దేవదాయ శాఖలో 104 ఈఓ, 20 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ నిలిపివేత
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌కు ముందే మోకాలడ్డిన చంద్రబాబు ప్రభుత్వం
సచివాలయ సిబ్బందితో భర్తీ చేసేందుకు కుట్ర
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
పరీక్షలు పూర్తయిన డీఎల్, డీవైఈఓ ఫలితాల విడుదలలోనూ తాత్సారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఓ ఉద్యోగం ఇస్తామని, ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ధ్యేయమని ఊదరగొడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ససేమిరా అంటోంది. ఓ పక్క జాబ్ కేలండర్ అంటూ ప్రకటనలు చేసిన పాలకులు దేవదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ‘నో’ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. దేవదాయ శాఖలో భారీగా ఉన్న ఖాళీలను భర్తీచేయకుండా కేవలం 11 పోస్టులు మాత్రమే భర్తీ చేసేందుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ శాఖలోని సిబ్బంది వేతనాలను దేవాలయాలపై వచ్చే ఆదాయం నుంచే చెల్లిస్తారు కాబట్టి వేతనాలకు నిధుల కొరత సమస్య ఉత్పన్నం కాదు. అయినా ఖాళీలను భర్తీ చేసేందుకు సర్కారు అంగీకరించడంలేదు. కేవలం 11 పోస్టులను మాత్రమే భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీకి అనుమతినిచ్చినట్లు సమాచారం. రెండేళ్లుగా గ్రూప్–3 కేడర్‌లో ఉన్న ఈ ఉద్యోగాల కోసం వేలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే వారి ఆశలకు ప్రభుత్వం గండికొడుతోంది.
140 పోస్టుల్లో 11కే అనుమతి..
దేవదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉందని, వెంటనే వివిధ కేడర్లలో 140 పోస్టులు భర్తీచేయాలని సంబంధిత శాఖ ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏయే కేడర్‌లో ఎన్ని పోస్టులు అవసరమో వివరాలూ అందించింది. ఇందులో డిప్యూటీ కమిషనర్ 6, అసిస్టెంట్ కమిషనర్ 5, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ గ్రేడ్–1) 5, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ గ్రేడ్–3) 104, జూనియర్ అసిస్టెంట్ 20 పోస్టులు భర్తీచేయాలని కోరింది. అయితే, ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి అనుమతివ్వకుండా కేవలం డిప్యూటీ కమిషనర్ పోస్టులు 6, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు ఐదింటికి మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది.
దీంతో ఇన్నాళ్లు ఈ కేడర్ పోస్టుల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లినట్లయింది. త్వరలో కొత్త నోటిఫికేషన్ వస్తుందని ఆశించిన నిరుద్యోగులను ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. గతేడాది ఆగస్టులోనూ కేవలం ఏడు గ్రేడ్–3 ఈఓ పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వగా, వాటికి ఈ ఏడాది ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. అయితే, వీటిని ఇలా నేరుగా కాకుండా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులతో నింపేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేసినా ఇతర శాఖల్లోని సిబ్బందితో నింపేందుకు యోచిస్తున్నట్లు తెలిసింది.
డీఎల్, డీవైఈఓ ఫలితాల వెల్లడికి తాత్సారం
మరోవైపు.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ ద్వారా విడుదల చేసిన నోటిఫికేషన్లలో చాలావరకు పరీక్షలు పూర్తయినా ఫలితాలు విడుదలకు ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. 2023 డిసెంబరులో 290 డిగ్రీ లెక్చరర్, 38 డీవైఈఓ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. వీటికి 2024లో స్క్రీనింగ్, గతేడాది జూలైలో మెయిన్స్ పరీక్షలు పూర్తిచేశారు. తొమ్మిది నెలలవుతున్నా ఈ ఫలితాలు మాత్రం ప్రకటించడంలేదు. రిజర్వేషన్ అంశంపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయని ఇంతకాలం ప్రభుత్వం దాటవేస్తూ వచ్చింది. అయితే, గ్రూప్–1, 2 ఫలితాలు ప్రకటించిన ఏపీపీఎస్సీ డీఎల్, డీవైఈఓ ఫలితాలను విడుదల చేయలేదు. వాస్తవానికి.. డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల కొరత తీవ్రంగా ఉంది. అలాగే, విద్యాశాఖలో డీవైఈఓలు లేక ఎంఈఓలే ఇన్‌చార్జిలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పోస్టుల ఫలితాల వెల్లడిలో ఆలస్యంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.


