కోవిడ్‌ను మించి కంగారు!

Black fungus Most feared Virus Andhra Pradesh - Sakshi

జనాన్ని అత్యధికంగా భయపెట్టిన బ్లాక్‌ ఫంగస్‌

అతి తక్కువ మందికే సోకినా.. అత్యధిక వ్యయం 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కంటే జనాన్ని బ్లాక్‌ ఫంగస్సే ఎక్కువగా భయపెట్టింది. సోకింది అతికొద్దిమందికే అయినా బాధిత కుటుంబ సభ్యులకు వణుకు పుట్టించింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొదటి, సెకండ్‌ వేవ్‌ కలిపి 20 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులను అంచనా వేస్తే కేవలం 0.24 శాతం మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన కేసులను బట్టి చూస్తే.. ప్రతి 10 వేల మందిలో ఇద్దరికే ఇది సోకింది. కానీ వెయ్యి మందికి చేసిన వ్యయం ఈ ఇద్దరికే అయినట్టు అంచనా వేశారు. ఖరీదైన మందులు,  వైద్యుల సమూహంతో చికిత్స, దీర్ఘకాలం మందులు వాడాల్సి రావడం దీనికి కారణంగా చెప్పొచ్చు. 

ఇప్పటికీ 337 మందికి కొనసాగుతున్న చికిత్స
ఈ బ్లాక్‌ ఫంగస్‌(మ్యుకర్‌ మైకోసిస్‌) జబ్బుకు ఇప్పటికీ 337 మందికి చికిత్స కొనసాగుతూనే ఉంది. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు బాగా తగ్గుముఖం పట్టినా దీర్ఘకాలిక చికిత్స చేయాల్సి ఉన్నందున చికిత్సను కొనసాగించాల్సి వస్తోంది. రోగులు పూర్తిగా కోలుకునే వరకూ నెలల తరబడి చికిత్స చేయాల్సి ఉంటుంది. దీనికోసం యాంఫొటెరిసిన్‌ బి, పొసకొనజోల్‌ ఇంజక్షన్లతో పాటు పొసకొనజోల్‌ మాత్రలూ తరచూ ఇవ్వాల్సి ఉంది.

ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఈ 337 మందిలో అత్యధికంగా 132 మంది గుంటూరు జిల్లాలోనే ఉన్నారు. ఎక్కువ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 804 చిత్తూరు జిల్లాలో నమోదయ్యాయి. ఇది సోకిన బాధితుల్లో అత్యల్పంగా ఒకే ఒక్కరు విజయనగరం జిల్లాలో మృతిచెందారు. ఈ జిల్లాలో ఇప్పటివరకూ నమోదైంది కూడా 26 కేసులే. కోవిడ్‌తో పాటు బ్లాక్‌ ఫంగస్‌నూ ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. బ్లాక్‌ఫంగస్‌ మందుల కోసమే ప్రభుత్వం రూ.110 కోట్లు వ్యయం చేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top