
మాట్లాడుతున్న అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు
వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావుపై ఏఎస్పీ అనుచిత వ్యాఖ్యలు
ఏలూరు టౌన్: పోలీసులపై విమర్శలు చేస్తే కేసులు పెట్టి.. దూల తీరుస్తామని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (ఏఎస్పీ) నక్కా సూర్యచంద్రరావు వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును బెదిరించారు. ఏలూరులో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యచంద్రరావు చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నెల 5న కైకలూరు మండలం దానగూడెంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
ఈ ఘటనపై పోలీస్ అధికారులు పలువురిపై కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై విషం చిమ్మడమే లక్ష్యంగా కైకలూరు ఎమ్మెల్యే కామినేని వివాదాస్పద వ్యాఖ్యలు, దీనిపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలను ఈ నెల 26న జరిగిన విలేకరుల సమావేశంలో దూలం నాగేశ్వరరావు ఖండించారు. ఈ క్రమంలో కామినేని ఒత్తిడులకు లొంగకుండా కొందరు పోలీసులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
దళితులపై అన్యాయంగా హత్యాప్రయత్నం చేసిన కేసులో కామినేనికి నచి్చనట్లుగా, ఆయన చెప్పిన విధంగా కేసులు రాయలేదని, అరెస్ట్ చేయలేదని టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణను వీఆర్‌కు పంపించారని తెలిపారు. ఎమ్మెల్యే మనిషిగా పేరొందిన రూరల్ సీఐ రవికుమార్ దీనంతటకీ కారణమని కూడా విమర్శించారు. తనకు కావాల్సిన రవికుమార్ వంటి వారిని కాపాడుకుంటూ, నిజాయితీగా పనిచేసే కృష్ణ అనే ఇన్‌స్పెక్టర్‌ను వీఆర్‌కు పంపించారని పేర్కొన్నారు.
సమయం వస్తుందన్న ఏఎస్పీ..
ఈ అంశాలను తాజాగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యచంద్రరావు ప్రస్తావిస్తూ, ‘నోటి దూలెక్కి మాట్లాడితే, దూల తీర్చేసే సమయం వస్తుంది’ అని పేర్కొన్నారు. పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ సాధారణ బదిలీల్లో భాగంగానే సీఐ కృష్ణను బదిలీ చేశారని చెప్పారు.