విశాఖలో ఎపెడా ప్రాంతీయ కార్యాలయం

CM Jagan Appeal to Set up APEDA Regional Offices in Visakhapatnam - Sakshi

ఏర్పాటుకు సీఎం జగన్‌ విజ్ఞప్తి

ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఊతమివ్వాలి

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌కు లేఖ

సాక్షి, అమరావతి: వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు వీలుగా విశాఖపట్నంలో వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎపెడా) ప్రాంతీయ కార్యాలయాన్ని  ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌కు లేఖ రాశారు. ఏపీ ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రమని, 62 శాతం జనాభా వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన ఆహార ధాన్యాల పంట వరితో పాటు పత్తి, మొక్క జొన్న, నూనె గింజలు, పప్పు ధాన్యాలు పెద్ద ఎత్తున సాగవుతున్నాయని వివరించారు. ఈ దృష్ట్యా ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఊతమివ్వాలని కోరారు. ఆ లేఖలోని వివరాలిలా ఉన్నాయి. 

పలు పంటల ఉత్పత్తిలో ప్రథమ స్థానం
► 17.84 లక్షల హెక్టార్లలో సాగవుతున్న ఉద్యాన పంటల ద్వారా 312.34 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి వస్తోంది. దేశంలోనే పండ్ల ఉత్పత్తిలో, మిరప, కోకో, నిమ్మ, ఆయిల్‌ పామ్, బొప్పాయి, టమాటో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. జీడిపప్పు, మామిడి, బత్తాయిసాగులో 2వ స్థానంలో ఉంది.
► పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం అపారమైన ఎగుమతి సామర్థ్యాన్ని కలిగి ఉంది. 
► ఆక్వాకల్చర్‌కు మద్దతుగా 974 కి.మీ పొడవుతో రెండవ పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం. దేశంలో రొయ్యల ఉత్పత్తిలో 70% వాటాను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్‌.. సముద్ర చేపలు, లోతట్టు చేపల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది.
► 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.13,781 కోట్ల విలువైన 52.88 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు, రూ.15,832 కోట్ల విలువైన 2.79 లక్షల టన్నుల సముద్ర మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసింది.
► రాష్ట్రం నుంచి బియ్యం, మామిడి, అరటి, నిమ్మ, జీడిపప్పు, మిరప, పసుపు, వెజిటబుల్‌ ఆయిల్స్, కాఫీ, చక్కెర, పాల ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులతో పాటు ఆక్వా ఫీడ్, ఘనీభవించిన రొయ్యల ఎగుమతులను మరింత పెంచే అవకాశం ఉంది.
► దేశంలోనే 2వ అతి పెద్ద ఓడరేవు విశాఖలో ఉన్నందున వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి సులభతరం చేయడంలో ‘ఎపెడా’ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ దృష్ట్యా ఏపీ నుంచి వ్యవసాయ, అనుబంధ రంగ ఉత్పత్తుల ఎగుమతులను మరింత పెంచేందుకు విశాఖలో ఎపెడా ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటు తక్షణావసరం. ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top