అప్పుల ‘నెట్‌’లో ఆస్పత్రులు | Chandrababu Govt: Hospitals are surety for government debts | Sakshi
Sakshi News home page

అప్పుల ‘నెట్‌’లో ఆస్పత్రులు

Apr 23 2026 5:05 AM | Updated on Apr 23 2026 5:05 AM

Chandrababu Govt: Hospitals are surety for government debts

అప్పు తిరిగి చెల్లించడంలో విఫలమైతే ఆస్పత్రుల నుంచి వసూలు చేసేలా ట్రైపార్టీ అగ్రిమెంట్‌లో పెట్టిన నిబంధనలు

సర్కారు అప్పులకు ఆస్పత్రుల ష్యూరిటీ! 

ఆరోగ్యశ్రీ చరిత్రలో వింత విధానానికి చంద్రబాబు ప్రభుత్వం నాంది

ఇప్పటికే రూ.3.56 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి నెట్‌వర్క్‌ 

ఆస్పత్రుల బకాయిల కోసం మాత్రం విచిత్ర నిబంధనలు 

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో మరో మోసానికి సిద్ధం 

అప్పులకు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ష్యూరిటీగా ఉండాలని షరతు 

ప్రభుత్వం చెల్లించకుంటే ఆస్పత్రులే కట్టాలట.. 

వడ్డీ డబ్బులు ముందే మినహాయింపు.. 

కాబూలీ వ్యాపారుల తరహాలో చంద్రబాబు సర్కారు పోకడలు 

ఎడాపెడా అప్పులు చేస్తూ ఆరోగ్యశ్రీ పెండింగ్‌ బకాయిలకు రూ.3 వేల కోట్లు ఇవ్వకుండా తొక్కిపెట్టిన ప్రభుత్వం 

ఇప్పటికే ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలు ప్రైవేట్‌పరం యత్నాలు

ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సర్జికల్స్‌కు తీవ్ర కటకట 

రాష్ట్రంలో 104, 108 సేవలు అస్తవ్యస్థం

మొత్తంగా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ఛిన్నాభిన్నం

సాక్షి, అమరావతి: ఇప్పటికే 23 నెలల పాలనలో రికార్డు స్థాయిలో రూ.3.56 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిన చంద్రబాబు సర్కారు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా ‘ఆరోగ్యశ్రీ’ ఊపిరి తీస్తోంది! రూ.మూడు వేల కోట్లకుపైగా ఆరోగ్యశ్రీ పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వరుసగా సమ్మెలోకి వెళుతుండటంతో బకాయిలన్నింటినీ వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) చేస్తామని నమ్మబలికి మరోసారి మోసానికి సిద్ధమైంది. ఆస్పత్రుల బకాయిలు తీర్చడం కోసం అప్పులు చేస్తామంటూ ఆరోగ్యశ్రీ చరిత్రలోనే వింత సంప్రదాయానికి నాంది పలకడమే కాకుండా.. ఆ అప్పులకు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ష్యూరిటీగా ఉండాలంటూ దారుణమైన నిబంధన విధించడం.. ప్రభుత్వమే పక్కా కాబూలీ వ్యాపారుల తరహాలో వ్యవహరిస్తుండటంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.   

ఆరోగ్యశ్రీ నిర్వీర్యం.. ఆగిన ఆసరా..
అధికారం చేపట్టి రెండేళ్లు కూడా తిరక్కుండానే ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు ఛిన్నాభిన్నం చేసేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సూది మందు, దూదికి కూడా తీవ్ర కటకటలాడే పరిస్థితులు నెలకొన్నాయి. అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రులకు వెళ్లిన పేద రోగులను మందులు బయట కొనుక్కోవాలంటూ ప్రభుత్వమే అదనపు భారం మోపుతోంది. ఆరోగ్యశ్రీని నీరుగార్చడంతోపాటు రోగి కోలుకునే సమయంలో ఆర్థిక సాయంతో ఆదుకునే ఆసరా పధకాన్ని నిలిపివేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో శ్రీకారం చుట్టిన నాడు–నేడు కార్యక్రమాన్ని పూర్తిగా గాలికి వదిలేయడమే కాకుండా ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టేస్తూ మన విద్యార్థుల వైద్య విద్య కల, పేదల ఉన్నత వైద్యానికి చంద్రబాబు సర్కారు గండి కొడుతోంది. 104, 108 సేవలు స్కామ్‌లుగా మారిపోయాయి. చివరకు వైద్య పరికరాల కొనుగోళ్లలోను భారీ అవినీతికి పాల్పడుతున్నారు. మొత్తం ఆరోగ్య వ్యవస్థనే కుప్ప కూల్చేశారు. ఏపీలో ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లి ప్రైవేట్‌ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్వహించిన నేషనల్‌ శాంపిల్‌ సర్వేలో వెల్లడైంది.

మరో మోసానికి సిద్ధం..!
రూ.3 వేల కోట్లకుపైగా ఆరోగ్యశ్రీ బకాయిల సాధన కోసం నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లడంతో బకాయిలన్నీ ఓటీఎస్‌లో ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం దీన్ని నిలబెట్టుకోకపోవడంతో ఇటీవల మరోమారు ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. దీంతో తొలి విడతలో రూ.వెయ్యి కోట్ల బకాయిలు విడుదల చేస్తామని నమ్మబలికి రోజుకో తిరకాసుతో చంద్రబాబు సర్కారు చుక్కలు చూపిస్తోంది. ఓటీఎస్‌ కోసం ప్రత్యేకంగా అప్పు చేస్తామంటూ, ఆ అప్పులకు అయ్యే వడ్డీ కోసం ఆస్పత్రులకు ఇవ్వాల్సిన మొత్తంలో 8 శాతం కోత విధించనుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ను ష్యూరిటీగా పెట్టి బ్యాంక్‌ నుంచి అప్పు చేయాలని ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. అయితే ట్రస్ట్‌కు రుణాలు ఇవ్వబోమని బ్యాంకులు తేల్చి చెప్పడంతో ఫైనాన్స్‌ కార్పొరేషన్ల ద్వారా రుణాలు సమీకరించి వాటి ద్వారా ఆస్పత్రులకు నిధులు విడుదల చేస్తామని నమ్మబలికింది. 

పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ఆస్పత్రి మధ్య ట్రైపార్టీ అగ్రిమెంట్‌ ఉంటుందని పేర్కొంది. ‘‘పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సకాలంలో రుణం తిరిగి చెల్లించకపోతే ఆస్పత్రుల నుంచి వసూలు చేస్తాం..’’ అని ఆ అగ్రిమెంట్‌లో నిబంధన పెట్టారు. వడ్డీ, అసలు మొత్తాన్ని ఆస్పత్రులే చెల్లించాల్సి ఉంటుందని షరతు విధించారు. ఈ నిబంధన చూసి ఆస్పత్రుల యజమానులు కంగుతిన్నారు.  దీన్ని తొలగించాలని ఏపీ ప్రైవేట్‌ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశ) ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. సాధారణంగా ప్రభుత్వం విడుదల చేసే నిధుల్లో పది శాతం టీడీఎస్‌ కింద కట్‌ అవుతుంది. మరోవైపు అప్పులకు వడ్డీ ఆస్పత్రులే కట్టాలంటూ 8 శాతం కోత పెడుతున్నారు. ఇటు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా అటు ఆస్పత్రుల ముక్కుపిండి వసూలు చేసే విధానాలపై నెట్‌వర్క్‌ ఆస్పత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రజారోగ్యంతో చెలగాటం..
ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వం నేరుగా ఖజానా నుంచి ఆస్పత్రులకు బిల్లులు ఇవ్వడం ఆనవాయి­తీగా వస్తోంది. 2024లో చంద్రబాబు గద్దెనెక్కాక ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా రూపుమాపే కుట్రలో భాగంగా బిల్లులు చెల్లించకుండా తొక్కిపెట్టారు. తన బావ­మరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆస్పత్రికి మాత్రం అడ్డదారుల్లో బిల్లులు ఇస్తూ, మిగిలిన ఆస్పత్రులకు రూ. 3 వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ఎఫ్‌ఆర్‌బీఎం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలన్నింటినీ ఉల్లంఘిస్తూ 23 నెలల్లో రూ.3.56 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి ఆరోగ్యశ్రీ బిల్లులు మాత్రం చెల్లించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement