ఒంగోలు జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు

Better Medical Services at Ongole GGH: Balineni Srinivas Reddy - Sakshi

ఆస్పత్రిపై అవాస్తవ ప్రచారాలు సరికాదు

కోవిడ్‌ సమయంలో జీజీహెచ్‌ సేవలు అభినందనీయం

నెలాఖరుకు ఆరోగ్య శాఖ మంత్రితో సమావేశం నిర్వహిస్తాం

హెచ్‌డీఎస్‌ సమావేశంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి 

ఒంగోలు అర్బన్‌: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో మెరుగైన వైద్య సేవలందిస్తామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వ వైద్య కళాశాలలో కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధిసొసైటీ (హెచ్‌డీసీ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న బాలినేని మాట్లాడుతూ జీజీహెచ్‌లో కోవిడ్‌ అనంతరం ఓపీలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. రోగులకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి మందుల కొరత లేదని తెలిపారు. అయితే కొన్ని పత్రికలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, ఇది సరికాదని హితవు పలికారు.

జీజీహెచ్‌లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందిస్తామన్నారు. పేదలకు వైద్యం అందించే జీజీహెచ్‌పై అసత్య ప్రచారాలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రజలకు ఆసుపత్రిపై నమ్మకం కలిగేలా ఉన్నవి ఉన్నట్లు తెలియపచాలన్నారు. కోవిడ్‌ సమయంలో జీజీహెచ్‌ అందించిన వైద్య సేవలు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. కోవిడ్‌ సేవలు అభినందనీయమన్నారు. ఈ నెల 30వ తేదీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీతో ఒంగోలులో ప్రత్యేకంగా వైద్య శాఖపై సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.  

డిమాండ్‌ తగినట్లుగా వైద్య సేవలు: కలెక్టర్‌ 
జీజీహెచ్‌లో డిమాండ్‌కు తగినట్లుగా మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. ఎమ్మెల్యే బాలినేనితో కలిసి హెచ్‌డీఎస్‌ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. రోగుల నమోదు నుంచి మందుల లభ్యత, రక్త నిల్వలు, వైద్య సిబ్బంది ఇతర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కోవిడ్‌ ఉధృతి తగ్గినందున ఓపీలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. నెలకు రూ.12వేల నుంచి రూ.20వేల వరకు పెరిగాయన్నారు. నెలలో సుమారు 2 వేల మైనర్‌ ఆపరేషన్‌లు, 350 వరకు మేజర్‌ ఆపరేషన్‌లు జరగుతున్నాయన్నారు. హైరిస్క్‌ కేసులు మాత్రమే గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో మందుల కొరత లేదని, అవసరమైన మందులు 48 గంటల్లో సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌ నుండి జీజీహెచ్‌కు అందుతున్నాయన్నారు. 

ఏవైనా కొన్ని మందులు అందుబాటులో లేకుంటే వాటిని హెచ్‌డీఎస్‌ నిధులతో ప్రైవేట్‌ కొనుగోలు చేసి రోగులకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. మందులు కాని రక్తం కాని రోగులకు భారం కాకుండా ఎటువంటి ఆర్థిక భారం లేకుండా పూర్తి స్థాయిలో వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వైద్యులను అనుమతి లేకుండా గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ ఎం రాఘవేంద్రరావు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ భగవాన్‌ నాయక్, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ సుధాకర్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ రవి, ఓఎంసీ కమిషనర్‌ వెంకటేశ్వరరావు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top