
సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్ దయనీయ పరిస్థితిపై సీఎం చంద్రబాబుకు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. కార్డియాలజీ విభాగానికి చెందిన వైద్య పరికరాలు కేజీహెబ్‌లో అందుబాటులో లేకపోవడం బాధాకరమని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు 30 నుంచి 40 వరకు గుండె శస్త్ర చికిత్సలు జరుగుతాయని లేఖలో బొత్స ప్రస్తావించారు.
‘‘కేజీహెచ్‌కు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రతో పాటు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా వైద్యం కోసం వస్తారు. నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ వైద్యం చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా సమస్యను వెంటనే పరిష్కరించాలి. వీలైనంత త్వరగా కేజీహెచ్‌లో సాధారణ పరిస్థితిని తీసుకురావాలి’’ అంటూ లేఖలో బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.