పల్లెల్లో వైఎస్సార్‌సీపీ అభిమానుల సంబరాలు

Celebrating YSRCP fans in the villages of AP for victory in panchayat elections - Sakshi

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో విజయదుందుభితో మిన్నంటిన ఆనందం

81.25% పంచాయతీల్లో సర్పంచులుగా అధికారపార్టీ అభిమానుల ఎన్నిక 

టీడీపీకి 15.66 శాతమే 

సాక్షి, అమరావతి: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో వైఎస్సార్‌సీపీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పల్లెల్లో పార్టీ అభిమానుల ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఇదే ఊపుతో రెండు, మూడు, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొలిదశలో 12 జిల్లాల పరిధిలోని 3,249 గ్రామ పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయగా 525 చోట్ల సర్పంచులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇందులో 90 శాతం వైఎస్సార్‌సీపీ అభిమానులే ఉండడం గమనార్హం. ఏకగ్రీవాల అనంతరం 2,724 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 2,721 చోట్ల మంగళవారం పోలింగ్‌ జరిగింది.

శ్రీకాకుళం జిల్లాలో ఓ పంచాయతీలో ఎవరూ నామినేషన్‌ వేయనందున, నెల్లూరు జిల్లాలో ఒక గ్రామంలో ప్రజలు ఎన్నికలను బహిష్కరించడంవల్ల పోలింగ్‌ జరగలేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక సర్పంచి అభ్యర్థి బ్యాలెట్‌ బాక్సు ఎత్తుకుపోవడంవల్ల పోలింగ్‌ నిలిచిపోయింది. ఈ మూడు పంచాయతీల్లో ఎన్నికలు/రీపోలింగ్‌ నిర్వహించాల్సి ఉంది. ఏకగ్రీవాలతో కలిపి మిగిలిన 3,246 పంచాయతీల ఫలితాలు బుధవారం తెల్లవారుజాముకు వెల్లడయ్యాయి. ఇందులో ఏకగ్రీవాలతో కలిపి 2,640 మంది వైఎస్సార్‌సీపీ అభిమానులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. 81.25 శాతం పంచాయతీల పాలనాధికారాలను ప్రజలు అధికారపార్టీ అభిమానులకు అప్పగించారు. 510 గ్రామాల్లో మాత్రమే టీడీపీ అభిమానులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. అనగా 15.66 శాతం పంచాయతీలకే వారు పరిమితమయ్యారు. తొలివిడత ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో టీడీపీ అభిమానుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఇక ఇతరులకు 96 పంచాయతీలు దక్కాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top