‘స్పందనే’ ప్రామాణికం

CM Jagan comments at spandana new portal launch - Sakshi

ప్రజల వినతుల పరిష్కారానికి కలెక్టర్లు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి

స్పందన నూతన పోర్టల్‌ ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్‌         

గ్రామ, వార్డు సచివాలయాలే లక్ష్యంగా స్పందన పోర్టల్‌ 

ప్రజలు నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా సమస్య విన్నవించే అవకాశం 

వినతుల పరిష్కారంలో నాణ్యతపై క్షేత్ర స్థాయిలో సర్వేలు 

నవరత్నాల్లో ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి  

ఏ పథకమైనా అర్హులు ఎవరూ మిగిలి పోకుండా చూడాలి 

దరఖాస్తులను తిరస్కరించే ముందు ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి 

నిర్ణీత కాల వ్యవధిలోగా ప్రభుత్వ పథకాలు అందించేలా చర్యలు తీసుకోవాలి

సాక్షి, అమరావతి: స్పందన వినతుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, కలెక్టర్ల పని తీరుకు ఈ కార్యక్రమాన్ని ప్రామాణికంగా భావిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పౌరుడు వినతిపత్రం ఇచ్చాక అది పరిష్కారం అయ్యే తీరును నేరుగా అధికారులు, ఉన్నతాధికారులు ట్రాక్‌ చేయాలని సూచించారు. ఈ ట్రాకింగ్‌ మెకానిజం చాలా పటిష్టంగా ఉండాలన్నారు. పౌరుల గ్రీవెన్స్‌లను పరిష్కరించకుండా పక్కన పడేసే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. నేరుగా సీఎం కార్యాలయ అధికారులు కూడా గ్రీవెన్స్‌ల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పరిశీలన, సమీక్ష చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలే లక్ష్యంగా మరింత ఆధునీకరించిన స్పందన నూతన పోర్టల్‌ను శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులు.. పరిష్కారానికి అర్హమైనవిగా గుర్తించిన తర్వాత తప్పకుండా వాటిని పరిష్కరించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా పరిష్కారం కాకపోతే అది ఏస్థాయిలో నిలిచిపోయిందన్నది తెలియాలని, సంబంధిత సిబ్బంది, అధికారికి అలర్ట్స్‌ వెళ్లాలని సూచించారు. ఒకవేళగ్రీవెన్స్‌ను తిరస్కరిస్తున్నప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నారో కచ్చితంగా కారణం చెప్పగలగాలన్నారు.   

 
పటిష్టంగా నవరత్నాల అమలు 
► నవరత్నాల్లో ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, నవరత్న పథకాల సోషల్‌ ఆడిట్‌ సమయంలోనే అర్హులైన వారి పేర్లు రాలేదని తెలిసిన వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.  
► అయినప్పటికీ ఎవరైనా మిగిలిపోయిన పక్షంలో పథకం అమలు చేసిన తేదీ నుంచి నెల రోజుల పాటు వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు. తర్వాత నెలలో వెరిఫికేషన్‌ చేసి, మూడో నెలలో వారికి నిధులు విడుదల చేయాలని చెప్పారు. అప్పటితో ఆ స్కీం సంపూర్ణంగా ముగిసినట్టు అవుతుందని తెలిపారు. 
 
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు 
► దరఖాస్తు చేసిన 90 రోజుల్లో అర్హులైన వారికి కచ్చితంగా ఇంటి స్థలం పట్టా అందాల్సిందేనని సీఎం పునరుద్ఘాటించారు. నిర్ణీత సమయంలోగా ఇంటి స్థలం పట్టా అందించాల్సిన బాధ్యత అధికారులదే అని చెప్పారు. పింఛన్, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇతరత్రా అన్నీ కూడా నిర్ణీత వ్యవధిలోగా మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  
► సుమారు లక్ష వరకు ఇంటి స్థలాల కోసం మళ్లీ దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన కూడా పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం దరఖాస్తులన్నంటినీ కూడా మరోసారి వెరిఫై చేసి, అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. 
► ఇంటి స్థలాల పట్టాల కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించాలని, వచ్చే నెలలో ఈ దరఖాస్తులకు సంబంధించి రీ వెరిఫికేషన్‌ పూర్తి చేయాలని ఆదేశించారు.   
► ఈ కార్యక్రమంలో ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, ఐటీ, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కార్యదర్శి విజయకుమార్, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లిఖార్జున, ఆరీ్టజీఎస్‌ సీఈఓ జే విద్యాసాగర్‌ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 
స్పందన నూతన పోర్టల్‌ పనితీరు ఇలా 
► పాత పోర్టల్‌లో 2,677 సబ్జెక్టులు, 27,919 ఉప సబ్జెక్టులు 
► అప్‌డేషన్‌ చేసిన పోర్ట్‌ల్‌లో 858 సబ్జెక్టులు, 3,758 ఉప సబ్జెక్టులు 
► దీనివల్ల చాలా వరకూ సమయం ఆదా. గ్రామ, వార్డు సచివాలయాలే లక్ష్యంగా రూపకల్పన. పౌరులు నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం. 
► గ్రామ సచివాలయాలు, కాల్‌ సెంటర్, వెబ్‌ అప్లికేషన్, మొబైల్‌ యాప్, ప్రజా దర్బార్ల ద్వారా వినతులు ఇచ్చే అవకాశం. 
► స్వీకరించిన వినతుల్లో అత్యంత తీవ్రమైనవి, తీవ్రమైనవి, సాధారణమైనవిగా వర్గీకరణ. 
► వినతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మూడు ఆప్షన్లు. వెబ్‌ లింక్‌ ద్వారా, 1902కు కాల్‌చేసి, గ్రామ సచివాలయాల ద్వారా తెలుసుకునే అవకాశం. 
► వినతి పరిష్కారం పట్ల పౌరుడు సంతృప్తి చెందకపోతే తిరిగి మళ్లీ అదే ఫిర్యాదును ఓపెన్‌ చేసి జిల్లా స్థాయిలో లేదా విభాగాధిపతి స్థాయిలో విజ్ఞప్తి చేయవచ్చు. 
► సేవల పట్ల ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటారు. వినతుల పరిష్కారంలో నాణ్యత ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహిస్తారు. థర్డ్‌ పార్టీ ఆడిట్‌ కూడా జరుగుతుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top