కారు నేర్చుకుందామని రోడ్డుపైకి..

Car Accident While Learning Process in East Godavari - Sakshi

బ్రేక్‌ అనుకుని యాక్సిలేటర్‌ తొక్కడంతో ప్రమాదం 

ఇద్దరికి స్వల్ప, ఒకరికి తీవ్ర గాయాలు  

తూర్పుగోదావరి ,రావులపాలెం: సరదాగా కారు నేర్చుకుందామని రోడ్డుపైకి రావడం.. అనుకోని ఘటనలో కంగారుగా బ్రేక్‌కు బదులు యాక్సి లేటర్‌ తొక్కడంతో ప్రమాదానికి దారి తీసింది. ఈ ఘటనలో ఇద్దరు గాయాల పాలవడంతో పాటు మరొకరి పరిస్థితి విషమంగా మారింది. గురువారం రావులపాలెం సీఆర్‌సీ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపాలెం మండలం దేవరపల్లిలోని ఓ పరిశ్రమలో గల్లా రాజారావు అసిస్టెంట్‌ అకౌంట్స్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం కారు నేర్చుకుందామని డ్రైవింగ్‌ చేస్తూ సీఆర్‌సీ రోడ్డులోకి వెళ్లాడు. ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక ప్రాంతానికి వచ్చే సరికి ముందు వెళ్తున్న మోటార్‌సైకిల్‌ను ఓ స్కూటీ  స్వల్పంగా ఢీకొట్టింది.

దీంతో కంగారు పడి రాజారావు బ్రేక్‌ వేయబోయి యాక్సిలేటర్‌ తొక్కడంతో కారు అదుపుతప్పి ముందుకు వేగంగా దూసుకుపోయింది.  అదే దారిలో ముందు వెళ్తున్న మోటారు సైకిల్‌ను, తర్వాత ఎదురుగా వస్తున్న గూడ్స్‌ ఆటోను ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో కేతరాజుపల్లికి చెందిన మోటార్‌ సైక్లిస్టు గంధం ప్రసాద్‌ తీవ్ర గాయాల పాలయ్యాడు. స్కూటీ నడిపే వ్యక్తి ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామానికి చెందిన జి.వెంకటేశ్వరరావుకు, రాజమహేంద్రవరానికి చెందిన ఆటో డ్రైవర్‌ పి.అప్పారావు స్వల్పంగా గాయపడ్డారు. ప్రసాద్‌ను అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన రాజారావును అదుపులోకి తీసుకున్నట్టు మరో అదనపు ఎస్సై ఆర్‌.బెన్నీరాజు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top