బాజాభజంత్రీలతో పెళ్లి బృందం.. ఒక్కసారిగా షాక్‌.. కాడెద్దులు పరుగో పరుగు..

Bullock Cart Crash Into The Bridal Party In Kurnool District - Sakshi

వెల్దుర్తి(కర్నూలు జిల్లా): బాజా భజంత్రీలతో వెళ్తున్న పెళ్లి బృందంపై కాడెద్దులు బండితో సహా పరుగుతీయడంతో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన రామళ్లకోటలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన సాలెవాళ్ల పెళ్లికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా పెళ్లి బృంద సభ్యులు గ్రామ సమీపాన గల పాలకొమ్ము, పుట్టమన్ను తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సమయంలో బోయనపల్లెకు చెందిన రైతు తన ఎద్దులబండి (టైర్ల చక్రాలు కలిగిన బండి)లో వేరుశనగ కట్టె తీసుకువెళ్లేందుకు రామళ్లకోటకు వచ్చి వనం వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గల పంక్చర్‌ షాపు వద్ద టైర్లలో గాలి చెక్‌ చేసుకుంటున్నాడు.

చదవండి: భర్త సంతకు తీసుకువెళ్లలేదని ఎంత పనిచేశావమ్మా..

ఆలయం పక్క నుంచి బాజాభజంత్రీలతో పెళ్లి బృందం ముందు వెళ్తుండగా కాడెద్దులు ఒక్కసారిగా బండితో సహా వెనుక నుంచి పరుగు లంఘించుకుంటూ వచ్చాయి. ఎదురుగా ఉన్న పెళ్లిబృందాన్ని ఢీకొట్టుకుంటూ దూసుకుని వెళ్లాయి. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. కాడెద్దులు పరుగుపరుగున అరకిలోమీటరు దూరం వెళ్లిన తరువాత కాడి పట్టెలు తెగిపోయి బండి నుంచి విడిపోయాయి. అక్కడి నుంచి పొలాల వైపు పరుగుతీయడంతో వాటిని పట్టుకునేందుకు యజమానికి దాదాపు గంట సమయం పట్టింది. గాయపడిన ఇద్దరు మహిళలను చికిత్స కోసం వెల్దుర్తి ఆసుపత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top