ముమ్మాటికీ టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రే! | Bandi Nithyananda Reddy wife Deepthi Reddy with the media | Sakshi
Sakshi News home page

ముమ్మాటికీ టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రే!

Apr 22 2026 3:37 AM | Updated on Apr 22 2026 3:38 AM

Bandi Nithyananda Reddy wife Deepthi Reddy with the media

నా భర్తను అన్యాయంగా ఇరికిస్తున్నారు  

డీఎస్పీ బాలస్వామిరెడ్డి ప్రవర్తన అగౌరవపరిచే విధంగా ఉంది  

దర్యాప్తులో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి 

మీడియాతో బండి నిత్యానందరెడ్డి సతీమణి దీప్తిరెడ్డి 

కడప అర్బన్‌: కడప రిమ్స్‌ ఆవరణలో ఈ నెల 6న కలమల్ల పెద్దదస్తగిరి (53) దారుణ హత్యకు గురైన కేసు విచారణ వెనుక ముమ్మాటికీ టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్ర ఉందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ డిప్యూటీ మేయర్‌ బండి నిత్యానందరెడ్డి సతీమణి దీప్తిరెడ్డి చెప్పారు. మంగళవారం కడపలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తన భర్త నిత్యానందరెడ్డి వైఎస్సార్‌సీపీ తరఫున కడప డిప్యూటీ మేయర్‌ వరకు ఎదిగారన్నారు. ఆయనను రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రతో కూటమి పెద్దలు పెద్ద దస్తగిరి హత్య కేసులో తన భర్తకు సంబంధం అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. 

పెద్ద దస్తగిరి ఇంటినుంచి స్వాదీనం చేసుకున్న డాక్యుమెంట్లలో ఒక చిన్న అగ్రిమెంట్‌గానీ, డాక్యుమెంట్‌గానీ తన భర్త పేరుతో ఉంటే తమపై ఎలాంటి చర్యలను తీసుకున్నా తలొగ్గుతామన్నారు. మీడియాలో తన భర్తపై లేనిపోని ఆరోపణలతో కూడిన కథనాలు ప్రచారం చేస్తూ వ్యక్తిగతంగా, రాజకీయంగా, కుటుంబపరంగా తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించడం అన్యాయమని వాపోయారు. తన భర్త నిత్యానందరెడ్డిపై ఐదు కేసులున్నాయని, నేరచరిత్ర ఉందని ప్రచారం చేస్తున్నారన్నారు. అవన్నీ సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో పెట్టిన కేసులేనని చెప్పారు. 

ఇన్‌చార్జి డీఎస్పీ బాలస్వామిరెడ్డి పనితీరు, మాటతీరు అగౌరవ పరిచేవిధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దదస్తగిరి హత్య కేసులో నిందితులతో బలవంతంగా స్టేట్‌మెంట్‌ తీసుకుని తన భర్త పేరును చేర్చడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కొట్టి ఒప్పించడం ఏమాత్రం సహేతుకం కాదని, నిందితుల్ని కోర్టులో బహిరంగంగా విచారించాలని ఆమె కోరారు. డీఎస్పీ బాలస్వామిరెడ్డి విచారణపైనా, దర్యాప్తుపైనా తమకు నమ్మకం లేదన్నారు. 

ఈ కేసును ప్రత్యేకంగా విచారణ చేయించి, నిజాయితీగా దర్యాప్తు కొనసాగించాలని ఆమె పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. తమ వ్యక్తిగత సహాయకుడు రాజ్‌కుమార్‌పై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి బలవంతంగా నిందితులలో ఒకరికి రూ.5 లక్షలు నిత్యానందరెడ్డి ఇచ్చినట్టు బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేశారని దీప్తిరెడ్డి ఆరోపించారు.  

Advertisement
 
Advertisement
Advertisement