23 నెలల్లోనే రూ.3,56,655 కోట్ల అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
ప్రజల ఆదాయం, రాష్ట్ర రాబడి పెంచడంలో ఘోర వైఫల్యం
మొత్తం రాష్ట్ర అప్పులను రూ.9,88,859 కోట్లకు పెంచేసిన వైనం
మంగళవారం 7.81 శాతం వడ్డీతో రూ.4,600 కోట్లు బడ్జెట్ అప్పు
దీంతో బడ్జెట్ అప్పులే రూ.1,98,564 కోట్లు
కార్పొరేషన్ల గ్యారెంటీ అప్పు రూ.1,10,704 కోట్లు
రాజధాని అప్పులు రూ.47,387 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోగా తిరిగి జనంపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం భారీగా అప్పుల భారం మోపుతోంది. 23 నెలల పాలనలోనే మొత్తం రూ.3,56,655 కోట్ల మేర అప్పులు చేసింది. ఈ లెక్కన చంద్రబాబు ప్రభుత్వం నెలకు సగటున రూ.15,506 కోట్లు, రోజుకు రూ.516 కోట్లు చొప్పున అప్పు చేసింది. రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని పెంచడంలో, ఖజానాకు రాబడి పెంచడంలోనూ వైఫల్యం చెందిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని మాత్రం అత్యంత వేగంగా అప్పుల ఊబిలో ముంచేశారు.
మంగళవారం 7.81 శాతం వడ్డీతో రూ.4,600 కోట్ల బడ్జెట్ అప్పు చేశారు. దీంతో చంద్రబాబు సర్కారు 23 నెలల్లోనే రికార్డు స్థాయిలో బడ్జెట్‌లోనే రూ.1,98,564 కోట్ల అప్పు చేసింది. ఇప్పటి వరకు కార్పొరేషన్ల పేరుతో గ్యారెంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు, రాజధాని పేరుతో చేసిన అప్పులతో కలిపి మొత్తం రాష్ట్ర అప్పులను రూ.9,88,859 కోట్లకు పెంచేసింది. బడ్జెట్ బయట, బడ్జెట్‌లోపల అందిన కాడికి అప్పులు చేసినా సూపర్ సిక్స్ హామీలు మాత్రం అమలు చేయలేదు.
రాష్ట్రాభివృద్ధి.. కొత్త ఉద్యోగాలూ లేవు. చేసిన అప్పులన్నీ రెవెన్యూ వ్యయానికి మళ్లించేసి, రాష్ట్ర ప్రజలను దారుణమైన అప్పుల్లోకి నెట్టేసింది. మరో పక్క వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.1,10,704 కోట్లకు చేరాయి. ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లే కాకుండా కొత్తగా కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి మరీ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. ఇంకో వైపు రాజధాని పేరుతో రూ.47,387 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది.
ఇటీవల మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన గణాంకాల మేరకే వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి బడ్జెట్ అప్పులు, బడ్జెట్ బయట అప్పులు కలిపి మొత్తం రూ.6,32,204 కోట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ అప్పులు ఏకంగా రూ.9,88,859 కోట్లకు పెరిగాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ వ్యవధిలో ఇంత భారీ ఎత్తున అప్పులు చేసిన దాఖలాలు లేవు. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత భారీగా అప్పుల చేసిన ఘనత కేవలం చంద్రబాబు ప్రభుత్వానికే దక్కింది.
ఈ మంగళవారం చేసిన అప్పు రూ.4,600 కోట్లు
23 నెలల్లో చేసిన మొత్తం అప్పు రూ.3,56,655 కోట్లు
నెలకు సగటున చేసిన అప్పు రూ.15,506కోట్లు
రోజుకు సగటున చేసిన అప్పు రూ.516.8 కోట్లు


