ఏపీలో రేషన్‌ డోర్‌ డెలివరీ భేష్‌

Central Govt Team Praises ration door delivery in Andhra Pradesh - Sakshi

వలంటీర్ల వ్యవస్థ, ఇంటింటికీ పంపిణీని ప్రశంసించిన కేంద్ర బృందం 

అన్నమయ్య జిల్లాలో రేషన్‌ షాపుల పరిశీలన

లబ్ధిదారులు సైతం సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడి

మదనపల్లె: జాతీయ ఆహార భద్రత చట్టం అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పౌర సరఫరాల వ్యవస్థ పనితీరు, రేషన్‌ డోర్‌ డెలివరీ, వలంటీర్ల వ్యవస్థ సమర్థంగా పనిచేస్తున్నాయని కేంద్ర బృందం సభ్యులు ప్రశంసించారు. జాతీయ ఆహారభద్రత చట్టం అమలు, పీడీఎస్‌ పంపిణీని క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు నియమించిన కేంద్ర పరిశీలకుల బృందం మంగళవారం అన్నమయ్య జిల్లాలో పర్యటించింది.

గాలివీడు, కురబలకోట, లక్కిరెడ్డిపల్లె, చిన్నమండ్యం, మదనపల్లె తదితర ప్రాంతాల్లో రేషన్‌ షాపులను తనిఖీచేసి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయ ఆహారభద్రత చట్టం సలహా సంఘం సభ్యులు జీఎన్‌ శర్మ, ఎంసీ చింపా మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆహార భద్రత చట్టం అమలు ఏపీలో బాగా జరుగుతోందని కితాబిచ్చారు.

పౌరసరఫరాల పంపిణీకి ఎండీయూ వాహనాలు, వలంటీర్ల వ్యవస్థ, రేషన్‌ డోర్‌ డెలివరీ సత్ఫలితాన్నిస్తున్నాయని ప్రశంసించారు. 100కి 98శాతం మంది ప్రజలు రేషన్‌ దుకాణాల ద్వారా సరుకులు పొందుతున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. రేషన్‌ సరుకుల పంపిణీపై లబ్ధిదారులను విచారిస్తే.. సేవలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top