
‘‘ప్రజలకు మరీ ఆశ ఉండకూడదు. దురాశ పనికిరాదు’’ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తరచూ చేసే వ్యాఖ్య ఇది. ఈమధ్య సోషల్ మీడియాలోనూ ఆయన వాడిన ఈ డైలాగులు ఎక్కవగా కనిపిస్తున్నాయి. ఆయన చెప్పింది వాస్తవమే. ఎందుకంటారా? బాబు, పవన్‌కళ్యాణ్ లాంటి వాళ్లు ఇచ్చినమాటకు కట్టుబడి హామీలన్నీ నెరవేరుస్తారని నమ్మడం ప్రజల అత్యాశే కదా! ఈ దురాశతోనే ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించింది! పాపం.. పై పై వాగ్ధానాలు చేసిన వాళ్లు ఎవరు? వారి ట్రాక్ రికార్డు ఏమిటి అన్నది కూడా గుర్తుపెట్టుకోకుండా ప్రజలు అతిగా ఆశపడ్డారు.
టీడీపీ ఎన్నికల మానిఫెస్టోలోని ‘ఆడ బిడ్డ నిధి’కి కూడా బాబు అండ్ కో మంగళం పాడేసినట్లేనన్న వార్తలు చూసిన తరువాత ప్రజలను ఇంత గొప్పగా మోసం చేయవచ్చా? అని అనిపించక మానదు. ప్రజలను దురాశా పరులుగా చిత్రీకరించి నిందించవచ్చు కానీ.. ఆ ఆశ పెట్టిన వారి తప్పు మాత్రం ఏమీ లేదన్నచందంగా ఉందీ వ్యవహారం. ప్రజలను ఇంత బాహాటంగా మోసం చేసినందుకు ఇతర దేశాల్లో ఎలాంటి శిక్షలు పడతాయో తెలియదు కానీ.. ఇలాంటి వారు.. ప్రజల ఆగ్రహాన్ని, ఛీత్కారాలనైతే తప్పకుండా చూస్తారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలో నేతల వైఖరి నమ్మి మోసపోయిన వారిదే తప్పన్నట్టుగా ఉండటం. అయ్యో ఈ నేతలు ప్రజలను పిచ్చోళ్లుగా చూస్తున్నారే అన్న ఆవేదన కలుగుతుంది. నిజాయితీ లేని నేతలు అధికారంలోకి వచ్చి, చెప్పినవి చేయకపోగా, వారినే బెదిరిస్తున్న తీరు, విషయాలను పక్కదారి పట్టిస్తున్న తీరులపై పెద్ద పరిశోధనే చేయవచ్చు.
ఆశపెట్టి ఏమార్చడం.. ఆ తరువాత ప్రజలనే నిందించడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. సుమారు రూ.లక్ష కోట్ల రైతు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానన్న హామీతో 2014లో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ తరువాత ఏం చేశారో అందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే ఆయన ‘‘ఆశకు హద్దు ఉండాలి’’ అని రైతులను ఉద్దేశించి నేరుగానే అన్నారు. తాజాగా 2024 ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీ ప్రతి మహిళకూ రూ.1500 చొప్పున నెల నెల ఇస్తానని! ఈ పథకానికి ఆడబిడ్డ నిధి పేరూ పెట్టారు. ప్రతి ఒక్కరికీ ఇస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకూ రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఊదరగొట్టడంతో మహిళలు చాలామంది ఆశపడ్డారు. ఓట్లేశారు.
ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు అప్పట్లో ‘‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు’’ అంటూ ప్రచారం చేయడమూ మనం చూశాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు సైతం.. ‘‘ఒకరుంటే రూ.15 వేలు, నలుగురు పిల్లలుంటే రూ.60 వేలు..ఇంకా పిల్లలను కనండి..వారి బాధ్యత మాది’’ అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఏడాది పూర్తి అయిపోయింది.. తల్లికి వందనం లేదు. విద్యార్ధులకు సుమారు రూ.13 వేలు ఎగవేశారు. వచ్చే విద్యా సంవత్సరం ఇస్తామని అంటున్నారు. ఏమవుతుందో తెలియదు!
ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత రవాణా సౌకర్యం అన్న హామీని కూడా అటకెక్కించేశారు. అమలు చేసి ఉంటే ఏపీ మహిళలకు ఏడాదికి రూ మూడు వేల కోట్ల వరకూ మిగిలేది! ఈ లెక్క కూడా ఎల్లోమీడియాదే. ఆగస్టు పదిహేను నుంచి ఈ స్కీము అమలు చేస్తామని చంద్రబాబు ఈమధ్య కర్నూలులో ప్రకటించారు. అంటే మరో మూడు నెలలు ఈ స్కీమ్ ఉండదు. దీనిని కూడా లెక్కలోకి తీసుకుంటే మహిళలు మరో రూ.వెయ్యి కోట్లు నష్టపోయినట్లు! ఇదే సభలో చంద్రబాబు ఆడబిడ్డ నిధి స్కీము లేనట్లే తేల్చారని వార్త వచ్చింది. దానికి ఆయన ఇచ్చిన వివరణ చూస్తే మరీ ఇంత పచ్చి పాపమా అనిపిస్తుంది.
తాను అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు మోసపూరితమని ఆయనకు తెలుసు. తాను ఆ వాగ్దానాలు ఎందుకు చేసింది.. ఎందుకు అమలు చేయలేకపోతున్నది నిజాయితీగా వివరించడం మానేసి, మరో కొత్త అబద్దాన్ని సృష్టించారు. అదేమిటంటే తాను తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని ఏపీలో పేదలు బాగానే సంపాదిస్తున్నట్లు చంద్రబాబే తేల్చేశారు! అందువల్ల వారికి ఆ స్కీమ్ అవసరం లేదని, 2029నాటికి పేదరికం లేకుండా చేసేస్తామని, అప్పటికీ పేదలు ఉంటే పీ-4 కింద దాతలకు అప్పగిస్తామని అన్నారట.
కూటమి ప్రభుత్వం వచ్చాక, ప్రజల చేతుల్లో డబ్బులు ఆడక పేదలు, గిట్టుబాటు ధరలు లేక రైతులు, వ్యాపారాలు లేక వ్యాపారస్తులు అల్లాడుతుంటే పేదలంతా బాగా సంపాదించుకుంటున్నారని చంద్రబాబు చెబుతున్నారు. ఇలాంటి వారి మాటలు నమ్మి ఓటు వేసినందుకు తమకు బాగానే శాస్తి అయిందని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఆడబిడ్డ నిధి స్కీము రాష్ట్రంలోని కోటిన్నర మంది మహిళలకు ఉపయోగపడేది! ఏడాదికి సుమారు రూ.30 వేల కోట్లకుపైగా అవసరమని లెక్క. ఇంత మొత్తం ఎలా సాధ్యమని అప్పట్లో ప్రశ్నించిన వారికి బాబు ఇచ్చిన సమాధానం తాను సంపద సృష్టించగలనూ అని!
ఇప్పుడేమో సంపద వచ్చేసిందని చెబుతుంటే బిత్తరపోవడం తప్ప ప్రజలు చేయగలిగేది ఏముంటుంది! ఒకరకంగా చెప్పాలంటే ఈవీఎంల మాయాజాలం సంగతి పక్కనబెడితే అనేక నియోజకవర్గాలలో తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి వాగ్దానాలు గేమ్ చేంజర్ గా మారి కూటమిని అధికారంలోకి తెచ్చాయి. ఇప్పుడేమో చేతులెత్తేసి పేదల జీవితాలతో కూటమి నేతలు చెలగాటమాడుతున్నారు. వాగ్దానాల గురించి చెప్పకుండా, చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నామని, ఓర్వకల్‌లో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశామని, బుద్దుడి సలహాలు పాటించండని కధలు చెబుతున్నారు.
ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. చెత్త ఎత్తడానికి పనివారు వస్తున్నారా అని చంద్రబాబు ప్రశ్నిస్తే లేదు..లేదు..అని ఎక్కువ మంది చేతులెత్తారు. దాంతో చెత్త గురించి ఆయన చెబుతున్న కబుర్లలో డొల్లతనం బయటపడింది. చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు పెడతామని, లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలు చేస్తామని, ఉద్యానవన పంటలను 18 లక్షల హెక్టార్ల నుంచి 36 లక్షల హెక్టార్లు చేస్తామని, ఇలా ఏవేవో సంబంధం లేని మాటలతో ప్రసంగం చేశారు. అక్కడితో ఆగితే ఫర్వాలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కూడా దబాయించి మరీ చెప్పారు. నవ్వుకుని ఊండిపోవడం అక్కడి ప్రజల వంతైంది.
చివరికి బుద్దుడు, ఆయన శిష్యుడి కథ అంటూ చంద్రబాబు ప్రజలకు ఒక స్టోరీ చెప్పారు. దాని ప్రకారం శిష్యుడి కోరిక మేరకు బుద్దుడు కొత్త వస్త్రాలు ఇప్పించారట. ఆ తర్వాత కొద్ది రోజులకు బుద్దుడు పిలిచి పాత వస్త్రాలు ఏమి చేశావని అడిగాడట. వాటితో చిరిగిపోయిన బొంతలో పెట్టి కుట్టుకున్నానని శిష్యుడు చెప్పాడట. మరీ చినిగిపోయిన బొంతలోని వస్త్రాలు ఏమి చేశావు అని బుద్దుడు అడిగాడట. వాటిని కిటికీ తెరలు చేశానని జవాబు ఇచ్చారు.మరి అప్పటికే ఉన్న కిటీకి తెరలు ఏమి చేశావని అడిగితే గది తుడవడానికి వాడుతున్నానని, ఆ వస్త్రాన్ని మసిబట్టగా వాడుతున్నానని, అప్పటిదాకా ఉన్న మసిబట్ట దారాలను కొవ్వొత్తిలో వాడే వత్తులకు వినియోగిస్తున్నానని శిష్యుడు చెప్పారట. ప్రతి వస్తువుకూ ఒక ఉపయోగం ఉంటుందని చెప్పడానికి చంద్రబాబు ఈ కథ చెప్పినా, విన్న వారికి మాత్రం చివరికి ఏపీ పరిస్థితి ఇలా మారిందన్నమాట అని అనుకున్నారనుకోవాలి.
ఒక పక్క అమరావతిలో ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ తదితర భవనాలు ఉన్నా, అవి పనికి రావంటూ లక్ష కోట్లు వ్యయం చేస్తూ గొప్పలు చెప్పే చంద్రబాబు ప్రజలు మాత్రం ఈ ఆధునిక యుగంలో చినిగిన వస్త్రాలు సైతం వాడుకోవాలని చెబుతున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి బుద్దుడు, శిష్యుడు కథ వర్తించదా అంటే ఏమి చెబుతాం. ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు అన్న సూత్రం చంద్రబాబు వంటివారిని చూసే వచ్చిందనుకోవాలి.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.