మరింత లోతుగా పరిశీలన

CM Jagan review with central medical and research experts - Sakshi

ఏలూరు ఘటనలో ఏ అంశాన్నీ తేలిగ్గా తీసుకోవద్దు

కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన నిపుణులతో సీఎం జగన్‌ సమీక్ష

ఇలాంటివి పునరావృతం కాకుండా అన్ని కోణాల్లో పరిశీలించాలి 

పెస్టిసైడ్స్‌పై ప్రఖ్యాత సంస్థల అనుమానాలు

మనుషుల శరీరాల్లోకి ఎలా చేరాయో దీర్ఘకాలిక అధ్యయనం జరపాలి

ఢిల్లీ ఎయిమ్స్, ఐఐసీటీకి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం

పశ్చిమ గోదావరి జిల్లా అంతటా పరీక్షలు జరపండి

అన్ని జిల్లాల్లో తాగునీటి వనరులను పరీక్షించాలి

సేంద్రియ పద్ధతులు, వ్యవసాయానికి పెద్దపీట 

ఆర్బీకేల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలన్న సీఎం

సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పలువురు అస్వస్థతకు గురి కావటానికి కారణాలపై మరింత లోతుగా పరిశీలన జరపాలని, ఏ అంశాన్నీ తేలిగ్గా తీసుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించాలంటే అన్ని కోణాల్లో పరిశీలించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. బహుశా పురుగు మందుల అవశేషాలే ఇందుకు కారణం కావచ్చని, బాధితుల శరీరంలోకి చేరి అనారోగ్యానికి దారి తీసి ఉండవచ్చని, అయితే దీనిపై మరింత అధ్యయనం అవసరమని ఢిల్లీ ఎయిమ్స్, ఐఐసీటీ సహా పలు ప్రఖ్యాత సంస్థలు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో దీనిపై దీర్ఘకాలిక అధ్యయనం నిర్వహించే బాధ్యతలను ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ ఎయిమ్స్, ఐఐసీటీకి అప్పగించారు. దేన్నీ కొట్టి పారేయకుండా మరింత క్షుణ్నంగా పరీక్షలు జరపాలని కోరారు. ఏలూరుతోపాటు పశ్చిమ గోదావరి జిల్లా అంతా పరీక్షలు నిర్వహించాల్సిందిగా సూచించారు. ఏలూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), కలెక్టర్‌ ముత్యాలరాజు తదితరులు పాల్గొనగా క్యాంప్‌ ఆఫీసు నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌తోపాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. సీఎం జగన్‌ సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ...

సమగ్రంగా తాగునీటి వనరుల పరిశీలన..
డంపింగ్‌ యార్డుల నిర్వహణపై దృష్టి సారించాలి. అన్ని జిల్లాల్లో తాగు నీటి వనరులన్నింటినీ పరిశీలించాలి. ఒక పద్ధతి ప్రకారం శాంపిల్స్‌ తీసుకుని నిపుణులతో విశ్లేషణ చేయించాలి. ఫలితాలను లోతుగా అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఎయిమ్స్, ఐఐసీటీ కార్యాచరణలోకి దిగి ఏలూరు ఘటనలకు దారి తీసిన పరిస్థితులపై నిరంతర పరిశీలన చేయాలి. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాచరణ రూపొందించాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా నివారించాలి. 

సేంద్రీయ సాగును ప్రోత్సహించాలి..
సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి. ఆర్బీకేల ద్వారా ప్రచారం చేయాలి. ఆరోగ్యానికి హాని కలిగించే పురుగు మందులను మార్కెట్‌ నుంచి పూర్తిగా నిర్మూలించేలా వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

మూడు ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి ల్యాబ్‌లు..
ప్రతి జిల్లాలో పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్‌లను పటిష్టం చేయాలి. క్రమం తప్పకుండా శాంపిళ్లను స్వీకరించి ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలి. మూడు ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి.

ఎలా చేరాయో గుర్తించాలి..
మనుషుల శరీరాల్లోకి పురుగు మందుల అవశేషాలు ఎలా చేరాయన్న దానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ దృష్టి పెట్టాలి.
– డా.ఆశిష్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధి

విచ్చలవిడి వ్యర్థాలే కారణం
పలువురు బాధితుల నమూనాల్లో పురుగు మందుల అవశేషాలు కనిపించాయి. అవి కూరగాయల ద్వారా చేరుకున్నాయా? లేక మరో రకంగా ప్రవేశించాయా? అనే విషయం ఇంకా తేలలేదు. చాలా చోట్ల పెస్టిసైడ్స్‌ వాడిన తర్వాత ఖాళీ డబ్బాలను అలాగే వదిలేశారు. పురుగు మందుల డబ్బాలను ఇలా పడేయడం వల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతోంది. వీటిని తగిన విధంగా నిర్వీర్యం చేయాలి. ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీలు లేకపోయినా లెడ్, నికెల్‌ లాంటి హెవీ మెటల్స్‌ రక్తంలోకి వచ్చాయంటే దీనికి కారణం ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలే. బ్యాటరీలు, మరికొన్ని ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఎక్కడపడితే అక్కడ పడేయడం, కాల్చడం వల్ల విష పదార్థాలు కలుషితమయ్యాయి. పెస్టిసైడ్స్, ఎలక్ట్రానిక్‌ వస్తువుల నిర్వీర్యం పద్ధతి ప్రకారం జరగాలి
–డా.బి.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రముఖ న్యూరో ఫిజీషియన్‌

కచ్చితమైన కారణం కోసం కొద్ది నెలలు పరీక్షలు
బాధితుల రక్తంలో లెడ్‌ కనిపించింది. పాలకు సంబంధించి అన్ని శాంపిళ్లలో నికెల్‌ కనిపించింది. ఆర్గానో క్లోరిన్‌ వల్ల ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తున్నాం. బహుశా పెస్టిసైడ్స్‌ (పురుగు మందులు) కారణంగానే ఇలా జరిగి ఉండవచ్చు. ఆహార చక్రంలో భాగంగా అది బాధితుల శరీరాల్లోకి చేరే అవకాశం ఉంది. బాధితుల బంధువుల రక్త నమూనాల్లో కూడా లెడ్‌ కనిపించింది. దీర్ఘకాలంలో దీనిపై ప్రత్యేక దృష్టి అవసరం. కొన్ని నెలల పాటు ఆహార పదార్థాలు, తాగు నీరు, కూరగాయలు తదితర శాంపిళ్లను పరిశీలిస్తే అస్వస్థతకు దారి తీసిన పరిస్థితులపై కచ్చితమైన కారణాన్ని కనిపెట్టే అవకాశం ఉంది.      
    –ఢిల్లీ ఎయిమ్స్‌
సీఎం వైఎస్‌ జగన్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కేంద్ర సంస్థల ప్రతినిధులు, నిపుణులు 

వాటర్‌ క్లీన్‌గానే ఉంది..
ఏలూరులో 21 చోట్ల నుంచి నీటి శాంపిల్స్‌ తీసుకున్నాం. తాగునీటిలో ఎలాంటి గుర్తించదగ్గ భార లోహాలు కనిపించ లేదు. లెడ్, ఆర్సెనిక్, నికెల్‌ తరహా లోహాలు లేవు. పురుగు మందుల అవశేషాలు కూడా గుర్తించదగ్గ స్థాయిలో లేవు. ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేసి నిర్ధారించుకున్నాం. వాటర్‌ క్లీన్‌గా ఉంది. మనుషులు, పశువుల నుంచి కూడా రక్త నమూనాలు సేకరించాం. రక్త నమూనాల్లో ఎండో సల్ఫాన్, డీడీడీ కనిపించాయి,. కొన్ని రక్త నమూనాల్లో లెడ్‌ కనిపించింది. ఆర్గనో ఫాస్పేట్స్‌ కనిపించలేదు.
–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌

సేంద్రీయ విధానాలపై చైతన్యం చేయాలి
ఏలూరు ఘటనను పరిగణనలోకి తీసుకుని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితులపై అధ్యయనం చేయాల్సి ఉంది. పెస్టిసైడ్స్‌ మనుషుల శరీరంలోకి ఎలా చేరాయో పరిశీలించాలి. పురుగు మందుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి. దీర్ఘకాలంలో సేంద్రీయ పద్ధతులను అనుసరించడంపై చైతన్యం కలిగించాలి. వైద్య పరంగా కూడా కార్యాచరణ అవసరం.
–ఎయిమ్స్, మంగళగిరి

మెర్క్యురీ మోతాదు దాటింది
ఏలూరులో గాలిలో కాలుష్య కారక పదార్థాలపై పరిశీలన జరిపాం. గాలి సాధారణ స్థాయిలోనే ఉంది. భూగర్భ జలాల శాంపిళ్లను పరీక్షించాం. మెర్క్యురీ మినహా మిగిలిన లోహాలన్నీ పరిమిత స్థాయిలోనే ఉన్నాయి. ఉపరితల జలాల్లో కూడా అన్నీ పరిమిత స్థాయిలోనే ఉన్నాయి. మెర్క్యురీ మాత్రం సాధారణ పరిమితికి మించి ఉంది. సాలిడ్‌ వేస్ట్‌ బర్నింగ్‌ (వ్యర్థ పదార్ధాలు కాల్చడం) కూడా దీనికి కారణం కావచ్చు. ఆర్గనో క్లోరిన్, ఆర్గనో ఫాస్పేట్స్‌ కనిపించ లేదు. లెడ్‌ కూడా లేదు. మట్టి నమూనాలపై విశ్లేషణ, పరీక్షలు జరుగుతున్నాయి.
–నీరి (నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌)

వైరల్‌ ఇన్ఫెక్షన్‌కు ఆధారాలు లేవు 
సీరం, యూరిన్‌ తదితర శాంపిళ్లు పరీక్షించాం. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ అనేందుకు ఎలాంటి ఆధారాలు కానరాలేదు.
–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, పుణె

కూరగాయల్లో పెస్టిసైడ్స్‌ అవశేషాలు
టమోటా, వంకాయలపై పురుగు మందుల అవశేషాలు కనిపించాయి. బహుశా పెస్టిసైడ్స్‌ కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చు.
–ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌

అంతా పరిమితిలోనే ఉన్నాయి
పరీక్షించిన శాంపిళ్లలో పరిమితికి మించి ఏవీ కనిపించ లేదు. వైరస్, బాక్టీరియా కనిపించ లేదు.
–సీసీఎంబీ, హైదరాబాద్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top