నూతన పద్ధతిలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌

Army Recruitment in new Agniveer method - Sakshi

ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు, ప్రాథమిక పరీక్ష

16న నోటిఫికేషన్‌.. మార్చి 15 వరకు దరఖాస్తులు

ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు విశాఖలో రిక్రూట్‌మెంట్‌

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ డైరెక్టర్‌ కల్నల్‌ వినయ్‌కుమార్‌ వెల్లడి

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): ఆర్మీలో వివిధ పోస్టులకు నియామకాలకు నూతన పద్ధతిని ప్రవేశపెట్టారు. అగ్నివీర్‌లో భాగంగా జూనియర్‌ కమిషన్‌ ఆఫీసర్స్‌ నుంచి ఇతర ర్యాంకుల అధికారుల నియామకాలకు మార్చి నుంచి నూతన పద్ధతిని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ డైరెక్టర్‌ కల్నల్‌ వినయ్‌కుమార్‌ బుధవారం ఇక్కడ వివరించారు.

ఆర్మీలో వివిధ పోస్టులకు ఈ నెల 16న నోటిఫికేషన్‌ విడుదలైందని, మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నూతన విధానం ప్రకారం తొలిసారిగా ఆన్‌లైన్‌ ద్వారా ఆర్మీలో వివిధ పోస్టులు/ర్యాంకులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. అభ్యర్థులు రూ.250 ఫీజుతో పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల స్క్రూటినీ అనంతరం ఆన్‌లైన్‌లోనే రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు.

ఈ పరీక్ష అడ్మిట్‌ కార్డులను 10 నుంచి 14 రోజుల్లో అభ్యర్థి చిరునామాకు పంపిస్తామన్నారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌ దేశంలో 176 ప్రాంతాల్లో నిర్వహిస్తామని, అభ్యర్థి ఎంచుకున్న ప్రాంతానికి వెళ్లి పరీక్ష రాసుకోవచ్చని చెప్పారు. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్‌ ఫిట్‌నెస్, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ నిర్వహిస్తామన్నారు. ఇందులో అర్హత సాధించిన వారిని వైద్య పరీక్షలకు పిలుస్తామన్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ విశాఖపట్నంలో జరుగుతుందని చెప్పారు. అభ్యర్థులు www.ojinindinarmy.nic.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు హెల్ప్‌డెస్క్‌ నెంబరు 7996157222 లో సంప్రదించవచ్చన్నారు. ఈ సమావేశంలో రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ మేజర్‌ జీఎస్‌ రంద్వా తదితరులు పాల్గోన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top