బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏపీ సర్కిల్‌ ఆదాయం లక్ష్యం రూ.1,000 కోట్లు

BSNL income is Rs 700 crores - Sakshi

ప్రస్తుత ఆదాయం రూ.700 కోట్లు

సంస్థ సీజీఎం శేషాచలం

అల్లిపురం (విశాఖ దక్షిణ): బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏపీ సర్కిల్‌ ఆదాయం ప్రస్తుతం రూ.700 కోట్లు ఉందని, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 10% అధికమని ఏపీ టెలికం సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌(సీజీఎం) ఎం.శేషాచలం తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.1000 కోట్లకు పైగా లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. డాబాగార్డెన్స్‌లో గల సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆత్మనిర్బర్‌ భారత్‌ కింద స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆదేశించిందని, ఇప్పటికే పాన్‌ ఇండియాలో టీసీఎస్, ఐటీఐ కంపెనీలకు లక్ష సైట్‌లు కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చామని, ఏడాదిలో ఆ ప్రాజెక్టులు పూర్తవు­తాయని భావిస్తున్నట్టు తెలిపారు.

ఈ ఏడాది జూలైలో పంజాబ్‌లో బీటా లాంచ్‌ పూర్తయిందని, దీని ద్వారా 4జీ పరికరాలు 5జీకి అప్‌గ్రేడ్‌ అయినట్టు తెలిపారు. ఏపీ సర్కిల్‌లో 4300 సైట్లలో 4జీ పరికరాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. విశాఖ సర్కిల్‌లో 463 సైట్‌లు 4జీగా ఇప్పటికే సేవలందిస్తున్నా­యన్నా­రు. అంత్యోదయ మిషన్‌ కింద మారు­మూల గ్రామాలకూ కనెక్టివిటీ అందిస్తున్నా­మని, డిసెంబర్‌ నాటికి ఆ పనులు పూర్తవు­తాయని, వాటికి సోలార్‌ పవర్‌తో కనెక్షన్‌ ఇస్తామన్నారు.

ఏపీలో 4జీ సేవలు 3800 గ్రామాల్లో అందుబాటులోకొస్తాయని వెల్లడించారు. 2026 నాటికి సంస్థ లాభాల బాటలోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందించామని, ప్రభుత్వ శాఖలన్నీ బీఎస్‌ఎన్‌ఎల్‌ కనెక్షన్లు వాడేలా మార్కెటింగ్‌ విభాగాన్ని పటిష్టం చేస్తామని శేషాచలం వివరించారు. సమావేశంలో విశాఖ జిల్లా జనరల్‌ మేనేజర్‌ పి.పాల్‌ విలియమ్స్, జి.ఆడం, మొబైల్స్‌ విభాగం హెడ్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top