
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల అభివృద్ధి, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా.. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సీఎం వైఎస్ జగన్.. అధికారులను ఆదేశించారు. అలాగే, పెద్ద ఉత్తున ఉపాధిని కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. సకాలంలో వారికి ప్రోత్సాహకాలు అందేలా చూడాలన్నారు. కాగా, దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఎంఎస్‌ఎఈలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇచ్చిందని అధికారులు.. సీఎం జగన్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇదే ఒరవడి కొనసాగాలన్న సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతీ ఏటా.. క్రమం తప్పకుండా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు.
ఇండస్ట్రియల్ పార్కుల్లో కాలుష్య నివారణ..
పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థలను పరిశీలించాలి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగిన స్థాయిలో ఉన్నాయా? లేవా? చూడాలి. ప్రత్యేక నిధి ద్వారా కాలుష్య నివారణ వ్యవస్థలను పారిశ్రామిక వాడల్లో బలోపేతం చేయాలి. సంబంధిత యూనిట్లకు ప్రభుత్వం నుంచి కొంత సహాయం చేసే రీతిలో విధానాన్ని తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఈ క్రమంలో పంప్డ్ స్టోరేజీ పవర్ ద్వారా వాల్యూ అడిషన్ చేస్తున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గ్రీన్ హైడ్రోజన్, అమ్మెనియా తయారీలపై ఫోకస్ పెట్టినట్టు తెలిపారు. దీనివల్ల గ్రీన్‌ఎనర్జీ రంగంలో చాలా ముందడుగు వేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పాలసీలు తయారుచేయాలని సీఎం జగన్ ఆదేశించారు.