
బాలాజీ గోవిందప్పను విజయవాడలో కోర్టుకు తీసుకొస్తున్న పోలీసులు
బాలాజీ గోవిందప్పతో బలవంతంగా సంతకాలు చేయించిన సిట్
మూడో పార్టీ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ అక్రమంగా జప్తు.. అవాస్తవాలు, అభూత కల్పనలతో రిమాండ్ నివేదిక
ప్రత్యేక మెమో ద్వారా కోర్టుకు నివేదిక
వాటిని పరిగణనలోకి తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్న న్యాయస్థానం
అరెస్టుకు ముందే రిమాండ్ నివేదికలు రూపొందిస్తున్న సిట్
టీడీపీ ఆఫీసులో నివేదికలు... వాటినే కోర్టుకు సమర్పిస్తున్న దర్యాప్తు సంస్థ
కాపీ, పేస్ట్ రిమాండ్ నివేదికలతో రెడ్‌బుక్ కుట్రలు మరోసారి బహిర్గతం
బాలాజీ గోవిందప్ప జగన్ దగ్గర పనిచేస్తున్నట్లు తప్పుడు రాతలు
ఆయన అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ కంపెనీ వికాట్‌లో ఫైనాన్స్ డైరెక్టర్
ఈ అరెస్టుతో భారతదేశంలో ఎవరినైనా అరెస్టు చేయగలమని సందేశం పంపిన కూటమి సర్కారు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ కుట్ర మరోసారి బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో నియమించుకున్న సిట్ ద్వారా సాగిస్తున్న కుతంత్రం న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక సాక్షిగా బయటపడింది. దర్యాప్తు, ఆధారాలు తదితర న్యాయపరమైన విధానాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా సాగిస్తున్న కుతంత్రం మరోసారి వెలుగుచూసింది. టీడీపీ ప్రధాన కార్యాలయంలో అవాస్తవాలు, అభూత కల్పనలతో రూపొందించిన నివేదికలనే సిట్ తన రిమాండ్ నివేదికలతో సమర్పించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు బరితెగిస్తోందని ఆధారాలతో సహా వెల్లడైంది.
ఈ అక్రమ కేసులో సిట్ తాజాగా అరెస్టు చేసిన అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలంతో రిమాండ్ నివేదిక రూపొందించి సిట్ అడ్డంగా దొరికిపోయింది. ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ అధికారులే న్యాయస్థానానికి వెల్లడించాల్సి వచ్చింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. ఈ కేసులో తాజాగా బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికలోనూ అదే అబద్ధపు వాంగ్మూలాల కుతంత్రానికి తెగబడింది.
కర్ణాటకలో మంగళవారం అరెస్టు చేసిన ఆయన్ను సిట్ అధికారులు బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ కుట్రలను సవాల్ చేస్తూ ఈ కేసులో అరెస్టైన రాజ్ కేసిరెడ్డి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అరెస్టు అక్రమమని, చట్ట విరుద్ధమని నివేదించింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణలో అరెస్టుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని ప్రకటించింది.
బాలాజీ గోవిందప్పతో సిట్ అధికారులు పలు పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించారని న్యాయస్థానానికి సమరి్పంచిన మెమోలో పేర్కొన్న భాగం
గోవిందప్పతో బలవంతంగా సంతకాలు చేయించిన సిట్
చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రతోనే ఈ అక్రమ కేసులో బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చారన్నది వెల్లడైంది. ఆయన పేరిట అవాస్తవాలతో సిట్ అధికారులే అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేశారు. ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు బాలాజీ గోవిందప్ప నిరాకరించారని.. ఆయనతో పోలీసులు బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టంగా ఉండటం గమనార్హం. అంతేకాదు మూడో పార్టీకి చెందిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను సిట్ అధికారులు అక్రమంగా జప్తు చేశారన్నది కూడా వెలుగులోకి వచ్చింది.
వాటిని ట్యాంపర్ చేయడం ద్వారా ఈ కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలన్నది సిట్ లక్ష్యమన్నది స్పష్టమవుతోంది. ఇదే విషయాలను బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాది ప్రత్యేక మెమో ద్వారా న్యాయస్థానం దృష్టికి తెచ్చారని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఆ మెమోలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని న్యాయస్థానం సానుకూలంగా స్పందించడం కీలకంగా మారింది.
ఇక బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుందని తెలిసే... అంతకుముందే తెల్లవారు జామునే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారని గోవిందప్ప న్యాయవాది న్యాయస్థానానికి నివేదించారు. సిట్‌లో సభ్యుడుకాని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లుకు ఎలాంటి అధికారం లేనప్పటికీ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.
సిట్ పూర్తిగా అవాస్తవాలు, అభూతకల్పనలతో బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికను రూపొందించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది.
అరెస్టుకు ముందే రిమాండ్ నివేదికలా..!
ఆ నివేదిక కుట్రే... ఇదిగో సాక్ష్యం...
ఇక నిందితుల అరెస్టు, విచారణతో నిమిత్తం లేకుండానే టీడీపీ కార్యాలయంలోనే రిమాండ్ నివేదికలు రూపొందిస్తున్న కుట్రలు బట్టబయలయ్యాయి. బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికే ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆయన అరెస్టుకు కారణాలను వెల్లడిస్తూ... నిందితుడు పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి ఇతరులు అవినీతికి పాల్పడ్డారు అని పేర్కొంది. అసలు బాలాజీ గోవిందప్ప అరెస్టుపై రిమాండ్ నివేదికలో కృష్ణమోహన్‌రెడ్డి పేరును ఎందుకు ప్రస్తావించినట్టు..? అంటే నిందితుల అరెస్టులతో నిమిత్తం లేకుండానే ముందుగానే టీడీపీ ఆఫీసులోనే రిమాండ్ నివేదికలు రూపొందించి.. వాటిని కాపీ, పేస్ట్ చేస్తూ న్యాయస్థానానికి సమర్పిస్తున్నట్టు వెల్లడైంది.
ఎవరినైనా ఇరికిస్తాం..!
బాలాజీ గోవిందప్ప వైఎస్ జగన్ దగ్గర పనిచేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో రాశారు. కానీ ఆయన వైఎస్ జగన్ సంస్థల్లో పని చేయట్లేదు. 12 దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ వికాట్‌లో పూర్తి స్థాయి డైరెక్టర్‌గా ఉన్నారు. భారతీ సిమెంట్స్‌లో మెజార్టీ వాటాను వికాట్ ఎప్పుడో కొనుగోలు చేసింది. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులకు కంపెనీలో మైనార్టీ షేర్ మాత్రమే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులతో గోవిందప్ప చాలా సన్నిహితంగా మెలిగి కుట్రలకు పాల్పడ్డారని రిపోర్టులో రాశారు.
ఆయన ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉంటారు. ఏపీకి రావడం చాలా తక్కువ. వృత్తిరీత్యా చార్టెడ్ అక్కౌంటెంట్ అయిన గోవిందప్పకు నిరంతరం ఊపిరి సలపని పనులు ఎన్నో ఉంటాయి. ఓ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ హోల్‌టైమ్ ఫైనాన్స్ డైరెక్టర్‌నే ఇలా టార్గెట్ చేసి అక్రమ కేసులో, జరగని కుంభకోణంలో ఇరికించారంటే.. ఇక దేశంలో ఎవరినైనా కేసుల్లో ఇరికించవచ్చు అనే సందేశాన్ని చంద్రబాబు సర్కారు పంపింది. దీన్నిబట్టి భేతాళ కుట్రలు మరోసారి నిరూపితమవుతున్నాయి.