‘గంపగుత్త’గా దోచేశారు! | Chandrababu Govt Looting Money In The Name Of AMRUT 2. 0 Works: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘గంపగుత్త’గా దోచేశారు!

Jun 23 2026 4:03 AM | Updated on Jun 23 2026 4:03 AM

Chandrababu Govt Looting Money In The Name Of AMRUT 2. 0 Works: Andhra Pradesh

‘అమృత్‌ 2.0’ పనుల్లో చంద్రబాబు సర్కారు దోపిడీ పర్వం

కాంట్రాక్టు విలువ కంటే అధిక ధర రూ.5,513.07 కోట్లకు ఐదు సంస్థలకు కట్టబెట్టిన సర్కార్‌ 

103 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో తాగునీటి సరఫరా, మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, నిర్వహణ పనులు 9 ప్యాకేజీల కింద విభజన 

రూ.5,309.31 కోట్ల కాంట్రాక్టు విలువతో ప్యాకేజీల వారీగా టెండర్‌ నోటిఫికేషన్‌  

దానికి ముందే 5 బడా కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యనేత సన్నిహితుడి బేరసారాలు 

అడిగినంత కమీషన్లు ఇచ్చేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్లకు పనుల పంపిణీ.. సగటున 3.9% అధిక ధరకు కోట్‌చేస్తూ బిడ్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లకు పనులు  

అంచనా వ్యయం భారీగా పెంచేసి పనులు అప్పగించడంతో ఖజానాపై రూ.203.76 కోట్ల భారం.. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సుల రూపంలో రూ.551.30 కోట్ల మేర చెల్లింపులు 

అందులో 8% ముఖ్యనేత పంచుకు తిన్నారంటూ ఇంజనీరింగ్‌ వర్గాల ఆరోపణ 

ఈ పనులకు 2023–24లోనే మున్సిపాల్టీల వారీగా వేర్వేరుగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 

బాబు సర్కారు అధికారంలోకి రాగానే అవి రద్దు.. మున్సిపాల్టీల వారీగా టెండర్లు నిర్వహించి ఉంటే చిన్న కాంట్రాక్టర్లు ఎక్కువగా పోటీపడేవారంటున్న ఇంజనీరింగ్‌ నిపుణులు 

దానివల్ల కాంట్రాక్టు విలువ కంటే సగటున 4.5–5% తక్కువ ధరకే పనులు అప్పగించే వీలు.. 

ఫలితంగా ఖజానాకు రూ.450 కోట్లకుపైగా మిగిలేవి, గడువులోగా పనులు పూర్తయ్యేవంటున్న నిపుణులు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2019–24 మధ్య జ్యుడీషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ అమలుతోపాటు మొబిలైజేషన్‌ అడ్వాన్సు విధానం రద్దు లాంటి విప్లవాత్మక సంస్కరణలతో టెండర్ల వ్యవస్థకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జీవంపోసి పారదర్శకతకు పెద్దపీట వేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రద్దుచేసి టెండర్ల వ్యవస్థను 2014–19 తరహాలో నీరుగార్చిందనేందుకు స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, నిర్వహణ పనులే మరో నిదర్శనం.

కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఇంటింటికీ రక్షిత తాగునీటిని సరఫరా చేయడం.. మురుగునీటిని శుద్ధిచేసి మళ్లీ వినియోగించుకోవడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమృత్‌ 2.0 పథకాన్ని ప్రారంభించింది. ఈ పనులకు కేంద్రం 50 శాతం నిధులు ఇస్తుండగా మిగతా 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం, ఆయా కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీలు వాటాగా ఇవ్వాలి.

ఇలా రాష్ట్రంలో 103 మున్సిపాల్టీ, కార్పొరేషన్, నగర పంచాయతీల్లో అమృత్‌ 2.0 కింద ఇంటింటికీ తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులకు 2023–24లో కేంద్రానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదించి నిధుల విడుదలకు అంగీకరించింది. ఆ పనులకు 2023–24లోనే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అనంతరం రెండు నెలలకే 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. 

తొలుత ‘ఛామ్‌’ పాట..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమృత్‌ 2.0 కింద వైఎస్సార్‌సీపీ హయాంలో చేపట్టిన పనుల టెండర్లను రద్దుచేసింది. ఆ పథకానికి రాష్ట్ర వాటాగా నిధులు ఇచ్చేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించదనే సాకుతో 77 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీలను తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి ఛామ్‌ (కన్ససెనైర్‌ హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌) విధానంలో గతేడాది జూన్‌లో వేర్వేరుగా టెండరు నోటిఫికేషన్‌లు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీ వాటా నిధులను కాంట్రాక్టరే చెల్లించి పనులు చేపడితే.. వాటిని హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో వడ్డీతో కలిపి పదేళ్లలో చెల్లించేలా గత జూన్‌లో టెండర్లు పిలిచింది. కానీ, కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో వాటిని రద్దు చేసింది. 

ఎన్నడూలేని రీతిలో గంపగుత్తగా..
అనంతరం.. అమృత్‌ 2.0 కింద చేపట్టిన పనుల అంచనా వ్యయాలను భారీగా పెంచేశారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. 103 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీలను 9 ప్యాకేజీలుగా విభజించి.. టెండరు  నోటిఫికేషన్‌కు ముందే ముఖ్యనేత సన్నిహితుడు ఒకరు బడా కాంట్రాక్టు సంస్థలతో బేరసారాలాడారు. కమీషన్ల లెక్కతేల్చాకే.. ఆ కాంట్రాక్టు సంస్థలకే టెండరులో బిడ్లు దాఖలు చేసే అర్హత ఉండేలా నిబంధనలు రూపొందించి గతేడాది నవంబర్‌– డిసెంబర్‌లలో వేర్వేరుగా టెండర్‌ నోటిఫికేషన్లు జారీ చేయించారు. అడిగినంత కమిషన్‌ ఇచ్చిన కాంట్రాక్టు సంస్థకే అధిక ధరకు పనులు కట్టబెట్టేశారు. 

నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 24 కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, నిర్వహణ పనులకు రూ.1,048.29 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. ఇందులో బిడ్‌ దాఖలు చేయాలంటే మార్చి 31, 2025 నాటికి గత పదేళ్లలో అంటే 2014–15 నుంచి 2024–25 వరకూ ఏదైనా ఒక సంవత్సరం రూ.262.07 కోట్ల వ్యయంతో ఇలాంటి పనులనే పూర్తిచేసి ఉండాలనే నిబంధన పెట్టారు. ఈ టెండర్‌లో 3.77 శాతం అధిక ధర అంటే రూ.1087.81 కోట్లకు కోట్‌ ఎల్‌–1గా నిలిచిన మేఘాకు ఆ పనులను అప్పగించేశారు. 

 కొండపల్లి, వైఎస్సార్‌ తాడిగడప, దాచేపల్లి, విజయవాడ, జగ్గయ్యపేట, మచిలీపట్నం, గుడివాడ, పెడన, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, పిడుగురాళ్ల, గురజాల, మాచర్ల, గుంటూరు, మంగళగిరి–తాడేపల్లి, తెనాలి, పొన్నూరు, చీరాల, బాపట్ల, రేపల్లె, ఉయ్యూరు, తిరువూరు, సత్తెనపల్లి, అద్దంకి.. మొత్తం 26 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం–నిర్వహణ పనులకు రూ.1,038.34 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. 3.80 శాతం అధిక ధరకు అంటే రూ.1,077.79 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన మేఘాకు ఆ పనులను 
అప్పగించారు.

 వైఎస్సార్‌ కడప జిల్లాలో కడప కార్పొరేషన్, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు మున్సిపాల్టీలు, యర్రగుంట్ల నగర పంచాయతీలో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, వాటి నిర్వహణ పనులకు రూ.648.90 కోట్ల అంచనా వ్యయంతో టెండరు నోటిఫికేషన్‌ జారీచేశారు. 3.85 శాతం అధిక ధరకు అంటే రూ.673.82 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన జేడబ్ల్యూఐఎల్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌కు ఆ పనులు అప్పగించారు. 

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏడు కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల పనులకు రూ.563.08 కోట్ల కాంట్రాక్టు విలువతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 3.96 శాతం అధిక ధర అంటే రూ.585.33 కోట్లకు కోట్‌ చేసిన ఎన్‌సీసీ 
సంస్థకు ఆ పనులు అప్పగించారు.

అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 11 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో పనులకు రూ.426.56 కోట్లు కాంట్రాక్టు విలువగా నిర్ణయించిన టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 3.91 శాతం అధిక ధరకు అంటే  రూ.443.24 కోట్లకు కోట్‌ చేసిన ఎల్‌–1గా నిలచిన జేడబ్ల్యూఐఎల్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌కు ఆ పనులను అప్పగించారు.

 అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 11 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో పనులకు రూ.405.09 కోట్లు కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 3.90 శాతం అధిక ధరకు అంటే  రూ.420.88 కోట్లకు కోట్‌ చేసిన ఎల్‌–1గా నిలిచిన సివెట్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఆ పనులను అప్పగించారు. 

 తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో నాలుగు కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో పనులకు రూ.399.50 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 3.61 శాతం అధిక ధరకు అంటే రూ.413.89 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1గా  నిలిచిన సుధాకర ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు వాటిని అప్పగించారు. 

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఐదు కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో పనులకు రూ.398.14 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 3.93 శాతం అధిక ధరలకు అంటే రూ.413.79 కోట్లకు  కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన జేడబ్ల్యూఐఎల్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థకు వాటిని అప్పగించారు. 

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో 10 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో పనులకు రూ.381.41 కోట్ల కాంట్రాక్టు విలువతో టెండరు నోటిఫికేషన్‌ జారీ చేశారు. 3.97 శాతం అధిక ధరకు అంటే రూ.396.52 కోట్లకు కోట్‌ చేసిన ఎన్‌సీసీకి వాటిని అప్పగించారు.

రూ.551.30 కోట్ల మేర పంచుకు తిన్న వైనం..
అంచనా వ్యయం పెంచేయడం.. అస్మదీయ కాంట్రాక్టరుకే పనులు దక్కేలా నిబంధనలతో టెండరు నోటిఫికేషన్‌ జారీచేయడం.. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు పనులు కట్టబెట్టడం.. ఒప్పంద విలువలో పది శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ముట్టజెప్పడం.. అందులో ఎనిమిది శాతం ప్రభుత్వ పెద్దలు తిరిగి వసూలు చేసుకోవడం రివాజుగా మారిపోయింది. ఇదే పద్ధతిని అమృత్‌ 2.0 టెండర్లలోనూ అనుసరించారని ఇంజనీరింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ పనుల్లో రూ.551.30 కోట్లను మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ముట్టజెప్పి కాంట్రాక్టర్లు, ముఖ్య నేతలతో కలిసి పంచుకు తిన్నారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. 

చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చి ఉంటే..
ఇలా గంపగుత్తగా కాకుండా ఒక్కో కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీకి వేర్వేరుగా టెండర్లు నిర్వహించి ఉంటే.. చిన్నచిన్న కాంట్రాక్టర్లు పెద్దఎత్తున పోటీపడి బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉండేదని.. దానివల్ల కాంట్రాక్టు విలువ కంటే సగటున 4.5 నుంచి 5 శాతం తక్కువ ధరలకు పనులు అప్పగించే అవకాశం ఉండేదని.. అలాగే ఖజానాకు రూ.450 కోట్లకు పైగా ఆదా అయ్యేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. పనులు కూడా నిర్దేశిత గడువు రెండేళ్లలోగా పూర్తయ్యే అవకాశం ఉండేదని.. వాటి నిర్వహణ కూడా సవ్యంగా ఉండేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు బడా కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నా.. వాటిని మళ్లీ సబ్‌ కాంట్రాక్టు కింద ఆయా ప్రాంతాల్లోని చిన్నచిన్న కాంట్రాక్టర్లకే అప్పగించారని చెబుతున్నారు.

అంతా సిండికేట్‌.. సగటున 3.9% అధిక ధరకు..
తొమ్మిది ప్యాకేజీలకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియ.. కాంట్రాక్టు సంస్థలు కోట్‌ చేసిన ధరలు చూస్తే.. రాజధాని నిర్మాణ పనుల తరహాలోనే అమృత్‌ 2.0 పనుల్లోనూ కాంట్రాక్టర్లను ప్రభుత్వ పెద్దలే సిండికేట్‌ అయ్యేలా చేశారన్నది స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఎల్‌–1గా నిలిచిన కాంట్రాక్టు సంస్థలు వరుసగా 3.97, 3.96, 3.93, 3.91, 3.90, 3.85, 3.80, 3.77 కోట్‌ చేయడమే అందుకు నిదర్శనం. ఒక్కో ప్యాకేజీలో సగటున 3.9 శాతం అధిక ధరకు కోట్‌చేస్తూ బిడ్లు దాఖలు చేసి పనులు దక్కించుకోవడం గమనార్హం. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.203.76 కోట్ల భారం పడింది.  ఇక జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో కాంట్రాక్టర్లకు అదనంగా చెల్లిస్తామని టెండరు నిబంధనల్లో పేర్కొన్నారు. వీటిని బట్టిచూస్తే ఈ పనుల కాంట్రాక్టు విలువ రూ.6,500 కోట్లకుపైగా దాటుతుందని అంచనా వేస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement