కాలుష్య భూతంపై ప్రక్షాళన అస్త్రం

Call of the Commissioner for Prevention Of Godavari River Pollution - Sakshi

నడుం బిగించిన నగరపాలక సంస్థ

నదీ కాలుష్య నివారణకు కమిషనర్‌ పిలుపు

పుష్కర ఘాట్‌ వద్ద పావన జలాల్లో స్వయంగా చెత్త తొలగింపు

ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి

రాజమహేంద్రవరం సిటీ: పవిత్ర గోదావరి నదీ స్నానం ఎంతో పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఈ నదీ తీరంలోని ప్రధాన నగరం రాజమహేంద్రవరంలోని ఘాట్‌లలో మాత్రం పరిస్థితులు పుణ్యస్నానానికి తగినట్టుగా ఉండవు. ఎగువన కోటిలింగాల నుంచి దిగువన గౌతమ ఘాట్‌ వరకూ ప్రతి చోటా ఈ పావన వాహిని మురికికూపాన్ని తలపిస్తుంది. దీంతో ఈ నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. 

నగరంలో ప్రధానంగా గోదావరి ఘాట్‌లు తొమ్మిది ఉన్నాయి. కొంతవరకూ పుష్కర ఘాట్‌ మినహా మిగిలినచోట్ల ప్లాస్టిక్‌ వ్యర్థాలు, మలినాలు, మురుగు, నాచు పేరుకుపోయి దుర్గంధభరితంగా మారాయి. అనేక ప్రసిద్ధ ఆలయాలకు నెలవుగా ఉన్న గౌతమ ఘాట్‌ వద్ద గోదావరిలో నాచు, వ్యర్థాలు విపరీతంగా పేరుకుపోయాయి. ఇబ్బందికర పరిస్థితుల మధ్యనే స్నానాలకు దిగుతూ దుర్గంధంతో పాటు దురదలతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు వాపోతున్నారు. దేశంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందిన కోటిలింగాల ఘాట్‌ రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 

ఇంత పొడవైన ఈ ఘాట్‌ వద్ద గోదావరిలో దిగేందుకు, స్నానం చేసేందుకు సైతం అవకాశం లేని దుస్థితి. అంతలా ఇక్కడ వ్యర్థాలు పేరుకుపోయాయి. కోటిలింగాల ఘాట్‌కు పుష్కర ఘాట్‌కు మధ్య నగర ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు ఇన్‌టేక్‌ పాయింట్‌ ఉంది. ఇక్కడ విపరీతంగా ఉన్న వ్యర్థాల మధ్య నుంచే గోదావరి జలాలను సేకరించాల్సిన దుస్థితి. ఈ రెండు ఘాట్‌లకు దిగువన కూడా ప్రధాన రక్షిత మంచినీటి సరఫరా పథకం ఇన్‌టేక్‌ పాయింట్‌ ఉంది. వీటి నుంచి కలుషితమైన నీటినే నగర ప్రజలకు ఫిల్టర్‌ చేసి అందిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. 

ప్రక్షాళనకు కదిలిరావాలి 
గోదావరి నదీ కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండటంపై నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం దృష్టి సారించింది. నగరంలోని ఘాట్‌ల వద్ద పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు ఆదివారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పుష్కర్‌ ఘాట్‌ వద్ద గోదావరి నదిలో చెత్తను తొలగించే కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌ స్వయంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాకే తలమానికమైన గోదావరి నదీ తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి స్ఫూర్తి నింపాలని కోరారు. ఈ నది పవిత్రతను కాపాడటంలో ఎవరికి వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో గోదావరి ప్రక్షాళనను ఉద్యమంలా చేపట్టాల్సి ఉందని అన్నారు. ఈ విషయంలో నగరాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని కోరారు. నదీ జలాలు కలుషితం కాకుండా చూడాలని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యం లేకుండా ఇది సాధ్యం కాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ఇతరులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావడం అభినందనీయమని దినేష్‌కుమార్‌ అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top