
నాకు 176 పనులు ఉంటాయి..
సీఆర్‌డీఏ భవన ప్రారంబోత్సవంలో సీఎం చంద్రబాబు
ఇంటికొక పారిశ్రామికవేత్త విధానం అమరావతి నుంచే ప్రారంభం కావాలి
మీరింకా రైతుల్లాగే ఆలోచిస్తే ఎక్కడికో వెళ్లి ఐదు..పదెకరాల భూమి తీసుకుని వ్యవసాయం చేసుకోవాల్సి వస్తుంది.. రైతులు తమ ఆలోచనలు మార్చుకోవాలి
అమరావతి కంటే విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది
సాక్షి, అమరావతి/తాడికొండ: ‘పరిపాలనకు కేంద్ర బిందువైన అమరావతి సిటీ ఇక్కడితో ఆగిపోతే చిన్నదైపోతుంది. సిటీ పెరగకపోతే మున్సిపాల్టీగా మారుతుంది. దీని విలువ పెరగాలంటే నిరంతరం సపోరి్టంగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రావాలి. దేనికైనా భూమి కావాలి. ఆకాశంలో రాజధాని కట్టం.. కట్టలేం. అమరావతి ప్రపంచ స్థాయి గ్రీన్ ఫీల్డ్ రాజధాని. గతంలో హైదరాబాద్ చుట్టూ 9 మున్సిపాల్టీలను కలిపి ఔటర్ రింగ్ రోడ్డుగా అభివృద్ధి చేస్తే.. కోర్ ఏరియా సైబరాబాద్‌కు డిమాండ్ పెరిగింది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
సోమవారం రాజధాని ప్రాంతంలో జీ ప్లస్ 7 అంతస్తుల్లో నిర్మించిన క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అమరావతి రైతుల సమక్షంలో మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో ల్యాండ్ పూలింగ్ కింద అందరూ భూములిచ్చిన ఏకైక చరిత్ర అమరావతికే దక్కుతుందన్నారు. ఫేజ్–1లో భూములిచ్చిన రైతులకు రాజధాని ఫలాలు అనుభవించేందుకు తగిన సహకారం అందిస్తామన్నారు.
ఇంటికొక పారిశ్రామికవేత్తవిధానం అమరావతి నుంచే ప్రారంభం కావాలన్నారు. మీరింకా రైతుల్లాగే ఆలోచిస్తే ఎక్కడికో వెళ్లి ఐదు.. పది ఎకరాల భూమి తీసుకుని వ్యవసాయం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అమరావతి ముఖ చిత్రం మారుతోందని, రైతులు ఆలోచనలు మార్చుకోవాలన్నారు. ‘రైతులు నెక్ట్స్లెవల్లో ఆలోచించాలి.
అన్నీ మీరే (ప్రభుత్వం) చేసేయాలంటే ఎవరూ ఏం చేయలేం. నాకు కూడా 176 పనులు ఉంటాయి. అన్నీ చేయలేదంటే ఐదేళ్ల తర్వాత గుర్తు పెట్టుకోండి. ఒకసారి చేసిన తప్పుకు నష్టపోయారు. భవిష్యత్తులో ఓటమి అనే మాట లేకుండా శాశ్వతంగా ఎన్డీఏనే అధికారంలో ఉండాలి. అందుకే జనసేన, టీడీపీ, బీజేపీ.. ముగ్గురం కలిసి ముందుకెళ్తున్నాం’ అన్నారు.
భూములు అమ్మి రాజధాని కడతాం
హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు 5 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు తాను చెప్పినట్టే కోటీశ్వరులు అయ్యారని సీఎం చంద్రబాబు తెలిపారు. వారిని చూసే రాజధాని రైతులు అమరావతికి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చారన్నారు. ఇది సెల్ఫ్ మానిటైజేషన్ అని, ఒక్క రూపాయి ప్రభుత్వ డబ్బులు ఖర్చు చేయట్లేదని స్పష్టం చేశారు. అమరావతి కంటే విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించే బాధ్యతను కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తీసుకోవాలని సూచించారు.
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా విశాఖ సదస్సు
పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే సరికొత్త ఆలోచనలకు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన సీఐఐ పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ పై సోమవారం ఆయన సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సీఐఐ సదస్సుకు విచ్చేయండి ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: కర్నూలులో ఈ నెల 16న నిర్వహించనున్న ‘సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్’ కార్యక్రమానికి, నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సమ్మిట్–2025కు విచ్చేయాలంటూ ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కోరారు.
సీఐఐ సదస్సుకు అధ్యక్షత వహించాలని కోరారు. ఈ మేరకు ప్రధానికి ప్రత్యేక ఆహ్వానాన్ని అందించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన మంత్రి లోకేశ్‌తో కలసి ఇక్కడికి వచ్చారు. కాగా, మంగళవారం ఢిల్లీలో గూగుల్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలిసింది.