ఇకపై గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్(జీపీడీవో)గా కొనసాగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇకపై గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టును గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (జీపీడీవో)గా ప్రభుత్వం మార్పు చేసింది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు తీసుకునే వేతనాల్లో ఎలాంటి మార్పులు లేకుండా, ప్రస్తుతం ఉన్న ఐదు కేడర్‌లను నాలుగు కేడర్‌లకు కుదించింది. జనాభా, వార్షికాదాయం ప్రాతిపదికన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను కొత్తగా వర్గీకరిస్తూ గత నెల 10వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన అంశాలతో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మంగళవారం జీవో జారీ చేశారు. తద్వారా ఇప్పటిదాక అమలులో ఉన్న 7,244 క్లస్టర్ గ్రామ పంచాయతీల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలు పని చేస్తాయి.
359 అర్బన్ పంచాయతీలు, 3,082 గ్రేడ్–1 పంచాయతీలు, 3,163 గ్రేడ్–2 పంచాయతీలు, 6,747 గ్రేడ్–3 పంచాయతీలుగా వర్గీకరణ చేశారు. ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలతో ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14,989 మంది పంచాయతీ కార్యదర్శుల్లో 1,487 మంది గ్రేడ్–1.. 993 మంది గ్రేడ్–2.. 2,235 మంది గ్రేడ్–3.. 4,108 మంది గ్రేడ్–4.. 6,166 మంది గ్రేడ్–5లో పని చేస్తున్నారు.
తాజా వర్గీకరణలో వీరిలో 359 మంది అర్బన్ పంచాయతీ కార్యదర్శులుగా, 3,082 మందిని గ్రేడ్–1.. 3,163 మందిని గ్రేడ్–2.. 6,747 మందిని గ్రేడ్–3.. 1,638 మందిని అడిషనల్ గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులుగా కేడర్‌లో మార్పులు చేశారు. 359 అర్బన్ పంచాయతీల్లో ఉండే జీపీడీవో డిప్యూటీ ఎంపీడీవో స్థాయిలో కొనసాగడానికి సంబంధించి వేరుగా ఆదేశాలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,097 మంది జూనియర్ అసిస్టెంట్ కమ్ బిల్ కలెక్టర్లుగా పని చేస్తుండగా.. అందులో 359 జూనియర్ అసిస్టెంట్ కమ్ బిల్ కలెక్టర్ పోస్టులను సీనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు.
⇒ గ్రామ సచివాలయాల్లో పని చేసే మిగులు డిజిటల్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందితో పంచాయతీ రికార్డులు, పరిపాలనా ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి, వర్క్ ఫ్లో ఆటోమేషన్, రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం శాఖలో డెడికేటెడ్ ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.
⇒ గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్స్ ద్వారా ఖర్చు భరించే స్థాయి ఉండే పంచాయతీల్లో ప్రత్యేక శానిటేషన్ విభాగం, నీటి సరఫరా విభాగం, కంట్రీ ప్లానింగ్ విభాగం, స్ట్రీట్ లైటింగ్–ఇంజనీరింగ్ విభాగంలో రెవెన్యూ విభాగం తరహా సిబ్బందిని అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించుకోవడానికి అవకాశం కల్పించారు.
⇒ ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసే వారు కొత్తగా డీపీవో కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ తదితర క్యాడర్‌లో పని చేసేందుకు వీలుగా నిబంధనలు మార్పులు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఆయా మార్పులు చేర్పులకు సంబంధించి వేర్వేరుగా అదనపు వివరాలతో ప్రభుత్వం మరికొన్ని జీవోలు జారీ చేయనుంది.


