిచేసే స్టాల్స్, టీ ఎగుమతులు, హస్తకళలు, ఎంపెడా ఏర్పాటు చేసిన అక్వేరియం చేపలు, మచిలీపట్నం ఇమిటేషన్‌ జ్యువెలరీ, హస్తకళల స్టాల్స్‌ను సందర్శించి వ్యాపారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మచిలీపట్నం ఇమిటేషన్‌ జ్యువెలరీ స్టాల్స్‌లో చిన్న వేంకటేశ్వరస్వామి ప్రతిమను చూసి వీటిని పెద్దగా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అతిథులకు ఇచ్చే మెమెంటోగా వాడుకోవచ్చని సీఎం అధికారులకు సూచించారు.  
ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌లో ఉత్పత్తులను తిలకిస్తున్న సీఎం జగన్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top