
సిండికేట్ దోపిడీకే పచ్చజెండా
బార్లపై ఏఆర్‌ఈటీ తగ్గింపునకే మొగ్గు
బార్లలోనూ చీప్‌లిక్కర్ విక్రయాలు!
ఇదీ చంద్రబాబు ప్రభుత్వ పన్నాగం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం మద్యం దందాను కొత్తపుంతలు తొక్కిస్తోంది. ప్రభుత్వ పెద్దల హైడ్రామాను కొనసాగిస్తూ బార్ల ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి కొత్తదారి కనిపెట్టింది. 2014–19లో చీకటి జీవోలతో ప్రివిలేజ్ ఫీజు రద్దుచేసి రూ.5,200 కోట్లు కొల్లగొట్టిన తీరు తెలిసిందే. ఈసారి సిండికేట్‌కు అడ్డగోలుగా 15 శాతం లాభాల మార్జిన్ పెంచేందుకు మరో అడ్డదారి కనిపెట్టారు. ఈ అడ్డదారితో సిండికేట్ మరింత భారీగా దోచుకునేందుకు రాచబాట వేయాలని నిర్ణయించింది. ఇందుకు.. బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులైనా రావాలనే నిబంధనను ఉపయోగించుకుంటోంది.
ప్రభుత్వ పెద్దల పక్కా పన్నాగంతోనే సిండికేట్ బార్లకు దరఖాస్తులు దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తోంది. గడువును శుక్రవారం వరకు పొడిగించిన తరువాత కొంతవరకు దరఖాస్తులు దాఖలు చేశారు. మొత్తం 840 బార్లలో గురువారం నాటికి వంద బార్లకు కనీసం నాలుగు చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి. చివరిరోజు శుక్రవారం మరో 50 బార్లకు కనీసం నాలుగు దరఖాస్తులు దాఖలు చేయాలని సిండికేట్ వ్యూహం రచించింది. ఆ విధంగా దాఖలైన నాలుగేసి దరఖాస్తులన్నీ సిండికేట్ సభ్యులవే ఉంటాయన్నది బహిరంగ రహస్యమే.
ఈ నెల 30న 150 బార్లకు లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తారు. ఆ బార్లను టీడీపీ సిండికేట్ ఏకపక్షంగా దక్కించుకుంటుంది. మిగిలిన బార్లకు సెప్టెంబర్ లో మరోసారి నోటిఫికేషన్ ఇస్తారు. అలా నాలుగైదు దశల్లో నోటిఫికేషన్లు ఇచ్చి.. ప్రతిదశలోను 150– 200 వరకు బార్లను టీడీపీ సిండికేట్‌కు కట్టబెడతారు. తద్వారా బార్లకు దరఖాస్తు చేసేందుకు ఎవరూ ఉత్సాహం చూపడం లేదనే కుట్రపూరిత వాదనను బలపరుస్తూ కథ నడుపుతారు. ఆ నెపంతో ఏం చేస్తారంటే..
నమ్మించే కథలు..
దరఖాస్తుల దాఖలుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు కాబట్టి.. బార్ల యజమానులకు మరిన్ని వెసులుబాట్లు కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఓ ప్రతిపాదనను రూపొందిస్తుంది. బార్లకు సరఫరా చేసే మద్యంపై ప్రస్తుతం ఉన్న 15 శాతం వార్షిక రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్‌ఈటీ)ను తొలగించాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది. అవసరమైతే ఆ 15 శాతం ఏఆర్‌ఈటీని బార్లతోపాటు రాష్ట్రంలోని ప్రైవేటు మద్యం దుకాణాలకు సమానంగా సర్దుబాటు చేయవచ్చని కనికట్టు చేస్తుంది. మంత్రుల కమిటీనే ఆ మేరకు సిఫార్సు చేసినట్టు కథ నడిపిస్తుంది. వాస్తవానికి ప్రైవేటు మద్యం దుకాణాలకు ఇప్పటికే రెండేళ్లపాటు లైసెన్సులు జారీచేసేశారు.
వారిపై కొత్తగా ఏఆర్‌ఈటీ విధించడం ప్రస్తుతానికి సాధ్యం కాదు. కాబట్టి ప్రైవేటు మద్యం దుకాణాల ప్రస్తుత లైసెన్స్ కాలపరిమితి ముగిసిన తరువాత ఆ అంశాన్ని పరిశీలించాలని మంత్రుల కమిటీ సూచిస్తుంది. అందుకు మరో ఏడాదికిపైగా సమయం ఉంది. అప్పుడు ఆ అంశాన్ని పరిశీలించవచ్చని కనికట్టు చేస్తారు. బార్లపై ఏఆర్‌ఈటీని తొలగిస్తారు. బార్ల యజమానులు యథావిధిగా ప్రస్తుతం అమలులో ఉన్న రేట్లకే మద్యం అమ్మకాలు కొనసాగిస్తారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వ ఖజానాకు 15 శాతం మేర గండిపడుతుంది.
చీప్‌గా దండుకో..
మద్యం సిండికేట్ దోపిడీకి మరో అవకాశాన్ని కల్పిస్తూ.. బార్లలోను చీప్ లిక్కర్ అమ్మకాలకు అనుమతించాలని చంద్రబాబు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. చీప్ లిక్కర్ విక్రయాలతో ప్రభుత్వానికి పన్నుల రాబడి పెద్దగా లేదు. కానీ టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న ప్రైవేటు మద్యం దుకాణాలకు భారీ లాభాలు వస్తున్నాయి. అందులో మద్యం ధరలో లాభాల మారిŠజ్‌న్ అధికంగా ఉంది. అందుకే బార్లలో కూడా చీప్ లిక్కర్ అమ్మకాలను అనుమతించాలన్న సిండికేట్ డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గింది.
ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో చీప్ లిక్కర్ వాటా 30 శాతం ఉంది. నెలకు సగటున రూ.3 వేల కోట్ల మద్యం విక్రయాలు సాగుతుంటే అందులో రూ.900 కోట్ల మేర చీప్ లిక్కర్ ద్వారానే వస్తోంది. బార్లలోను అనుమతిస్తే చీప్ లిక్కర్ విక్రయాలు మరింతగా పెరుగుతాయి. సిండికేట్ లాభాల కోసం చీప్ లిక్కర్ విక్రయాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వతీరు ఆందోళన కలిగిస్తోంది. చీప్ లిక్కర్‌తో మద్యం ప్రియులు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
కాలేయం, ఉదరకోశ, మానసిక ఆరోగ్య సమస్యలు రాష్ట్రంలో పెరుగుతుండటమే అందుకు నిదర్శనం. కానీ మద్యం సిండికేట్ దోపిడీకి వత్తాసు పలకడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే ఉద్దేశమేలేదని ఎక్సైజ్ శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.