ఏపీ తక్షణ స్పందన అందరికీ ఆదర్శం | Sakshi
Sakshi News home page

ఏపీ తక్షణ స్పందన అందరికీ ఆదర్శం

Published Wed, Aug 25 2021 2:15 AM

Arun Haldar Comments With Media About Andhra Pradesh Government - Sakshi

సాక్షి, అమరావతి: ప్రేమోన్మాది చేతిలో పది రోజుల క్రితం గుంటూరులో ఇంజనీరింగ్‌ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించిన తీరు అభినందనీయమని జాతీయ ఎస్సీ కమిషన్‌ ఉపాధ్యక్షుడు అరుణ్‌ హల్దార్‌ పేర్కొన్నారు. ఎస్సీ విద్యార్థిని హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరుకు నూటికి 200 మార్కులు వేయవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలు ముఖ్యంగా మహిళల రక్షణకు రాష్ట్ర  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. రమ్య హత్యోదంతం ఘటన అనంతరం ఏపీ ప్రభుత్వం వేగంగా వ్యవహరించిన తీరును దేశమంతా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర కేసుల్లోనూ ఇలాగే స్పందించాలని కమిషన్‌ కోరుకుంటోందని తెలిపారు.

ఘటన పూర్వాపరాలను పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్‌ బృందం మంగళవారం గుంటూరు చేరుకుని బాధిత కుటుంబాన్ని కలుసుకుని పరామర్శించి వివరాలు సేకరించింది. వెలగపూడిలోని సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తదితరులతో సమావేశం అనంతరం కమిషన్‌ సభ్యులు అంజుబాలా, సుభాష్‌పార్థిలతో కలసి అరుణ్‌ హల్దార్‌ మీడియాతో మాట్లాడారు. అత్యాచార నిరోధక చట్టాన్ని వేగంగా అమలు చేయడం, నిందితుడిని వెంటనే అరెస్టు చేయడం, చార్జ్‌షీట్‌ వేగంగా ఫైల్‌ చేయడం, పరిహారాన్ని వెంటనే చెల్లించడం ద్వారా ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.  

శభాష్‌ పోలీస్‌.. అవార్డులకు సిఫార్సు 
డీఐజీ నేతృత్వంలో గుంటూరు రూరల్, అర్బన్‌ ఎస్పీలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం పనితీరు ఎంతో బాగుందని అరుణ్‌ హల్దార్‌ అభినందించారు. ఈ కేసును వేగవంతంగా పరిష్కరించేలా కృషి చేసిన అధికారులకు అవార్డులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి  సిఫార్సు చేస్తామని చెప్పారు. ఎస్సీల వినతులు సత్వర పరిష్కారం కోసం జాతీయ కమిషన్‌ తరఫున ఒక ప్రత్యేక సెల్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. 

ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భద్రతకు ప్రత్యేక చర్యలు: సీఎస్‌  
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమం, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ తెలిపారు. గుంటూరు ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలిచిందని చెప్పారు. బాధితురాలి తల్లికి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిబంధనల ప్రకారం రూ.8.25 లక్షల పరిహారాన్ని అందించడంతోపాటు అదనంగా మరో రూ.10 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెల్లించినట్లు తెలిపారు. ఇంటిపట్టాను కూడా మంజూరు చేసి సొంత ఇంటి నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు వివరించారు.

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేలా గత ఫిబ్రవరిలో రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్‌ లెవెల్‌ హైపవర్‌ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగిందని, జిల్లాల్లో కలెక్టర్ల అధ్యక్షతన క్రమం తప్పకుండా సమావేశాలు జరుగుతున్నాయని వివరించారు. త్వరలో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ కూడా అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాల ప్రతినిధులతో సంప్రదించి స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ) రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. 

యుద్ధ ప్రాతిపదికన చర్యలు: డీజీపీ సవాంగ్‌ 
ఘటన జరిగిన వెంటనే పోలీస్‌ యంత్రాంగం యుధ్ధ ప్రాతిపదికన దర్యాప్తు చేపట్టి ఆధారాలు సేకరించి చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేసిందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. మహిళల భద్రత కోసం దిశ యాప్‌ను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడంతో రాష్ట్రానికి ఐదు జాతీయ అవార్డులు లభించాయని చెప్పారు. పోలీస్‌ సేవా యాప్‌ ద్వారా గత 10 నెలల వ్యవధిలో 7 లక్షల మందికిపైగా ఎఫ్‌ఐఆర్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీస్‌ శాఖ ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న నేపథ్యంలోగత ఏడాదిన్నర కాలంలో 34 వేల కేసులు రిజిస్టర్‌ అయ్యాయని, వీటిలో 52 శాతం ఫిర్యాదులు మహిళలకు సంబంధించినవేనని తెలిపారు. సమావేశంలో డీఐజీలు రాజకుమారి, పాలరాజు, గుంటూరు రూరల్, అర్బన్‌ ఎస్పీలు పాల్గొన్నారు. 

దిశ యాప్‌తో దేశానికే ఆదర్శంగా నిలిచారు 
మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ఎస్సీ కమిషన్‌ సభ్యులు అంజుబాలా ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి దిశ యాప్‌ ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. వీటిని సమర్థంగా నిర్వహిస్తూ ఏపీ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కమిషన్‌ బృందం వెంట సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే, కమిషనర్‌ హర్షవర్థన్‌ తదితరులున్నారు. 

మేం అడగకుండానే ప్రభుత్వం ఆదుకుంది 
ఇటీవల గుంటూరులో ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఎన్‌.రమ్య దారుణ హత్యకు గురైన ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబం కూడా అదే కోరుతోందని జాతీయ ఎస్సీ కమిషన్‌ ఉపాధ్యక్షుడు అరుణ్‌ హల్దార్‌ పేర్కొన్నారు. తాము వచ్చి అడగక ముందే బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకుని చట్టపరంగా రావాల్సిన అన్ని సదుపాయాలను అందచేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బాధిత కుటుంబం పట్ల ఏపీ ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించిందన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్‌ బృందం మంగళవారం గుంటూరులో పర్యటించింది. బాధితురాలు రమ్య ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించింది. సంఘటనా స్థలానికి వెళ్లి హత్య జరిగిన తీరుపై వివరాలు సేకరించింది. అనంతరం ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో వివిధ పక్షాల నుంచి వినతిపత్రాలు స్వీకరించింది. ఈ సందర్భంగా హల్దార్‌ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి చార్జిషీట్‌ దాఖలు చేశారని చెప్పారు.  

కేంద్ర సాయం అందించేలా చర్యలు.. 
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాధితురాలి కుటుంబానికి సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హల్దార్‌ తెలిపారు. అధైర్యం చెందవద్దని, బాధితులకు ఎస్సీ కమిషన్‌ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎస్సీల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కమిషన్‌ రక్షణ కల్పిస్తుందన్నారు. వివిధ పక్షాలు అందచేసిన వినతిపత్రాలను పరిశీలించి తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, విడదల రజని, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్‌రావు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మద్య విమోచన కమిటీ చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డితోపాటు పలు పార్టీల నేతలు 
కమిషన్‌ను కలిశారు.   

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement