నాలుగో విడత టిడ్కో ఇళ్లు పంపిణీకి ఏర్పాట్లు

Arrangements for distribution of fourth installment of TIDCO houses - Sakshi

వచ్చే నెల మొదటి వారంలో 14,460 యూనిట్ల అందజేత 

టిడ్కో బోర్డు డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం

సాక్షి, అమరావతి: పట్టణ పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న టిడ్కో (జీ+3) ఇళ్లు నాలుగో విడత పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి మొదటి వారంలో 14,460 మంది లబ్ధిదారులకు ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈమేరకు తీసుకోవాల్సిన చర్యలు, పెండింగ్‌ పనులపైనా టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్, ఎండీ శ్రీధర్‌ అధ్యక్షతన బుధవారం బోర్డు డైరెక్టర్లు సమావేశమై చర్చించారు.

నంద్యాల, శ్రీకాకుళం, పొన్నూరు, అడవి తక్కెళ్లపాడు, సాలూరు, కావలి ప్రాంతాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉన్నవాటిని అందజేయనున్నారు. ఇందులో నంద్యాల 5 వేలు, శ్రీకాకుళం 1,280, పొన్నూరు 2,368, అడవి తక్కెళ్లపాడు(గుంటూరు) 2,500, సాలూరు 1,200 యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి. మొదటి వారానికి కావలిలో మరో 2,112 యూనిట్లు కూడా అన్ని వసతులతో అందుబాటులోకి రానున్నాయి. కాగా, పంపిణీ చేసేనాటికి ఆయా ప్రాంతాల్లో అదనంగా ఎన్ని పూర్తయితే అన్నింటినీ అదే వేదిక ద్వారా లబ్ధిదారులకు అందజేయాలని భావిస్తున్నారు.

ఈ ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లలో ప్రభుత్వం రూ. 1కే అందిస్తున్న 300 చ.అడుగుల యూనిట్లు మినహా మిగిలిన 365, 430 చ.అ విస్తీర్ణం గల ఇళ్ల విషయంలో ఇప్పటివరకు రుణాలు మంజూరు కానివారికి నాలుగైదు రోజుల్లో మంజూరు చేయించి జనవరి మొదటి వారంలో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, జనవరి చివరినాటికి సీఎం వైఎస్‌ జగన్‌ నిర్దేశించిన 1.20 లక్షల యూనిట్ల పంపిణీపై తీసుకోవాల్సిన చర్యలపైనా సమావేశంలో చర్చించారు.

ఇప్పటికే 75 నుంచి 80 శాతం పూర్తయిన బ్లాకులకు యుద్ధప్రాతిపదికన ఎస్టీపీలు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని, లబ్ధిదారుల బ్యాంకు లింకేజీని సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని ఆయా పట్టణ స్థానిక సంస్థల అధికారులను ఆదేశించారు. బోర్డు సమావేశంలో చీఫ్‌ ఇంజినీర్‌ గోపాలకృష్ణారెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మితో పాటు టిడ్కో బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top