ఇక.. వారసత్వ సంపద వంతు | Chandrababu conspiracy on cultural monuments | Sakshi
Sakshi News home page

ఇక.. వారసత్వ సంపద వంతు

Apr 21 2026 5:41 AM | Updated on Apr 21 2026 5:41 AM

Chandrababu conspiracy on cultural monuments

పీ–4 కింద వారసత్వ, స్మారక చిహ్నాల దత్తత  

సీఎస్‌ఆర్‌ మాటున ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్న ప్రభుత్వం 

వేల ఏళ్ల నాటి సాంస్కృతిక కట్టడాలపై చంద్రబాబు సర్కారు కన్ను  

బౌద్ధరామాలు, గండికోట, లేపాక్షి, కొండపల్లి, చంద్రగిరి ఖిల్లా వంటివి ప్రైవేటుకే  

మాన్యుమెంట్స్‌లో వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి 

వారసత్వ కేంద్రాల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ ప్రభుత్వ నిర్ణయం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన వారసత్వ సంపద కేంద్రాలు, స్మారక చిహ్నాల (మాన్యుమెంట్స్‌) ప్రదేశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు చంద్రబాబు సర్కార్‌ బరితెగించింది. అభివృద్ధి ముసుగులో రూ.కోట్ల విలువైన పర్యాటక భూములను కొల్లగొడుతున్న తరహాలోనే అత్యంత ప్రాచీన, సంస్కృతికి అద్దం పట్టే వారసత్వ సంపదను సీఎస్‌ఆర్‌ ముసుగులో కార్పొరేట్‌ సంస్థలు, తమ బినామీల చేతుల్లో పెడుతోంది.

దేశవ్యాప్తంగా ఎక్కడా లేనివిధంగా చంద్రబాబు ప్రభుత్వం వారసత్వ కట్టడాల పరిరక్షణ బాధ్యతల నుంచి నిస్సిగ్గుగా తప్పుకోవడంతో పాటు.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి వాటి భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇందులో భాగంగానే 2024–29 పర్యాటక విధానానికి అనుగుణంగా ‘అడాప్ట్‌ మాన్యుమెంట్‌ పాలసీ’ని సోమవారం ప్రకటించింది. ఏపీ పురావస్తుశాఖ పర్యవేక్షణలో సురక్షితంగా ఉన్న మాన్యుమెంట్స్‌ ఇకపై ప్రైవేటు బ్రాండింగ్‌లో కనుమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కోనున్నాయి.  

మరుగుదొడ్లు, చెత్తకుండీలు ఏర్పాటు చేయలేరా?  
వారసత్వ సంపద కేంద్రాల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కనీసం అక్కడ పర్యాటకుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, చెత్తకుండీలు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఉంది. ప్రపంచ గుర్తింపు పొందిన నాగార్జునకొండ, గండికోట, లేపాక్షి, అమరావతి బౌద్ధసూ్థపం, ఉండవల్లి గుహలు, ఇతర బౌద్ధారామాలు, కొండపల్లి, చంద్రగిరి కోటలతో సహా మొత్తం వారసత్వ, స్మారక చిహ్నలను అంగట్లో సరుకు మాదిరిగా వేలం వేస్తోంది. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద వారసత్వ కట్టడాలను సంరక్షించేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు పబ్లిక్‌ ప్రైవేట్‌ పీపుల్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీ–4)లో ఐదేళ్ల పాటు వాటి పూర్తి నిర్వహణ బాధ్యతలను అప్పగించనుంది.

ఆ తర్వాత పనితీరును బట్టి కాలపరిమితి పొడిగిస్తామని పాలసీలో పేర్కొంది. ఆయా సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు ముందుగా మరుగుదొడ్లు, తాగునీరు, లైటింగ్, పార్కింగ్, ల్యాండ్‌ స్కేపింగ్‌ వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంతో పాటు టికెట్‌ కౌంటర్లు, స్నాక్‌ సెంటర్లు, విడిది కేంద్రాలు, ఇతర సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేసి సెమీ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.  

వారసత్వ బ్రాండింగ్‌ లేనట్లే.. 
చంద్రబాబు ప్రభుత్వం వారసత్వ కేంద్రాలను ప్రైవేటు పరం చేయడంతో వాటి సమగ్రతకు భంగం కలగడంతోపాటు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని పురాతత్వవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారసత్వ కేంద్రాలను కార్పొరేట్‌ ఈవెంట్ల కేంద్రంగా మార్చే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. వీటి నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ మాన్యుమెంట్‌ కోసమే ఖర్చుచేయాల్సి వచ్చినప్పుడు మాన్యుమెంట్‌ మిత్ర తమ సొంత, అనుకూల వ్యక్తులకే పనులు కట్టబెడితే సామాన్యులు ఎలా భాగస్వాములవుతారని, స్థానికులకు ఉపాధి ఎలా లభిస్తుందని ప్రశ్నిస్తున్నారు. 

సీఎస్‌ఆర్‌ కింద ఖర్చుచేస్తున్న సంస్థలు తమ బ్రాండింగ్‌ను పెంచుకుంటే వారసత్వ కేంద్ర ప్రాధాన్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. స్మారకచిహ్నం వద్ద ఇతర వాణిజ్య సేవల కోసం లీజ్‌ ఒప్పందం ద్వారా మూడోవ్యక్తి చేరికతో పురాతన కట్టడాలు, చిహ్నాల భద్రత కూడా దెబ్బతినే అవకాశం లేకపోలేదు. కేవలం కార్పొరేట్, ప్రైవేటు వ్యాపారులకు పన్ను మినహాయింపులు కల్పించడానికి, పనిలోపనిగా విలువైన ప్రజల సొత్తును తమ చేతుల్లో పెట్టుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర అన్న ఆరోపణలు వినవస్తున్నాయి. పైగా కార్పొరేట్ల రాకతో  సామాజిక–ఆరి్థక విధ్వంసం జరిగే ప్రమాదం ఉంది. అంటే స్థానిక (గైడ్లు, చిన్న వ్యాపారుల) జీవనోపాధిని దెబ్బతీసి కార్పొరేట్‌ వెండర్లు ప్రవేశించే అవకాశం ఉంది.

సీఎస్‌ఆర్‌ అంటూనే వ్యాపారమా?
వారసత్వ సంపద కేంద్రాలు, స్మారక చిహ్నలను దత్తతకు ఇచ్చిన తర్వాత అభివృద్ధి చేయడంతో పాటు అక్కడే వారికి వాణిజ్య కార్యకలపాలకు, సౌండ్‌ అండ్‌ లైటింగ్‌కు  అవకాశం కల్పించినప్పుడు ఇక సీఎస్‌ఆర్‌కు అర్థం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.  దత్తత తీసుకునే ‘మాన్యుమెంట్‌ మిత్ర’కు, ప్రభుత్వానికి మధ్య అవగాహన ఒప్పందం చేసుకుని నిర్వహణ సాగించేలా ప్రత్యేకంగా పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, పురావస్తుశాఖ కమిషనర్‌ కన్వీనర్‌గా, దేవదాయశాఖ కమిషనర్‌తో కలిపి మొత్తం ఏడుగురితో కమిటీని నియమించింది. ఈ కమిటీ దత్తత కోసం అందుబాటులోని స్మారక చిహ్నాలను ఆమోదించి వాటిని మాన్యుమెంట్‌ మిత్రలకు ఇచ్చేందుకు వచ్చే బిడ్ల మూల్యాంకనం చేసి కట్టబెడుతుంది. ఇక వీటి దత్తత అనంతరం పర్యవేక్షణకు పురావస్తుశాఖ కమిషనర్‌ చైర్మన్‌గా, కలెక్టర్‌ వైస్‌ చైర్మన్‌గా మొత్తం తొమ్మిదిమందితో కమిటీని ఏర్పాటు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement