
సాక్షి, కోనసీమ జిల్లా: రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్లపై సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరు ప్రజా వేదికలో ఎండీయూ ఆపరేటర్లను టార్గెట్ చేసిన సీఎం చంద్రబాబు.. డోర్ డెలివరీ చేసిన వాళ్లు దుర్మార్గులు, మాఫియా అంటూ ప్రేలాపనలు చేశారు.
‘‘వీళ్లు బియ్యం ఇచ్చినట్టే ఇచ్చి కాకినాడకు తీసుకువెళ్లిపోయారు. కరుడుగట్టిన దుర్మార్గులు వీళ్లు. వేల కోట్లు ఖర్చు పెట్టే మాఫియాగా మారారు. రాజకీయ నాయకులు, ఆఫీసర్లను కొనే పరిస్థితికి వచ్చారు. వాళ్ల కొవ్వు ఎంతుందంటే నా దగ్గరకు కూడా వస్తున్నారు’’ అంటూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎండియూ ఆపరేటర్లను అవమానపరుస్తూ సీఎం మాట్లాడారు.
రేషన్ డీలర్లను టెర్రరిస్టులతో పోల్చిన సీఎం.. కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారంటూ ఆరోపించారు. గత ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోవడమే లక్ష్యంగా చంద్రబాబు మాట్లాడారు. వాలంటీర్ల తొలగింపుపై ఒక్క ముక్క కూడా ప్రస్తావించని బాబు.. చేనేత మత్స్యకారులకు విస్తృతంగా సహాయం అందిస్తున్నామంటూ డాంబికాలు పలికారు.
హ్యాండ్లూమ్ కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్ లకు 500 యూనిట్లు విద్యుత్ పథకం అమలు చేయకపోయినా ఇస్తున్నట్లే మాట్లాడిన చంద్రబాబు.. కోనసీమ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పదివేల ఇళ్లకు సోలార్ పవర్ ఉపయోగించేటట్లు చర్యలు తీసుకోవాలంటూ వేదికపైన కలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చారు.