నేడు అక్క చెల్లెమ్మలకు రెండో విడత ‘చేయూత’  | Sakshi
Sakshi News home page

నేడు అక్క చెల్లెమ్మలకు రెండో విడత ‘చేయూత’ 

Published Tue, Jun 22 2021 4:36 AM

CM Jagan To Launch YSR Cheyutha Scheme Second Phase Today - Sakshi

సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 – 60 ఏళ్ల వయసు అక్క చెల్లెమ్మలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున నేడు ఆర్థిక సహాయం అందజేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు వర్చువల్‌ విధానంలో పాల్గొనేలా ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల కార్యాలయం నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరవుతారు. 

రెండేళ్లలో  రూ.8,943.52 కోట్లు సాయం..
45 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ. 18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా మహిళలకు దాదాపు రూ.19,000 కోట్లు అందజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందులో భాగంగా వరుసగా రెండో ఏడాది 23,14,342 మంది మహిళలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని మంగళవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తద్వారా మొదటి, రెండో విడతలో కలిపి రూ.8,943 కోట్ల మొత్తం అక్క చెల్లెమ్మలకు అందజేసినట్లు అవుతుంది. 

సాయం సద్వినియోగం...
ఈ పథకం ద్వారా అందజేసే డబ్బులను ఉపయోగించుకోవడంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే వారి జీవనోపాధి మార్గాలను మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తోంది. ఈ ఆర్థిక సహాయంతో మహిళలు కిరాణా షాపులతోపాటు గేదెలు, ఆవులు, మేకలు లాంటి జీవనోపాధి మార్గాలను ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు తోడ్పాటు అందజేస్తారు.

కిరాణా షాపులు, పాడి పశువులు, జీవాల పెంపకంతో...
వైఎస్సార్‌ చేయూత ద్వారా తొలి ఏడాది అందజేసిన సాయంతో ఇప్పటికే 78,000 మంది కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకోగా 1,90,517 మంది అక్కచెల్లెమ్మలు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం చేపట్టి కుటుంబ ఆదాయాన్ని పెంపొందించుకున్నారు. ఈ వ్యాపారాలలో మహిళలకు ఎక్కువ లాభాలు దక్కేలా అమూల్, హెచ్‌యూఎల్, రిలయెన్స్, పీఅండ్‌జీ, ఐటీసీ లాంటి దిగ్గజ సంస్ధలు, బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న మహిళలకు మార్కెట్‌ ధర కన్నా కంటే తక్కువకే ఆయా సంస్థలు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. పాడి గేదెలు, ఆవులు కొనుగోలు చేయడానికి సహాయం చేస్తూనే అమూల్‌తో భాగస్వామ్యం ద్వారా ఇప్పుడు మార్కెట్‌లో ఇస్తున్న ధర కన్నా లీటర్‌ పాలపై రూ. 5 నుంచి రూ. 15 వరకు మహిళలకు అదనపు ఆదాయం సమకూరేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

అదనంగా లబ్ధి...
►ఇప్పటికే ప్రతి నెలా సామాజిక పింఛన్లు అందుకుంటున్న 45 – 60 ఏళ్ల వయసు కలిగిన ఆరు లక్షల మందికిపైగా ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు తమ కాళ్లపై నిలబడేందుకు పింఛన్‌కు అదనంగా వైఎస్సార్‌ చేయూత ద్వారా లబ్ధి చేకూర్చనున్నారు.
►60 ఏళ్ల లోపు వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల ప్రయోజనం కోసం వైఎస్సార్‌ చేయూత పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అర్హత ఉంటే 60 ఏళ్ల తర్వాత వారికి పెన్షన్‌ మంజూరు చేసేలా పింఛను అర్హత వయసును వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే తగ్గించిన విషయం తెలిసిందే. అంతకుముందు వృద్ధాప్య పింఛనుకు 65 ఏళ్లు కనీస అర్హతగా ఉన్న వయసును ఈ ప్రభుత్వం 60 ఏళ్లకు తగ్గించింది. 

Advertisement
 
Advertisement