సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం.. మంగళవారం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే మంగళవారం మరో రూ.4,600 కోట్ల అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఎనిమిదేళ్ల కాల వ్యవధిలో రూ.1,800 కోట్లు, 16 ఏళ్ల కాల వ్యవధిలో రూ.1,800 కోట్లు, 30 ఏళ్ల కాల వ్యవధిలో రూ.1,000 కోట్ల అప్పును చంద్రబాబు సర్కారు చేయనుంది.
ఈ మేరకు ఆర్‌బీఐ శనివారం నోటిఫై చేసింది. ఈ నెల 7వ తేదీనే ప్రభుత్వం రూ.4,400 కోట్లు అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేసే అప్పుతో ఆ మొత్తం రూ.9,000 కోట్లకు చేరనుంది. అలాగే చంద్రబాబు ప్రభుత్వం 23 నెలల్లోనే చేసిన మొత్తం అప్పు రూ.3,56,655 కోట్లకు చేరనుంది. ఈ లెక్కన నెలకు సగటున రూ.15,506 కోట్లు, రోజుకు రూ.516 కోట్ల అప్పు చేసింది.


