
సాక్షి, విజయవాడ: మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. రాజమండ్రి జైల్లో తనకు కేటాయించిన బ్లాక్‌లో సరైన సదుపాయలు లేవని చెబుతూ ఆయన పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే..
మంగళవారం ఎంపీ మిథున్‌రెడ్డి సదుపాయాల పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా? అని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారిని ఏసీబీ జడ్జి ప్రశ్నించారు. అయితే.. కోర్టు ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తామని జైలు అధికారులు చెప్పారు. దీంతో.. చట్టాలు చేసే వారికి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వాలి కదా అని జడ్జి అన్నారు. వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం లోపు ఈ పిటిషన్లపై తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో.. జులై 19వ తేదీ విచారణకు హాజరైన మిథున్‌రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఆదివారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆగష్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఆయన ఉంటున్న స్నేహా బ్లాక్‌లో సరైన సదుపాయాలు లేవని మిథున్‌రెడ్డి లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధికారులు మాత్రం తాము సదుపాయాలు కేటాయించామని చెబుతున్నారు.
