ఇది పేదలకు స్థిరాస్తిని అందించే మహాయజ్ఞం

Cherukuvada Sriranganatharaju on Navratna Schemes and Houses to poor schemes - Sakshi

పథకం అమలులో అధికారులదే కీలక పాత్ర

‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పై సమీక్షలో మంత్రి శ్రీరంగనాథరాజు 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలులో అధికారుల పాత్ర కీలకమని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. ఈ పథకం నిరుపేదలకు స్థిరాస్తిని అందించే మహాయజ్ఞం అని తెలిపారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంపై మంత్రి అధ్యక్షతన విజయవాడలోని ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో గురువారం 13 జిల్లాల హౌసింగ్‌ జేసీలు, ప్రాజెక్టు డైరెక్టర్‌లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ నెలాఖరుకు మొదటి దశలో నిర్మింప తలపెట్టిన ఇళ్లన్నింటికి శంకుస్థాపనలు పూర్తి కావాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు తమ పరిధిలోని అన్ని లే అవుట్‌లను సందర్శించి వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.  

వైఎస్సార్, జగనన్న కాలనీలు అన్ని వసతులతో కళకళలాడుతూ రాష్ట్రంలో మోడల్‌ గ్రామాలు, కాలనీలుగా నిలవాలన్నారు.  సీఎం వైఎస్‌ జగన్‌సూచించిన విధంగా పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని చెప్పారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ మాట్లాడుతూ.. మొదటి దశ శంకుస్థాపనలు జరిగిన ఇళ్ల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.   సమావేశంలో మంత్రి, అధికారులు జిల్లాల వారీగా పథకం అమలు, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా సమీక్షించారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రాహుల్‌పాండే, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దావులూరి దొరబాబు, ఎండీ భరత్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top