17 నెలల చంద్రబాబు పాలనలో ప్రజలపై అప్పుల భారం
కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.2.27 లక్షల కోట్ల అప్పు
ఇందులో బడ్జెట్ అప్పులే రూ.1,40,602 కోట్లు
బడ్జెట్ బయట అప్పులు రూ.86,383 కోట్లు
అయినా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఎగనామం
అప్పుల వృద్ధి తప్ప ఆస్తుల కల్పన లేదు
17 మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ సంపదగా ఆస్తులు సృష్టించిన వైఎస్ జగన్
వాటిని పీపీపీ పేరుతో ప్రైవేట్‌పరం చేస్తున్న బాబు సర్కారు
సాక్షి, అమరావతి: ప్రతి మంగళవారం... అప్పు వారం అన్నట్లుగా సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ అప్పు చేసింది. తాజాగా రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ రుణాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. తద్వారా 17 నెలల్లో ఏకంగా రూ.2.27 లక్షల కోట్ల అప్పు చేసినట్లయింది. బడ్టెట్ లోపల, బడ్జెట్ బయట కలిపి ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రజలపై భారీ భారం మోపింది. ఎడాపెడా అప్పులు, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌పరం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోంది. సంపద సృష్టి అంటూ చెప్పిన మాటలు గాలికి కొట్టుకుపోగా... అప్పులు చేయడంలో మాత్రం భారీ వృద్ధి కనబరుస్తున్నారు.
⇒ కూటమి ప్రభుత్వం వచ్చాక బడ్జెట్ లోపల రూ.1,40,602 కోట్లు, బడ్జెట్ బయట రూ.86,383 కోట్లు అప్పు చేశారు. ఇంత స్వల్పకాలంలో ఇంత పెద్దఎత్తున అప్పులు గతంలో ఏ ప్రభుత్వం చేయకపోవడం గమనార్హం. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.55,383 కోట్లు అప్పు చేసింది. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు రుణం తీసుకుంటోంది.

సూపర్ సిక్సులు లేవు.. అప్పులే..
చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఇష్టానుసారం అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్ సిక్స్‌లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలు అమలు చేయకుండా ఎగనామం పెట్టింది. దీనికితోడు వైఎస్ జగన్ సీఎంగా ఉండగా... ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలతో ఆస్తులు కల్పించారు. వాటిని చంద్రబాబు సర్కారు పీపీపీ పేరుతో ప్రైవేట్‌పరం చేస్తోంది.
⇒ తీసుకున్న అప్పులను ఆస్తుల కల్పనపై వెచ్చించాలి. ఇదే విషయాన్ని ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు పదేపదే చెప్పారు. కానీ, ఇప్పుడు చేసిన అప్పులను ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మిగిలిన నిర్మాణాలకు వ్యయం చేయడం లేదు. అటు సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైనవి కూడా ఇవ్వడం లేదు. సంపద సృష్టిస్తానంటూ పెద్దపెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు రాష్ట్ర ఆదాయాన్ని పెంచలేకపోయారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వచి్చన ఆదాయం కూడా రానివిధంగా పాలన సాగిస్తున్నారు.
కళ్లు లేని ఎల్లోమీడియా
చంద్రబాబు సర్కారు కేవలం 17 నెలల్లోనే రూ.2.27 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. వైఎస్సార్‌సీపీ పాలనలో లేని అప్పులను కూడా ఉన్నట్లు అదే పనిగా తప్పుడు కథనాలతో ఊదరగొట్టింది. ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేశారంటూ దుష్ప్రచారం సాగించింది. వాస్తవానికి వైఎస్సార్‌సీపీ సర్కారు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగానే అప్పులు చేసినా రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా గగ్గోలుపెట్టింది. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు కనిపించడం లేదు.


