జీవనాడికి జీవం

CM Jagan Meeting With PM Narendra Modi On Polavaram - Sakshi

పోలవరం మొదలు పలు పెండింగ్‌ అంశాలపై ప్రధాని మోదీతో సీఎం జగన్‌ సుదీర్ఘ చర్చలు

రూ.55,548.87 కోట్లకు సవరించిన అంచనాలను ఖరారు చేయాలి

బకాయిలు విడుదల చేసి రెవెన్యూ లోటు భర్తీ చేయండి

గత సర్కారు నిర్వాకాలకు రుణ పరిమితిలో కోతలు సరికాదు

కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఏపీఎండీసీకి గనులు కేటాయించండి 

విభజన హామీలను నెరవేర్చాలి

తెలంగాణ నుంచి రూ.6 వేల కోట్లకుపైగా విద్యుత్తు బకాయిలు ఇప్పించండి

12 కొత్త వైద్య కళాశాలలకు అనుమతివ్వాలి

కేంద్ర మంత్రులు షెకావత్, నిర్మలా సీతారామన్‌తోనూ సీఎం భేటీ

నేడు హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఖరారు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.32,625 కోట్ల మేర రెవెన్యూ లోటు భర్తీ నిధులు రావాల్సి ఉందని  వివరించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్‌ సాయంత్రం ప్రధాని మోదీతో 45 నిమిషాలకు పైగా సమావేశమై పలు పెండింగ్‌ అంశాలపై చర్చించారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలు, రుణ పరిమితిలో కోత, 12 వైద్య కళాశాలలకు అనుమతులు, జాతీయ ఆహార భద్రతా చట్టం రేషన్‌కార్డు లబ్ధిదారుల ఎంపికలో అసమానతల తొలగింపు, భోగాపురం విమానాశ్రయానికి అనుమతులు, కడప స్టీలు ప్లాంటు కోసం ఏపీఎండీసీకి గనుల కేటాయింపు, ఇంటిగ్రేటెడ్‌ బీచ్‌ శాండ్‌ మినరల్స్‌ ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానితో విస్తృతంగా చర్చించారు.

ఆయా అంశాలపై వినతిపత్రాలను  అందజేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కూడా కలుసుకుని పోలవరం పనులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. 

మొత్తం వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవాలి
ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో జాతీయ హోదా కల్పించిన ప్రాజెక్టులకు అనుసరించిన విధానాన్నే పాటించాలని ప్రధానిని సీఎం జగన్‌ కోరారు. డ్రింకింగ్‌ వాటర్‌ కాంపొనెంట్‌ను ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగంగా చూడాలన్నారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం అంచనాలను రూ.55,548.87 కోట్లకు ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సాంకేతిక సలహా మండలి దీనికి ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.

పోలవరం నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్‌ వారీగా విడివిడిగా కాకుండా మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని రీయింబర్స్‌ చేయాలని కోరారు. ఈ ఆంక్షల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన సొంత నిధులు రూ.905.51 కోట్లను తిరిగి చెల్లించలేదని ప్రధాని దృష్టికి తెచ్చారు. ప్రాజెక్టు నిమిత్తం చేసిన ఈ ఖర్చును 15 రోజుల్లోగా చెల్లించేలా చూడాలని అభ్యర్థించారు.

నిర్వాసిత కుటుంబాలకు ప్యాకేజీని నేరుగా నగదు బదిలీ పద్ధతిలో అందించడం వల్ల జాప్యాన్ని చాలావరకు నివారించవచ్చన్నారు. పోలవరం నిర్మాణం శరవేగంగా, సజావుగా సాగేందుకు వీలుగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే నిధులు అడ్వాన్సుగా ఇవ్వాలని కోరారు. వీటికి సంబంధించి 80 శాతం పనులు పూర్తైన తర్వాత రెండో దశలో మిగిలిన నిధులు ఇవ్వాలని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. 

వినతిపత్రంలో ముఖ్యాంశాలు ఇలా..
► 2014–15 పెండింగ్‌ బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, డిస్కమ్‌ల ఆర్థిక పునర్‌ వ్యవస్థీకరణ ప్యాకేజీ, వృద్ధుల పింఛన్లు, రైతుల రుణమాఫీకి సంబంధించి మొత్తం రూ.32,625 కోట్లు రెవెన్యూ లోటు కింద ఏపీకి కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఈ అంశంపై వెంటనే దృష్టిసారించి నిధులు విడుదల చేయాలి.

► తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.6,627.86 కోట్ల మేర విద్యుత్తు బకాయిలు ఏపీకి రావాల్సి ఉంది. రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ, ఉత్పాదక సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున ఈ అంశాన్ని త్వరగా పరిష్కరించాలి.

► గత సర్కారు హయాంలో రాష్ట్రంలో 2016–17 నుంచి 2018–19 వరకూ నిర్దేశిత పరిమితికి మించి చేసిన అప్పులను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు. మూడేళ్లలో రూ.17,923 కోట్ల మేర రుణ పరిమితిలో కోత విధించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నవి రుణాలే కానీ గ్రాంట్లు కావు. కోవిడ్‌ విపత్తు నేపథ్యంలో రుణ పరిమితి విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి. 
 
► జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్‌ లబ్ధిదారుల ఎంపికలో అసమానతలను తొలగించాలి. ఆహార భద్రతా చట్టం కింద ఏపీకి బియ్యం తక్కువగా ఇస్తున్నట్లు గుర్తించిన నీతిఆయోగ్‌ దీన్ని వెంటనే పునఃసమీక్షించాలని సూచించింది. ఆహారభద్రతా చట్టం బియ్యం దేశంలో నెలకు 3 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ ఉందని, ఇందులో నుంచి ఏపీకి కేటాయించాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసింది.

నెలకు 0.77 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అదనంగా రాష్ట్రానికి ఇవ్వాలని సూచించింది. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద రాష్ట్రానికి తక్కువ కేటాయింపులు జరుగుతున్నాయి. దాదాపు 56 లక్షల కుటుంబాలు ఈ పథకంలో పరిధిలోకి రావడం లేదు. వీరికిచ్చే బియ్యం సబ్సిడీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. 

► రాష్ట్రంలో 13 నూతన జిల్లాలు ఏర్పాటైనప్పటికీ ప్రస్తుతం 11 వైద్య కళాశాలలే ఉన్నాయి. కేంద్రం ఇటీవల అనుమతించిన మూడు మెడికల్‌ కాలేజీల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటితో కలిపి చూసినా 14 వైద్య కళాశాలలే అవుతాయి. మిగిలిన 12 వైద్య కళాశాలలకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలి.  

► భోగాపురం విమానాశ్రయం క్లియరెన్స్‌ అనుమతుల గడువు ముగిసినందున తాజాగా అనుమతులు ఇవ్వాలి. ఈ మేరకు పౌర విమానయాన శాఖకు తగిన ఆదేశాలివ్వాలి.

► కడపలో స్టీలు ప్లాంట్‌ నిర్మిస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారు.  వాణిజ్యపరంగా ప్లాంట్‌ నడిచేందుకు నిరంతరాయంగా ఐరన్‌ ఓర్‌ సరఫరాకు వీలుగా ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి. రాయలసీమ ప్రజల జీవనోపాధికి, ఈ ప్రాంతంలో ఆర్థిక ప్రగతికి స్టీల్‌ప్లాంట్‌ ఎంతో అవసరం.

► ఇంటిగ్రేటెడ్‌ బీచ్‌ శాండ్‌ మినరల్స్‌ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ రంగంలో సుమారు రూ.20 వేల కోట్లు పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయి. 16 చోట్ల బీచ్‌శాండ్‌ మినరల్స్‌ ప్రతిపాదనలను అందచేయగా 14 చోట్ల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీఎండీసీకి వీటిని కేటాయించాలని కోరుతున్నాం.

బకాయిలు విడుదల చేయండి 
– నిర్మలా సీతారామన్‌కు సీఎం విజ్ఞప్తి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ సందర్భంగా పోలవరం సవరించిన అంచనాలు, బకాయిల విడుదల తదితర అంశాలపై సీఎం జగన్‌ చర్చించారు. వివిధ పద్దుల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. రుణ పరిమితిలో కోతలు విధించడం సరికాదని నివేదించారు. ఆర్థికమంత్రితో సమావేశం అనంతరం ఢిల్లీలోని అధికారిక నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌ రాత్రి అక్కడే బస చేశారు. 
కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

విమానాశ్రయంలో ఘన స్వాగతం
ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులతో భేటీ నిమిత్తం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విమానాశ్రయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ నేత మిథున్‌రెడ్డి సీఎంతో పాటు ఢిల్లీ చేరుకున్నారు. ఎంపీలు మార్గాని భరత్‌రామ్, మద్దిళ్ల గురుమూర్తి, నందిగం సురేశ్, బి.వి.సత్యవతి, అయోధ్యరామిరెడ్డి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.  

పోలవరం సకాలంలో పూర్తికి సహకరించండి
దేశ రాజధాని పర్యటనలో భాగంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో గురువారం రాత్రి సమావేశమైన ముఖ్యమంత్రి జగన్‌ పోలవరం నిర్మాణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలోని పలు అంశాలను ఆయన దృష్టికి తెచ్చారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం, నిధులు ఎప్పటికప్పుడు విడుదల తదితరాలను ప్రస్తావించారు. సకాలంలో ప్రాజెక్టు పూర్తయ్యేలా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.  
కేంద్ర మంత్రి షెకావత్‌కు ఆంధ్రా స్పెషల్‌ బంగినపల్లి మామిడి పండ్లు అందిస్తున్న సీఎం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top