సాక్షి, విజయవాడ: మరోసారి కూటమి సర్కార్ దగా చేసింది. ఆక్వా మేత ధర కిలోకి రూ.4 తగ్గిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన అమలు కాలేదు. కిలోకి రూ.2 మాత్రమే ఫీడ్ కంపెనీలు తగ్గించాయి. చంద్రబాబు ఆదేశాలు అమలు కాకపోవడంతో తమను మళ్లీ మోసం చేశారంటూ ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రొయ్యలు, చేపల సాగుకు వినియోగించే అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయే తప్ప ఆక్వా ఉత్పత్తుల ధరలు మాత్రం పెరగడం లేదని రైతులు వాపోయారు. ముడిసరుకుల ధరలు పెరిగినప్పుడు ఫీడ్ ధర పెంచుతున్న కంపెనీలు.. వాటి ధరలు తగ్గినప్పుడు మాత్రం కూడా తగ్గించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, చంద్రబాబు ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం అన్నదాతల పాలిట దుఃఖీభవ పథకంగా మారింది. రాష్ట్రంలోని రైతులందరికీ కేంద్ర ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నమ్మబలికారు. అధికారంలోకి వచ్చాక నాలుక మడతేసి, కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ పథకంతో కలిపి రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. తొలి ఏడాది అదీ ఇవ్వకుండా పెట్టుబడి సాయాన్ని నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు.
రెండో ఏడాది అరకొర సాయం అందించిన చంద్రబాబు.. మూడో ఏడాది కూడా రైతులను వంచించేందుకు యత్నిస్తున్నారు. 2026–27 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు జమ చేయనున్నారు. అది కూడా అరకొరగానే ఇస్తున్నారు. కౌలు రైతులకు ఈసారీ మొండి చేయే చూపించారు.


