
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయ భవనాలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
రూ.84.74 కోట్ల నుంచి రూ.338.14 కోట్లకు చేరిన నిర్మాణ వ్యయం
చదరపు అడుగుకు రూ.11,002.64 వెచ్చించిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి/తాడికొండ: రాజధాని ప్రాంతంలో రాయపూడి వద్ద నిర్మించిన సీఆర్‌డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) కార్యాలయ భవనం, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయ భవనాలను సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు. ఇకపై రాజధాని నిర్మాణ పనులను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు (ఈ–3)–ఎన్11 జంక్షన్ వద్ద సీఆర్‌డీఏ కార్యాలయ భవనం జీ+1 పద్ధతిలో రూ.39.69 కోట్లతో నిర్మించేలా కాంట్రాక్టర్లకు తొలుత అప్పగించారు.
ఆ తర్వాత జీ+1 భవనంపై అదనంగా ఆరు అంతస్తులు నిర్మించే పనులను రూ.45.05 కోట్లతో చేపట్టేలా కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అంటే.. 3,07,326 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో సీఆర్‌డీఏ భవన నిర్మాణ పనులను రూ.84.74 కోట్లకు కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఇందులో 2019, మే నాటికే రూ.43.7 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు.
సీఆర్‌డీఏ కార్యాలయాన్ని లోపల, బయట కళాత్మకంగా తీర్చిదిద్దడంతోపాటు భవనం లోపల (ఇంటర్నల్ ఫినిషింగ్ వర్క్స్), ఎంఈపీఎఎఫ్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫైర్) వర్క్స్, ఐసీటీ (ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) వర్క్స్, బయట అభివృద్ధి పనుల (ఎక్సటర్నల్ డెవలప్‌మెంట్ వర్క్స్)ను జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.160 కోట్లకు గతేడాది కాంట్రాక్టర్‌కు కట్టబెట్టింది.
ఇక సీఆర్‌డీఏ భవనానికి ఫర్నిచర్, ఇంటీరియర్స్, ఇతర పనులను పన్నులతో కలిపి రూ.93.4 కోట్లతో చేపట్టేలా అప్పగించింది. అంటే.. సీఆర్‌డీఏ భవనం నిర్మాణ వ్యయం రూ.84.74 కోట్ల నుంచి రూ.338.14 కోట్లకు చేరుకున్నట్టు స్పష్టమవుతోంది. అంటే.. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.11,002.64గా చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఫైవ్ స్టార్ వసతుల భవనాల నిర్మాణ వ్యయం రూ.4 వేల నుంచి రూ.4,500 లోపే ఉంటుందని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సీఆర్‌డీఏకు 3 ఫ్లోర్లు
ఇక సీఆర్‌డీఏ భవనంలోనే కమాండ్ కంట్రోల్ ఆఫీస్, 5 భారీ మీటింగ్ హాళ్లు, సీఆర్‌డీఏ కార్యాలయం కోసం మూడు ఫ్లోర్లు, ఏడీసీఎల్ ఆఫీస్, సీడీఎంఏ ఆఫీస్, రెరా ఆఫీస్, డీటీసీపీ ఆఫీస్, పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సీ ఆఫీస్, మున్సిపల్ శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాల కోసం స్థలం కేటాయించారు. మున్సిపల్ శాఖలో మిగిలిన విభాగాల కోసం సీఆర్‌డీఏ ఆఫీస్‌కు సమీపంలోనే పీఈబీ పద్ధతిలో మూడు షెడ్ల నిర్మాణ పనులను మార్చి 29న రూ.28.69 కోట్లకు కాంట్రాక్టు సంస్థ ఎన్‌సీసీకి అప్పగించారు.
ఆ మూడు షెడ్లకు ఆర్కిటెక్చురల్ ఫినిషింగ్ పనులు, విద్యుదీకరణ, ప్లంబింగ్ పనులను ఎన్‌సీసీకే రూ.40.35 కోట్లకు అప్పగించారు. తాజాగా నాలుగో షెడ్డు నిర్మాణంతోపాటు ఇప్పటికే నిర్మిస్తున్న మూడు షెడ్లకు ఫర్నిచర్, సోలార్ ప్యానల్స్, బయట అభివృద్ధి పనులు చేపట్టడానికి పన్నులతో కలిపి రూ.65.55 కోట్ల కాంట్రాక్టు విలువతో టెండర్లు పిలిచారు. దీనినిబట్టి చూస్తే నాలుగు షెడ్ల కోసమే రూ.134.59 కోట్లు వ్యయం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది.